Day 10 - ఉత్తరించు ఆత్మల స్మరణ మాసము

జోసెఫ్ అవినాష్
10 Nov 2026
Day 10 - ఉత్తరించు ఆత్మల స్మరణ మాసము
ధ్యానాంశము :
ఉత్తరించు స్థలములో లెక్కలేని ఆత్మలు వేదన చెందుచున్నారను సత్యము
ధ్యానము :-
ప్రతి దినము 1,51,600 మంది మనుష్యులు మరణిస్తున్నారని గణాంకాలు సూచిస్తున్నాయి. వీరిలో క్రీస్తువులు వేల సంఖ్యలో ఉన్నారు. ఒక దినములో చనిపోవు వేలకొలది క్రీస్తువులను గూర్చి ధ్యానించుదాము. వీరిలో ఎన్నో ఆత్మలు నేరుగా మోక్షమునకు పోవడం లేదు. బహుకొద్దిమంది పరిశుద్ధుల ఆత్మలు మాత్రమే నేరుగా మోక్షమునకు పోవుచున్నవి. మరణించినవారందరు దాదాపు అనేక స్వల్ప పాపములతోను, క్షమించబడిన చావైన పాపములకు తీర్చవలసిన అపరాధ ఋణములతోను చనిపోవు చున్నారుగదా ! అదియునుగాక, చనిపోయినవారు అనేక దినములైనను, సంవత్సరములైనను ఉత్తరింప వలయునని తెలుసుకొనియున్నాము. చనిపోయినవారి కొరకు ప్రార్థించువారు కొందరే. ప్రతిరోజు వేలకొలది క్రీస్తువులు మరణిస్తున్నందున, ఎన్ని లక్షలు, కోట్ల ఆత్మలు ఉత్తరించు స్థలములో వేదనలు అనుభవిస్తున్నారో ఆలోచించండి.
మేత్రాణులైన పునీత అమృతనాధులుగారు ఇలా తెలుపుచున్నారు. పుణ్యాత్ములు కూడ దైవసేవయందు, జపతపములందు అశ్రద్దగా ఉన్నందున మరణానంతరము ఉత్తరించు స్థలమునకు పోవలసివస్తున్నది.
ఏ పాపాత్ముని గురించియైనను, వారు ఖచ్చితముగ నరకమునకు పోయి వుంటాడని చెప్పకూడదు. ఎందుకనగా అనేకులు పాప సంకీర్తనము లేకుండ అకస్మాత్తుగా మరణించినప్పటికీ, దేవుని కృపవల్ల మరణించు సమయములో తమ పాపములకు నిజమైన ఉత్తమ మనస్తాపపడి నరకమును తప్పించుకొని యుండవచ్చు. మరియు పునీత లిగోరియస్, పునీత లెయోనార్డుస్ అనువారు కథోలిక క్రీస్తువులలో అనేకమంది నరకమును తప్పించుకొని ఉత్తరించు స్థలమునకుపోయి, ఉత్తరింపుపొంది మోక్షమునకు పోవుచున్నారని తెలుపుచున్నారు. వీరు చెప్పుచున్న సత్యము ఊరటగానున్నను, దైవసేవలో అశ్రద్ధగా ఈ ండకూడదు. పాప మార్గములో నడువకూడదు.
ఆ విధంగా చేస్తే ఉత్తరించు స్థలములో మౌరవేదనలను అనేక సంవత్సరముల వరకు అనుభవించుటయేగాక, నిత్యనరకమునకు పోవు ప్రమాదముకూడ కలదు.
పతితులు, మత విభాగస్తులు అందరు నరకమునకు పోవుదురని చెప్పకూడదు. వారలలో అనేకులు రక్షకుడైన యేసును నమ్మి విశ్వసించి జ్ఞానస్నానము పొంది, చేసిన పాపములకు మనస్తాపపడి, పాపములను విడిచిపెట్టి, తాము అనుసరించెడి మతము అబద్దమని తెలియక మరణించినచో, వారుకూడ రక్షణము పొందుదురనుట సత్యము. నిజమైన ఉత్తమ మనస్థాపముతో చనిపోవు పతితులు ఎందరో దేవునకు మాత్రమే తెలియును. వారలలో రక్షణము పొందువారు ఉత్తరించు స్థలములో ఉత్తరించవలెనని గమనించగలరు.
పైన వివరించిన కారణములవలన ఉత్తరించు స్థలములో వేదన అనుభవించు ఆత్మలు ఎన్నియని మాటల ద్వారా, లెక్కల ద్వారా చెప్పలేము.
క్రీస్తువులారా! ఏదైన ఒక దేశములో అనేక వేలమంది కరువుచేత చనిపోవు చున్నారని విన్నచో ఏమి చేస్తారు? వారిమీద జాలితో మీ చేతనైన సహాయము చేస్తారుకదా! ఆ విధంగానే ఉత్తరించు స్థలములో లెక్కలేని ఆత్మలు వేదన అనుభవించుటను తెలుసుకొని వారికొరకు జప, తప, దానధర్మాలు, దివ్యపూజలు సమర్పించవలెను.
అద్భుతము :-
ఇటలీ దేశములో ఒక పట్టణములో మరియమ్మ అను స్త్రీ వుండెడిది. ఆమె చిన్ననాటి నుండే చెడు జీవితము జీవిస్తూ, వయస్సు పెరిగే కొలది పాపాత్మురాలైనది. ముసలి ప్రాయములో కూడ దైవభయము, నరకభీతిలేక అందరికి కంఠకముగా మారినది. ఆ పట్టణవాసులు ఈమెను సహింపలేక ఊరువెలుపలికి తరిమారు. ఆమెకు ఇల్లు వాకిలి ఇతర ఆదరరువు ఏమియు లేనందున సమీపమందున్న కొండకుపోయి ఒక గుహలో ప్రవేశించినది. ఆ గుహలోనే ఏ సహాయము లేక నిర్భాగ్య స్థితిలో మనస్తాప గురుతులు లేక ఎవరికి తెలియకుండ చనిపోయింది.
ఆ పట్టణములో కత్తరీనమ్మ అను కన్యాశీ వుండినది. ఆ పుణ్యవతి మరణించిన వారిని గూర్చి వినినంతనే వారి ఆత్మ విశ్రాంతి కొరకు భక్తితో ప్రార్థనలు చేసేవారు. మరియమ్మ చనిపోయిన సంగతి వినినను ఆమె తప్పనిసరిగ నరకమునకుపోయి వుండునని భావించి ఆమె ఆత్మ నిమిత్తము ఒక్క ప్రార్థనైనను చేయలేదు. నాలుగు నెలలు గడిచిన తరువాత ఆమె ప్రార్ధనలో ఉన్నప్పుడు ఒక ఆత్మ ఆమెకు కన్పించి, కత్తరీనమ్మగారా ! మీరు మరణించిన ఆత్మలన్నిటికొరకు ప్రార్ధించువారుగా నున్నారు. కాని నా ఆత్మకొరకు ప్రార్థనే చేయుటలేదే అనినది. “నీవు ఎవరు?” అని ఆ కన్యాస్త్రీ అడుగగా "కొండగుహలో నిర్భాగ్యముగా మరణించిన మరియమ్మను నేను" అని చెప్పింది. నీవు నరకమును ఏ విధంగా తప్పించుకొన్నావని కత్తరీనమ్మగారు అడుగగా, ఆ ఆత్మ “దేవుని కృపచేతను, పరిశుద్ధ కన్య మరియమ్మగారి వేడుదలవల్లను తప్పించుకొన్నాను. అందరిచేత తృణీకరింపబడినను మరణించు సమయములో