క్రీస్తురాజు మహోత్సవం

ప్రసాద్ గార్లపాటి

21 Nov 2026

34వ సామాన్య ఆదివారం (A సంవత్సరం)
పఠనాలు: యెహెజ్కేలు 34:11-12, 15-17
| కీర్తన 23 |
1 కొరింథీయులకు 15:20-26, 28 |
మత్తయి 25:31-46
కరుణా కిరీటధారి – కాపరి రాజు
ప్రియ సహోదరీ సహోదరులారా,
కాలం ఒక నది ప్రవాహం లాంటిది. ఆగమనకాలపు ఆశాకిరణాలతో ఉదయించి, క్రిస్మస్ వెలుగులో నడయాడి, తపస్సుకాలపు కన్నీటిలో తడిసి, పాస్కా విజయ తీరం చేరి, సామాన్యకాలపు సాధారణ దినాలలో ప్రవహించిన ఈ ప్రార్థనా సంవత్సరపు నది, నేడు విశ్వరాజైన క్రీస్తు పాదపీఠం చెంతకు చేరుకుంది. అందుకే తల్లి శ్రీసభ ఈ సంవత్సరాన్ని ఒక సింహాసనం ముందు ముగింపు పలుకుతుంది . కానీ ఈ సింహాసనం వజ్రవైఢూర్యాలతో మెరిసేది కాదు. అది కల్వరి సిలువ కొయ్య. ఆయన కిరీటం బంగారంతో చేసినది కాదు, ముళ్లతో అల్లినది. ఆ రాజదండం రాజరికానికి ప్రతీక కాదు, కాపరి చేతిలో కర్ర. లోకం ఇలాంటి రాజును ఎన్నడూ చూచి ఉండదు.

1. వెదకి వచ్చిన కాపరి...
చెదిరిపోయిన మందను చూసి కన్నీరు కార్చిన ప్రభువు, యెహెజ్కేలు ప్రవక్త నోట ఇలా ప్రకటిస్తున్నాడు: "నేనే నా గొఱ్ఱెలను వెదకెదను, నేనే వాటిని సంరక్షించెదను." గమనించండి, ఇక్కడ "నేనే" అనే మాట మాటి మాటికీ వినిపిస్తోంది. మందను పట్టించుకోని కాపరులు స్వార్థంతో తమ కడుపులే నింపుకొంటారు. అందుకే దేవుడే స్వయంగా దిగివచ్చాడు. తప్పిపోయిన వాటిని వెతికేవాడు, చెదరిపోయిన వాటిని సమకూర్చేవాడు, గాయపడిన వాటికి కట్టు కట్టేవాడు, బలహీనమైన వాటిని బలపరచేవాడు మన క్రీస్తు రాజు.

ఇతర రాజులు ప్రజలను తమ కోసం సేవించమంటారు. ఈ రాజు తానే ప్రజల కోసం సేవకుడయ్యాడు. అందుకే కీర్తనకారుడు పరవశంతో పాడాడు: "ప్రభువే నా కాపరి, నాకు లేమి కలుగదు." పచ్చని పచ్చిక బయళ్ళు, ప్రశాంతమైన జలాలు, నీతి త్రోవలు అన్నీ ఆయన సన్నిధి ఇచ్చే వరాలే. మరణపు లోయలో నడిచినా భయపడనవసరం లేదు, ఎందుకంటే ఆ చీకటి లోయలో కూడా మన కాపరి మనకు ముందు నడుస్తున్నాడు. ఆయన కర్ర మనల్ని కాచే కంచె, ఆయన దండము మనల్ని నడిపే దారి దీపం.

2. మరణాన్ని పాదాక్రాంతం చేసిన విజయరాజు
రెండవ పఠనంలో పౌలు భక్తుడు విజయ ధ్వజం ఎగురవేస్తున్నాడు: "క్రీస్తు నిద్రించినవారిలో ప్రథమఫలముగా లేచెను." పంట కోతలో మొదటి కంకి వచ్చిందంటే, మిగిలిన పంట వెనుకే వస్తుందని రైతుకు తెలుసు. క్రీస్తు పునరుత్థానం కూడా అంతే. అది ఆయన ఒక్కని విజయం కాదు, మన అందరి పునరుత్థానానికి శుభసూచన. ఆదాము ద్వారా మరణం లోకంలో ప్రవేశించింది. క్రీస్తు ద్వారా జీవం తిరిగి ప్రవేశించింది.

ఈ రాజు విజయం శత్రు సైన్యాలపై కాదు, మృత్యువుపైనే. ఆయన తన శత్రువులన్నింటినీ పాదాల క్రింద ఉంచే వరకు పరిపాలిస్తాడు, చివరి శత్రువైన మరణం కూడా ఓడిపోతుంది. అప్పుడు తాను పాలించిన సమస్తాన్నీ తండ్రికి సమర్పిస్తాడు, దేవుడే సర్వములో సర్వమై నిలుస్తాడు. ఎంతటి ఆశ ఇది! సమాధి చివరి మజిలీ కాదు, శిలువ చివరి మాట కాదు. కనుక మన రాజు ఉన్నప్పుడు మనకు భయం ఎందుకు? మన కన్నీళ్ళకు కూడా ఒక అంతిమ విజయం వేచి ఉంది.

