సాక్షిగా ఉండండి ఆత్మ రక్షణ పొందండి

జోసెఫ్ అవినాష్
24 Nov 2026
సామాన్య చివరి బుధవారం
సువిశేష ధ్యానం
లూకా 21:12-19
క్రైస్తవులు క్రీస్తుకు సాక్షులు.క్రీస్తు సాక్షిగా జీవించుటలో,శిష్యులకు ఎదురయ్యే శ్రమలను,క్రీస్తు బయలుపరిచాడు.ప్రార్ధనా మందిరములకును,చెరసాలలకును అప్పగిస్తారు.హింసలను ఎదుర్కొంటారు.సొంత కుటుంబము వారే దిక్కరిస్తారు.అవమానకరంగా ప్రవర్తిస్తారు.యేసు నామము నిమిత్తము ద్వేషాన్ని ఎదుర్కొంటాము.ఎన్ని జరిగిన, మన ఆత్మ రక్షణ బాధ్యత,సురక్షితముగా కాపాడే బాధ్యత, తన శిష్యులకు తోడుగా ఉంటూ యేసుప్రభువే చూసుకుంటాడు.యేసు హెచ్చరికల నుండి,ఆయన శిష్యులమైన మనం మూడు విషయాలను జ్ఞాపకం ఉంచుకుందాం.
1.మీరు సాక్షులుగా ఉండవలసిన సమయములో ధైర్యంగా ఉండాలి.
2. మిమ్ము ఖండించుటకు వీలుకాని వాక్కు వివేకము యేసుప్రభువే ప్రసాదిస్తాడు.
3. మీ సహనము వలననే, మీరు మీ ప్రాణములు దక్కించుకుంటారు.
క్రైస్తవ జీవితం శ్రమలతో కూడిన జీవితమే.క్రీస్తు శ్రమలలో పాలుపంచుకోవడం ఆశీర్వాదంగా భావించాలి.ఈ లోకం మనల్ని ద్వేషించినా,ప్రభువు ప్రేమనే పంచాలి. ఈ లోకం మనల్ని తృణీకరించినా, ప్రభువు వలే మనము అంగీకరించాలి.మన ప్రేమ,సేవ,సహనం,ఓర్పు,దయ, కనికరము,నీతి,నిజాయితీ, విశ్వాసము,విధేయత ప్రపంచానికి క్రీస్తు జీవితానికి సాక్ష్యముగా మార్చుకుందాం.దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడని భావించాలి.యేసుకు సాక్షిగా ఉండవలసిన సమయంలో,భయంతో, ఆందోళనతో పారిపోతే,మనము క్రీస్తు పక్షమున నిలబడగలమా? యేసుకు సాక్షిగా జీవించి, ప్రాణాలను అర్పించిన హతసాక్షుల,ఆదర్శాన్ని మరువకూడదు.క్రైస్తవ విశ్వాస జీవితం,ప్రపంచానికి ఒక సందేశంగా ఉండాలని మర్చిపోకూడదు.మీ సహనము వలననే మీరు మీ ప్రాణములను దక్కించుకుంటారని యేసు చెప్పాడు.తొందరపడితే ప్రయోజనం ఏముంటుంది! మనలో సహనం ఉండాలి.దేవుని కార్యము జరిగే వరకు ఎదురు చూడాలి.విలువలను కోల్పోరాదు. విశ్వాసంతో జీవించాలి.ప్రభుని అనుగ్రహం ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. నిక్కచ్చిగా జీవించాలి. నిరాడంబరంగా ఉండాలి.యేసు కోసం దేనికైనా రెడీ అన్నట్టు ఉండాలి.అదే మనకు కొండంత ధైర్యాన్నిస్తుంది.ఈ లోకములో క్రీస్తు శిష్యునిగా జీవించడం అంటే, ప్రభువుపైన భారమువేసి,అపారమైన నమ్మకంతో జీవించడమే.క్రీస్తులో ఐక్యమై జీవిస్తే, దృఢంగా ఉంటాము.అపోస్తులు, వేదసాక్షులు అనేకమంది రక్తాన్ని చిందించి,క్రీస్తుకు సాక్షులుగా నిలబడ్డారు.దేవుని యందు భయభక్తులు,యదార్థ ప్రేమ సాక్షికి కావాలి. యేసుకు సాక్షిగా ఉండడానికి ప్రతి క్రైస్తవుడు ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. అలాంటి ధైర్య సాహసాలు దయచేయమని ప్రార్ధించుదాము.
