వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌కు చేరుకున్న క్రిస్మస్ వృక్షం!
జోసెఫ్ అవినాష్
21 Nov 2026
క్రిస్మస్ వేడుకలకు వాటికన్‌లో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇటలీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌కు 2026 సంవత్సరపు క్రిస్మస్ వృక్షం నవంబర్ 20న చేరుకుంది. దక్షిణ ఇటలీలోని పొల్లినో జాతీయ ఉద్యానవనం నుంచి తీసుకువచ్చిన ఈ వెండి ఫిర్ వృక్షం 24 మీటర్ల ఎత్తు,7.5 టన్నుల బరువు కలిగి ఉంది. టెర్రనోవా డి పొల్లినో మున్సిపాలిటీ దీనిని వాటికన్‌కు బహుమతిగా అందించింది.ఈ వృక్షాన్ని 50 వేలకు పైగా ఎల్‌ఈడీ విద్యుద్దీపాలు, అలంకరణ వస్తువులతో అందంగా తీర్చిదిద్దనున్నారు. ఇటలీలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులు,ముఖ్యంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలు రూపొందించిన సిరామిక్ అలంకరణలు కూడా దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు (రోమ్ స్థానిక సమయం) జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ చిన్నారులే క్రిస్మస్ వృక్షంలోని దీపాలను వెలిగించనున్నారు.
మరోవైపు సెయింట్ పీటర్స్ బసిలికా ఎదుట క్రీస్తు జనన ఘట్టాన్ని ప్రతిబింబించే దివ్య జనన దృశ్యాన్ని (నేటివిటీ సీన్) ఏర్పాటు చేస్తున్నారు.ఇటలీలోని చియెటి-వాస్తో ఆర్చ్ పీఠం బహుమతిగా అందించిన ఈ దృశ్యానికి 'ది గ్రేట్ మిస్టరీ' అని పేరు పెట్టారు. ఇందులో సహజ పరిమాణంలో రూపొందించిన ప్రతిమలతో పాటు, యేసుక్రీస్తు జన్మించిన కాలంలోని బేత్లెహేము గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ నిర్మాణంలో ఖైదీలు సైతం శిక్షణ, విద్యా కార్యక్రమాల ద్వారా భాగస్వాములయ్యారు. మొత్తం 90 ఇటలీ పట్టణాలు,146 విచారణ సంఘాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి.క్రిస్మస్ వేడుకలు ముగిసిన అనంతరం ఈ వృక్షం కలపను సామాజిక, కళాత్మక, దైవార్చన సంబంధిత అవసరాలకు ఉపయోగించనున్నారు. దేవుని సృష్టిని సంరక్షించాలనే లౌదాతో సీ (Laudato Si') సందేశానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