3. తీర్పు తీర్చే రాజు, కరుణే కొలమానం
ఇప్పుడు సువార్త మనల్ని ఆ మహా దినపు ద్వారం ముందు నిలబెడుతోంది. మహిమాన్వితుడైన మనుష్యకుమారుడు సర్వదూతలతో సింహాసనాసీనుడై వస్తాడు. సమస్త జనములు ఆయన ఎదుట సమావేశమవుతాయి. కాపరి గొఱ్ఱెలను మేకలను వేరుచేసినట్లు ఆయన వారిని వేరుచేస్తాడు. కుడి వైపున కరుణామూర్తులు, ఎడమ వైపున కరుణ లేనివారు.
ఆశ్చర్యమేమిటంటే, ఆ దినాన రాజు అడిగే ప్రశ్నలు. నీవెన్ని పుస్తకాలు చదివావు, ఎన్ని కానుకలు సమర్పించావు, ఎన్ని ఉపవాసాలు చేశావు అని ఆయన అడగడు. ఆయన ప్రశ్నలు ఇవి: ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టావా? దప్పికతో ఉన్నప్పుడు నీళ్ళిచ్చావా? పరదేశినైనప్పుడు ఆదరించావా? వస్త్రహీనుడినైనప్పుడు కప్పావా? రోగినైనప్పుడు పరామర్శించావా? చెరసాలలో ఉన్నప్పుడు చూడ వచ్చావా? ఇవి దైవశాస్త్ర పరీక్షలు కావు, హృదయ పరీక్షలు. ఇవి ప్రేమ పాఠాలు.

నీతిమంతులు విస్మయంతో అడుగుతారు: "ప్రభూ, ఎప్పుడు నిన్ను ఆకలితో చూచి అన్నం పెట్టాము?" అప్పుడు రాజు మధురంగా ఇలా సెలవిస్తాడు: "నా సహోదరులలో అతి కనిష్ఠుడైన వీనికి మీరు చేసినది నాకే చేసినట్లు." ఎంత అద్బుత రహస్యం ఇది! పేదవాని ముఖంలో రాజు ముఖం ఉంది. రోగి మంచం ప్రక్కన రాజు సింహాసనం ఉంది. ఆకలితో ఉన్న బిడ్డ చేతిలో రాజు చేయి ఉంది. మనం దేవాలయంలో మోకరిల్లే ప్రభువే వీధి మలుపులో చేయి చాచి నిలబడి ఉన్నాడు.అయితే ఎడమ వైపున ఉన్నవారి గురించి కూడా ఆలోచించండి. వారు హత్యలు చేసినవారు కాదు, దోపిడీ చేసినవారు కాదు. వారు చేసిన పాపం ఏమిటంటే, ఏమీ చెయ్యకపోవడమే. చూసీ చూడనట్టు తప్పుకోవడం, వినీ వినని వలె నడిచిపోవడం, "అది నా పని కాదు" అని భుజాలు తడుముకోవడం. చెయ్యని మేలు కూడా పాపమేనని ఈ ఉపమానం మనల్ని మేల్కొలుపుతోంది. ఉదాసీనత కూడా ఒక తీర్పును తెచ్చిపెడుతుంది.

4. మన హృదయ సింహాసనం
ప్రియులారా, ఈ రోజు క్రీస్తు రాజు మనల్ని పాలించాలంటే, ముందు మన హృదయ సింహాసనం ఆయనకు ఖాళీ కావాలి. అక్కడ అహంకారం కూర్చుని ఉంటే ఆయన రాడు. స్వార్థం ఆక్రమించుకుని ఉంటే ఆయన రాడు. క్షమించని కోపం, పగ, ద్వేషం అక్కడ పాగా వేసి ఉంటే ఆయన కొలువుదీరడు. కరుణ ఉన్న హృదయంలో మాత్రమే ఆయన సింహాసనం నిలుస్తుంది.
అందుకే ఈ మహోత్సవం మనకు ఒక ప్రశ్న వేస్తోంది: ఈ వారం నేను ఎవరిలో క్రీస్తును సేవించాను? ఎవరిని చూసి తల తిప్పుకున్నాను? మన ఇంటి ప్రక్కన ఒంటరిగా మిగిలిన వృద్ధుడా? చదువుకు దూరమైన పేద బిడ్డా? బాధలో కుంగిపోయిన స్నేహితుడా? ఎవరో ఒకరు మన కోసం, మన కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ ముఖంలో మన రాజు ఉన్నాడు.
కనుక ఈ రోజు మనం ఒక సంకల్పం చేసుకోందాం. రాబోయే ఆగమనకాలంలో ఒక్కరికైనా మన చేయూతనిద్దాం. అప్పుడు ఆ మహా దినాన కాపరియైన రాజు మన వైపు చూసి ప్రేమతో ఇలా పలుకుతాడు: "రండి, నా తండ్రిచే ఆశీర్వదింపబడినవారా, లోకారంభము నుండి మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి."

ప్రార్థన...
ఓ విశ్వరాజా క్రీస్తు ప్రభూ, సిలువనే సింహాసనంగా చేసుకున్న కరుణామయా, మా హృదయాలలో అహంకారాన్ని తొలగించి, నీ ప్రేమ రాజ్యాన్ని స్థాపించుము. కనిష్ఠులలో నిన్ను చూడగల కన్నులను, వారి కోసం కదిలే చేతులను మాకు ప్రసాదించుము. నీ రాజ్యం మా ఇళ్ళలో, మా సమాజంలో, మా హృదయాలలో వర్ధిల్లును గాక. ఆమెన్.
క్రీస్తు రాజు వర్ధిల్లాలి!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN