భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు!

ప్రసాద్ గార్లపాటి

26 Nov 2026

నేటి సమాజానికి రాజ్యాంగం చెప్పే సందేశం!...
రాజ్యాంగం పుస్తకంలో ఉండే అక్షరాల సమాహారం మాత్రమే కాదు… సమాజం ఎలా ఉండాలో చెప్పే జీవన మార్గదర్శకం!

నేడు మన దేశం సాంకేతికంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంతో పోటీపడుతోంది. అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తోంది. ఆర్థికంగా ఎదుగుతోంది. కానీ ఒక ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి…

మనిషి ఎదుగుతున్నాడా? మానవత్వం ఎదుగుతోందా?
కులం పేరుతో మనుషులను దూరం చేస్తున్నామా? మతం పేరుతో మనసుల మధ్య గోడలు కడుతున్నామా? భాష, ప్రాంతం పేరుతో సోదరభావాన్ని మరచిపోతున్నామా? అధికారం ఉన్నవారికే న్యాయం, బలహీనులకు అన్యాయం జరుగుతోందా? మహిళలకు సమాన గౌరవం, పిల్లలకు భద్రత, పేదలకు న్యాయం అందుతున్నాయా?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతికే క్రమంలో మనకు గుర్తుకు వచ్చేది భారత రాజ్యాంగం.

రాజ్యాంగం – నేటి సమాజానికి ఒక హెచ్చరిక!.
రాజ్యాంగం మనకు సమానత్వాన్ని బోధించింది. కానీ మన ఆలోచనల్లో ఇంకా అసమానతలు ఎందుకు?

రాజ్యాంగం మనకు మత స్వేచ్ఛను ప్రసాదించింది. కానీ ఇతరుల విశ్వాసాలను గౌరవించలేకపోవడం ఎందుకు?

రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛను కల్పించింది. కానీ భిన్నమైన అభిప్రాయాలను సహించలేకపోవడం ఎందుకు?

రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులను కల్పించింది. కానీ మన బాధ్యతలను మాత్రం ఎందుకు విస్మరిస్తున్నాం?

దేశాన్ని ప్రేమించడం అంటే జాతీయ జెండాను ఎగురవేయడం మాత్రమే కాదు… ఆ జెండా కింద జీవించే ప్రతి పౌరుడిని గౌరవించడం కూడా!

అంబేద్కర్ ఆశయం – మన బాధ్యత
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగం ప్రతి భారతీయుడికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలనే మహోన్నత ఆశయాన్ని కలిగి ఉంది.

ఆయన కలలుగన్న భారతదేశం కేవలం భౌగోళిక సరిహద్దులతో ఏర్పడిన దేశం కాదు. సమాన హక్కులు కలిగిన మనుషులు, పరస్పర గౌరవంతో జీవించే సమాజం.

ఈనాడు మనకు కావలసింది రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మాత్రమే కాదు… రాజ్యాంగ విలువలను ఆచరించే పౌరులు!

పాఠశాలల్లో సమానత్వం ఉండాలి. కార్యాలయాల్లో నిజాయితీ ఉండాలి. రాజకీయాల్లో ప్రజాసేవ ఉండాలి. సమాజంలో మానవత్వం ఉండాలి. ప్రతి హృదయంలో దేశభక్తి ఉండాలి.

ఒకసారి ఆలోచించండి…
రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తున్నామా? లేక రాజ్యాంగ దినోత్సవం రోజున మాత్రమే గుర్తు చేసుకుంటున్నామా?

రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులను అనుభవిస్తూ, అది మనపై ఉంచిన బాధ్యతలను విస్మరిస్తే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం ఏముంటుంది?

గుర్తుంచుకోండి…
రాజ్యాంగం బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే పౌరులు బాధ్యతాయుతంగా ఉండాలి. పౌరులు బాధ్యతాయుతంగా ఉండాలంటే ప్రతి ఒక్కరి హృదయంలో రాజ్యాంగ విలువలు జీవించాలి.

రాజ్యాంగాన్ని చదవడం ఒక విద్య… రాజ్యాంగాన్ని గౌరవించడం ఒక సంస్కారం… రాజ్యాంగ విలువలను ఆచరించడం ఒక నిజమైన దేశభక్తి!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN