గతాన్ని గుణపాఠంగా స్వీకరించి - యేసు రాకడకు సిద్ధపడు

జోసెఫ్ అవినాష్

12 Nov 2026

సామాన్య 32వ శుక్రవారం
సువిశేష ధ్యానం -:
లూకా 17:26-37
లోక రక్షకుడైన యేసు, ఈలోక సృష్టిలోని మనిషి ఉనికిని వివరించాడు. దేవుడు మనిషికి ఇచ్చిన విలువను గౌరవించాలి. పాపముచేత పతనమైన ఈ లోకాన్ని, మనుష్యకుమారుడిగా ఈ లోకంలో జన్మించిన యేసు రక్షించాడు. యేసును స్వీకరించకుండా, మనిషికి రక్షణ లేదన్నది వాస్తవం. సృష్టిలో గతంలో జరిగిన సంఘటనలను, దేవుడే స్వయంగా మనకు నేర్పిస్తున్న గుణపాఠాలుగా నేర్చుకొని, రాబోవు విపత్తుల నుండి రక్షింపబడుటకు అప్రమత్తంగా ఉండాలని యేసు బోధించాడు. యేసు బోధనలను స్వీకరించినప్పుడు, రక్షణ ఆశాభావం మనలో పెంపొందుతుంది. మనిషిలోని గర్వము వలన, దేవున్ని సృష్టికర్తగా అంగీకరించడం లేదు. అందుకే, దేవుని ఆజ్ఞలకు లోబడని వారు, ఈ సృష్టిలోనే సమాధి చేయబడ్డారు. నిత్యజీవం ఎడల, వారిలో ఎలాంటి తపన లేదు. వారి వినాశనానికి వారే బాధ్యులు, యేసుక్రీస్తు ప్రభువు నోవా దినములను ప్రస్తావించారు. యావే ప్రభువు నోవాను, ఓడను సిద్ధం చేసుకోమని ఆజ్ఞాపించే సమయానికి, లోకములోని ప్రజలందరూ బ్రష్టత్వముతో నిండిపోయారు. వారిలో దైవభయం లేదు. తమకు తామే సృష్టికర్తలం అనుకున్నారు. వారు ఏదైనా చేయవచ్చు అనుకున్నారు. వారి మతి భ్రమించింది. దేవుణ్ణి ఎదిరించారు. నోవా కుటుంబము మాత్రమే దేవుని దృష్టిలో, నీతివంతముగా కనిపించింది. దేవుడే తన సృష్టి వినాశనానికి అజ్ఞాపించాడు. ఈ దుర్ఘటన, తరతరాలకు ఒక గొప్ప గుణపాఠం. యేసు నోవాను, నోవా దినములను ఎత్తిచూపుతూ, మనుష్య కుమారుని రాకడ అట్లే ఉంటుంది అన్నాడు. అప్రమత్తంగా ఉండనిచో, యేసు రాకడ సమయంలో, అలాంటి వారికి నాశనము తప్పదు. లోతు కాలంలో కూడా అలాంటి సంఘటనే జరిగింది. ప్రజలందరూ మత బ్రష్టులయ్యారు. సోదోమా గొమోర్రాలోని ప్రజలు, అగ్నిచే సర్వనాశనమయ్యారు. అంతిమ దినములలో, అలాంటి విపత్తులే ప్రత్యక్షమవుతాయి. కాబట్టి నోవా, లోతు వలె, ప్రాణాలు నిలబెట్టుకోవాలంటే, తప్పనిసరిగా యేసును రక్షకునిగా స్వీకరించాలి.. సువార్త విలువలను పాటించాలి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN