ఏలూరు మేత్రాసన చరిత్రలో చిరస్మరణీయులైన పీఠాధిపతులు, గురువులకు ఘన నివాళి

గురుశ్రీ ఇ. జీవరత్నం, మేత్రాసన యువతా డైరెక్టర్

26 Nov 2026

రానున్న ఏలూరు పీఠ స్వర్ణ జూబిలీని(1977-2027) దృష్టిలో ఉంచుకుని, ఏలూరు మేత్రాసన గురువులు, వివిధ మఠ సభల గురువులు, మరణించిన తమ పీఠాధిపతులను, గురువులను, పిమె మిషనరీలను, కుటుంబ సభ్యులను ఒక ఘనమైన మృతుల స్మరణ దివ్యపూజాబలి ద్వారా, గౌరవించి స్మరించుకోవడానికి 2026 నవంబర్ 23వ తేదీన జానంపేటలోని గురువుల సమాధుల తోటలో సమావేశమయ్యారు. మేత్రాసన ప్రేషిత కార్య పంచవర్ష ప్రణాళికలో (2023-2027), గురువుల, మఠవాసుల సంవత్సరంగా అంకితం చేయబడిన నాలుగవ యేట, ఏలూరు పీఠాధిపతి మహా ఘన డాక్టర్ పొలిమేర జయరావు గారి నాయకత్వ చొరవతో ఈ అర్థవంతమైన కార్యక్రమం నిర్వహించబడింది.

దాదాపు వందమంది గురువులు, అనేక మంది మఠకన్యలు పాల్గొనగా, బిషప్ పొలిమేర జయరావు గారు ఈ దివ్యపూజాబలిని నడిపించారు. *మేత్రాసన ప్రథమ పీఠాధిపతి ములగాడ జాన్ మునివర్యులను ప్రత్యేకంగా గౌరవపూర్వకంగా స్మరించారు.* మేత్రాసన ప్రగతికి పునాదులు వేసిన పూర్వ పీఠాధిపతుల, సుదీర్ఘ కాలం సేవలందించిన గురువుల, పిమె మిషనరీల సువార్తా ప్రచారక దీక్షను, కాపరిక అంకిత భావాన్ని, నిస్వార్థ పరిచర్యలను, పీఠకాపరి తన ప్రసంగంలో కృతజ్ఞతతో స్మరించుకున్నారు. మరణించిన ఆత్మల కోసం ప్రార్థించే, ఆధ్యాత్మిక జీవనంలో నాటబడి కొనసాగే, ప్రజలను దేవుని వైపునకు నడిపించే ప్రేషిత కార్యంలో కొనసాగే గురువుల బాధ్యతను ఆయన ప్రస్ఫుటంగా నొక్కి చెప్పారు. భారత రాజ్యాంగం వాగ్దానం చేసిన మానవ ఘనతపై, మానవ స్వేచ్ఛపై, ప్రాథమిక హక్కులపై అవగాహనను పెంపొందించమని తన గురువర్గాన్ని ఆయన ప్రోత్సహించారు.

దివ్యపూజాబలి అనంతరం, మేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ పి. బాల, చాన్సలర్, గురుశ్రీ టి. ఇమ్మానుయేల్ తోడు నడవగా, పీఠాధిపతి సమాధుల తోటకు క్రొవ్వొత్తుల ఘనమైన ఊరేగింపును నడిపించారు. సమాధులకు గౌరవంతో ధూపం వేసి, ప్రత్యేక ప్రార్థనలు చేసారు. తమ ప్రేమకు, కృతజ్ఞతకు, స్మరణకు గుర్తుగా గురువులు, మఠకన్యలు, సమాధుల చెంత వెలుగుతున్న క్రొవ్వొత్తులను ఉంచారు.

కార్యక్రమ ముగింపులో, పీఠాధిపతికి, వికార్ జనరల్ కు, గురువులకు, మఠకన్యలకు, ఈ ప్రార్థనాపూర్వక కూటమి నిర్వహణలో పనిచేసిన వారందరికీ చాన్సలర్ గురుశ్రీ టి. ఇమ్మానుయేల్ వందన సమర్పణ చేసారు.

పీఠం స్వర్ణ జూబిలీ వైపు అడుగులు వేస్తున్న ఈ సమయంలో, గురువుల సౌభ్రాతృత్వానికి, శ్రీసభ సహవాసానికి, కృతజ్ఞతకు, ఈ ఘన స్మరణ గొప్ప నిదర్శనంగా నిలిచింది. నేటి తరం, తమకు ముందు పరిచర్య చేసినవారి విశ్వాసంపై, త్యాగాలపై మిషనరీ వారసత్వ సంపదపై నిర్మించి కొనసాగుతుందన్న వాస్తవాన్ని ఇది పునరుద్ఘాటించింది.

వియాన్నీ కళాశాల రెక్టర్ గురుశ్రీ జి. ప్రవీణ్, సెయింట్ లూసీ సిస్టర్ల సహాయంతో ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను నిర్వర్తించారు.

మరణించిన మన పీఠాధిపతుల, గురువుల, పిమె మిషనరీల, కుటుంబ సభ్యుల ఆత్మలు క్రీస్తుని నిత్య శాంతిలో విశ్రమించును గాక!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN