దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది

జోసెఫ్ అవినాష్

12 Nov 2026

సామాన్య 32వ గురువారం
సువిశేష ధ్యానం
లూకా 17:20-25
యేసు దేవుని రాజ్యమును స్థాపించాడు. దేవుని రాజ్యము అంటే తినుట త్రాగుట కాదు పవిత్రాత్మఒనగు నీతి, శాంతి సంతోషాలే. ఈ సత్యం తెలియక చాలామంది.. దేవుని రాజ్యము ఎక్కడో ఉందని వెతుకుతూ ఉంటారు. వారి శ్రమ వ్యర్థం అవుతుంది. యేసుప్రభు మాటలను అర్ధం చేసుకోకపోవడం వలన, యేసు అనుచరులలో ఎక్కువ మంది దేవుని రాజ్యాన్ని, దాని విలువలను పోగొట్టుకున్నారు. యేసుక్రీస్తుని అనుసరించే వారిలోఎక్కువమంది యేసును తప్పుడు ఆలోచనలతో అనుసరించారు. దేవుని రాజ్యం ఎడల సరైన అవగాహన లేకపోవడం, యేసును కేవలం ఈ లోకానికి అధిపతిగానే భావించడం, యేసుని అనుసరించడం ద్వారా తమకి కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి అనుకోవడం, వివిధ పదవులను ఆకాంక్షించి, యేసును వెంబడించిన వారున్నారు.ఇప్పటికిని యేసును అనుసరించే వారిలో, దైవ రాజ్యం ఎడల సంపూర్ణ అవగాహన లేకుండానే అనుసరిస్తున్నారు. ఈ లోక ఆకాంక్షలకు లోబడి జీవిస్తున్నారు.అంతే కాదు దేవుని రాజ్యం అంటే ఎక్కడో ఉన్నదని వెతికే వారున్నారు.నిజానికి దేవుని రాజ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువే. దేవుని రాజ్యం ఒక వ్యక్తి ఆయనను ప్రేమించి, సేవించి, ఆయనను అనుసరించడమే దైవరాజ్యప్రవేశం.యేసు అనేక సందర్భాలలో, దైవరాజ్యం గురించి వివరించారు. ఎన్నో ఉపమానాలను బోధించారు. రహస్యముగా ఉన్న దైవ రాజ్యమును, శిష్యులకు అర్ధమయ్యేలా నేర్పించారు. దైవ రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో కూడా చెప్పారు. యేసు బోధనలను, విశ్వాసముతో ధ్యానిస్తే, మనం కూడా ఆయన రాజ్యమునకు దూరంగా లేమని గ్రహిస్తాము.యేసును అనుసరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉండాలి. దైవ రాజ్యంలో ఉండాలన్న ఆసక్తిని పెంపొందించుకోవాలి. సువార్త విలువలను పాటిస్తూ, ఈ లోక సంబంధమైన జీవితమునకు స్వస్తి పలికి, యేసు మార్గమును అనుసరించడం ఆరంభించాలి. దేవుడు ఎప్పుడూ మనకి అందుబాటులోనే ఉంటాడు. ఆయన మనతో ఉండడానికే ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసును ఇమ్మానుయేలు అంటారు. దేవుడు మనతో ఉన్నాడని అర్ధము. మనతో ఉండడానికి వచ్చిన దేవుణ్ణి ఎక్కడో వెతికితే లాభమేముంటుంది! మన మధ్యనే ఆయన స్థావరం ఉంది. ఎక్కడ విశ్వాసంతో ఆయన పేరిట గుమి కూడుతారో, అక్కడ వారి మధ్య ఆయన ఉన్నాడు. వెతకండి దొరుకును అన్నాడు. కావున, మన చుట్టూనే ఉన్న ఆయనను కనుగొనలేకపోవడం దురదృష్టకరమే.ఆయన మనలోనే ఉన్నాడని గ్రహించాలి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN