ఉత్థాన భాగ్యమునకు యోగ్యులైన వారు, సజీవ దేవునితో ఉంటారు

జోసెఫ్ అవినాష్
21 Nov 2026
సామాన్య 33వ శనివారం
సువిశేష ధ్యానం -:
లూకా 20:27-40
దేవుడు జీవితలకే కానీ మృతులకు దేవుడు కాదు" దేవుని దృష్టిలో, వివాహము పవిత్రమైన బంధము, మానవులకు వివాహఅంతస్తు, ఈ లోక సంబంధమైనదే కానీ, పరలోకములో కొనసాగేది కాదు. ఈ లోకంలో భార్యాభర్తలుగా జీవించినా, పరలోకములో ఎవరికి వారే, నిత్య జీవితాన్ని అందుకుంటారు.భార్య భర్తలు ఇరువురు పరలోకానికి వెళ్లిన, లోక సంబంధం అక్కడ
కొనసాగదు. ఈ లోకంలో మనకు అనేక అవసరాలు ఉన్నాయి. ప్రాథమిక అవసరాలు,సామాజిక అవసరాలు,ఆధ్యాత్మిక అవసరాలు,నైతిక అవసరాలు, భౌతిక అవసరాలు,ఇంకా ఎన్నో రకాలైన అవసరాలను మనము వర్గీకరించవచ్చు. అయితే, అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, అవకాశాలను బట్టి, దేవుడు మనకు ఒక అంతస్థును
అనుగ్రహిస్తున్నాడు.వివాహము తప్పనిసరైన అంతస్తు కాదు. వివాహం చేసుకొని వారు శాపగ్రస్తులు కారు. వివాహం చేసుకుంటేనే పరలోకానికి వెళ్తారనుకోవడం నిజం కాదు. నేను వివాహం చేసుకున్నానని, దేవుని దగ్గర వాదించినా ప్రయోజనం ఏమి ఉండదు. వివాహము చేసుకున్నా, వివాహము చేసుకోకపోయినా, దేవునికి లోబడి జీవించడం ముఖ్యం. దేవుడిచ్చిన పిలుపును అంగీకరించి, దేవుని మహిమ పరచడం శ్రేష్టమైనది.కానీ మనలో చాలామంది. వివాహం చేసుకొని దాని పవిత్రతను కాపాడుకోవడం లేదు. దేవుని దృష్టిలో వివాహ అంతస్తును, దాని గౌరవాన్ని అర్థం
చేసుకోకపోవడం వలన,స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారు. భార్యాభర్తలు తన ప్రేమను పంచుకొని, దేవుని ప్రేమకు సాక్షిగా జీవించాలి. తమ కలయిక ద్వారా, దేవుడు
అనుగ్రహించే పిల్లలను, బాధ్యతాయుతంగా పెంచాలి. సృష్టి క్రమాన్ని కొనసాగించడానికి,
సృష్టికర్తకు సహకారంగా ఉండాలి. యేసుక్రీస్తు, తన బోధనల ద్వారా, ఒక క్లిష్టమైన సమస్యకు పరిష్కారం బయలు పరిచారు. వివాహ అనంతరము, భార్యాభర్తల జీవితం ఎలా ఉంటుందో నేర్పిస్తూ, ఇహలోక జీవితానికి, పరలోక జీవితానికి తమ్ము తాము ఎలా సమర్పించుకోవాలో సూచించాడు. ఈ లోకంలోనే, ఇచ్చి పుచ్చుకొనుట ఉంటుంది.
పునరుత్థానమునకు యోగ్యులగు వారు, పరలోకములో దేవుని దూతలతో సమానులు,దేవుని కుమారులు అనే సత్యాన్ని యేసు వెల్లడించాడు. అనగా, ఈ లోకములో దేవుని పిలుపును అంగీకరించి, కుటుంబ ధర్మములోనూ, దైవ సేవకు అంకితం చేసిన ధర్మములోనూ, జీవించిన వారు,తమ ఇహలోక జీవితం ముగించిన తర్వాత, ఈ
లోకములో తమ జీవితాన్ని ఎలా సఫలం చేసుకున్నారో, దాని బహుమానం పరలోకంలో లభిస్తుందని తెలుసుకుంటున్నాము.అంతేకాదు ఉత్థాన భాగ్యమునకు యోగ్యులైన వారు, సజీవ దేవునితో ఉంటారు.