నా “పేరు" గొనియున్న మరియతలిని తలంచి “మరియమాతా! పాపాత్మురాలైన నేను నా పాపములకొరకు పశ్చాత్తాప పడుచున్నాను. అందరూ నన్ను త్రోసివేసినారు. కాని మీరు మాత్రము నన్ను చేయి విడువజాలరని నమ్మియున్నాను. నాకు సహాయముగా నుండండి. నా మీద దయగా నుండండి. నేను మీ నామమును కలిగియున్నాను. నన్ను నరకమునుండి కాపాడండని ప్రార్ధించాను. నా మనవిని దేవమాత దయతో ఆలకించి, నేను నా పాపముల నిమిత్తము ఉత్తమ మనస్తాపపడునట్లు అనుగ్రహము దయచేశారు. నేను ఉత్తమ మనస్తాపపడి దేవయిష్ట ప్రసాద స్థితిలో మరణించి నిత్యనరకమును తప్పించుకొన్నాను. కాని ఉత్తరించు స్థలములో మహా వేదన అనుభవిస్తున్నాను. నా ప్రియ సహోదరీ ! నా ఆత్మకొరకు ప్రార్ధించి పూజలు సమర్పించి ఉత్తరింపు పొందునట్లు నాకు సహాయము చేయుము. నేను మోక్షమునకు పోయిన తరువాత మీకొరకు ఎల్లప్పుడు ప్రార్ధిస్తానని చెప్పి అదృశ్యమైంది. కత్తరీనమ్మగారు ప్రార్ధనలుచేసి పూజలను సమర్పించిన కొన్ని నెలలకు ఆ ఆత్మ మహిమ ప్రతాపముతో కనిపించి, కత్తరీనమ్మగారా! మీరు నాకు గొప్ప ఉపకారము చేశారు. మీ ప్రార్థనలవలన నా ఉత్తరింపు తీరి మోక్షమునకు పోవుచున్నాను. మీ కొరకు నిరంతరము ప్రార్ధిస్తానని చెప్పి ఆ ఆత్మ మోక్షమునకు పోవుటను ఆ కన్యాస్త్రీ గాంచారు.
క్రీస్తువులారా! పైన చెప్పిన పాపాత్మురాలు నిత్యనరకమును తప్పించుకొని మోక్షమునకు పోయిన విషయమును తెలుసుకొన్నారు కదా! కనుక ఎటువంటి పాపాత్ములైనను మరణించినచో వారికొరకు తప్పక ప్రార్థించాలి.
ఉత్తరించు ఆత్మలకొరకు ప్రార్థన :-
దేవా ! పాతాళము నుండి మిమ్ము ఎలుగెత్తి పిలుచుచున్నాను. నా మొర ఆలకించండి. మా పాపములను లెక్కించినచో మీ ఎదుట నిలువబడ గలవాడు ఎవడు? మమ్ము కనికరించి మా పాపములు మన్నించండి. మీ యందే నమ్మకము కలిగియున్నాము. మీ రక్షణమును అనుగ్రహించండి.
ఒకరు: ఏలినవారా! ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయండి.
అందరు: నిత్య ప్రకాశము వారలకు ప్రకాశించునుగాక!
ఒకరు: వారలు సమాధానమందు విశ్రమింతురుగాక!
అందరు: ఆమెన్
ప్రార్ధించుదము :
సకల విశ్వాసుల సృష్టికర్త, రక్షకుడైన సర్వేశ్వరా! మీ దాసుల ఆత్మలకు సంపూర్ణ పాప పరిహారము ప్రసాదించండి. వారు ఆశించు మన్నింపును దయ చేయండి. పితతోను, పవిత్రాత్మతోను సదాకాలము జీవించు మా ప్రభువు యేసునామమున ప్రార్థిస్తున్నాము. పరమతండ్రి! ఆమెన్.
ఒకరు: విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయచేత సమాధానమందు విశ్రమించునుగాక!
అందరు: ఆమెన్.
