Day 09 - ఉత్తరించు ఆత్మల స్మరణ మాసము

జోసెఫ్ అవినాష్
09 Nov 2026
Day 09 - ఉత్తరించు ఆత్మల స్మరణ మాసము
ధ్యానాంశము : ఉత్తరించు స్థలములోని వేదనలవల్ల ఉత్తరించు ఆత్మలకు ఏ పుణ్యఫలము లభించదని, అది ఈ లోకంలో జీవించుచున్నవారివలన మాత్రమే కలుగునని తెలియజేయు అంశము
ధ్యానము :-
ఎవరును పని చేయలేని రాత్రికాలము వచ్చునని యేసు ప్రభువు వచించి యున్నారు. ఈ దివ్యవచనమునకు అర్థమేమనగా : మరణించిన తరువాత ఎవరును ఏదొక ఫలముగల పుణ్యమును చేయలేరని వేదపండితులు చెప్పుచున్నారు. కాబట్టి మానవులందరు జీవించియున్నప్పుడే, మోక్షభాగ్యమును పొందగల సర్రియలు పట్టుదలతో చేయాలి. జీవితకాలములో చేసిన పుణ్యకార్యములు ఆత్మ సంబంధమైన మంచి ఫలితాలను యిస్తాయి. కాని ఉత్తరించు స్థలములోని ఆత్మలు తమ పాపములకు పరిహారము చెల్లించలేవు. సర్వేశ్వరుని కోపాగ్ని చల్లారునదియు లేదు.
జెరుసలేము నగరములో వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమును చేకూర్చు సిలోయమనెడి ఒక కోనేరు ఉండెడిది. దానిలో నియమిత సమయములో మొదట మునిగెడు ఎటువంటి వ్యాధిగ్రస్తునికైనను స్వస్థత కలిగేది. ముప్పది యెనిమిది సంవత్సరముల నుండి పక్షవాతము గల రోగి ఒకడు ఈ కోనేటిగట్టున అనేక దినములు కాచుకొనియుండినను, తనను కోనేటిలో దింపెడువారు లేక ఆ జలములో దిగుటకు శక్తిలేనివాడై ఉండెను. అందువలన ఈ రోగికిగల విసుగు, దుఃఖము కొంచెమని చెప్పగలమా? (యోహాను 5:1-9) ఉత్తరించు ఆత్మల పరిస్థితి ఈలాగునే వున్నది. ఈ ఆత్మలు తమకు తామే ఏదొక సహాయము చేసుకొనలేకయున్నారు. తాము ఉత్తరింపు కాలము ముగియువరకు వేదన అనుభవిస్తారు.
భూలోకములో ఉండువారు జపములు, ధర్మములు, త్యాగకృత్యము ఉత్తరించు స్థలములోని ఆత్మ నిమిత్తము చేసినయెడల ఆ ఆత్మకు మేలు కలుగును. వేదసాక్షులందురు అనుభవించిన బాధలకంటే, ఉత్తరించు ఆత్మలు క్రూరమైన బాధలు అనుభవించినను వారలకు ఏ బహుమానము లేదు. వారల వేదనలవలన వారికి అల్ప ఊరటకూడ లభించదు.
ఉత్తరించు స్థలములోని ఆత్మలకు ఇతరులనుండి సహాయము లభించునా? సహాయము లభించుట సందేహముగా నుండుటయేగాక, ఆలాగున లభించు సహాయము బహు కొంచెముగా ఉండును. పూర్వవేదములో యాకోబు కుమారుడు యోసేపు, సోదరుల
అసూయవలన బానిసగ అమ్మబడి, అన్యాయముగా నేరము మోపబడి చెరసాలలో వేయబడి మిగుల కష్టపడుచుండెను. చెరసాలలో తనతోపాటు శిక్ష విధింపబడిన రాజు సేవకునికి గొప్ప సహాయము చేసిన పిమ్మట యోసేపు అతనితో ఈ విధంగా అన్నాడు. “నీవు నీ ఉద్యోగములో తిరిగి చేరినప్పుడు నా మీద దయచూపి, నన్ను గూర్చి రాజుతో మాట్లాడి నన్ను చెరసాలనుండి విడిపించమని ప్రార్థించుచున్నాను." కాని ఆ ఉద్యోగి తనకు సకలము సఫలమైనను, తనకు ఉపకారము చేసిన యోసేపును మరచిపోయాడు (ఆది. 40:12-14, 21-23). ఉత్తరించు ఆత్మలకు కూడ అనేకమారులు ఇలాగునే జరుగుచున్నది. బిడలు తమ తల్లి దండ్రులను, తల్లిదండ్రులు తమ బిడ్డలను, స్నేహితులు తమ స్నేహితులను, ఉపకారము పొందినవారు తమకు మేలుచేసినవారిని మరచిపోయి, వారల కష్టమును తీర్చుటకు ఏమియు చేయకుండ ఉంటున్నారు. ఏదైనను చేసినను కొంచెము మాత్రమే చేయుచున్నారు. చనిపోయినవారు ఉత్తరించు స్థలములో భరింపలేని వేదన అనుభవిస్తూ ఉండగా, వారి బిడ్డలు, బంధువులు, స్నేహితులు ఆ చనిపోయిన వారల ఆస్థిపాస్తులు అనుభవిస్తూ ఆనందంగా జీవిస్తు ఉంటున్నారేగాని, చనిపోయినవారి ఆత్మల నిమిత్తము ఏమియు చేయుటలేదు. అందువల్ల ఆ ఆత్మలు ఏ సహాయము పొందలేక తమకు విధింపబడిన శిక్ష అనుభవించవలసి యున్నది.
అద్భుతము :-
పునీత నికోలాస్ గారు ఉత్తరించు ఆత్మల మీద ప్రేమతో పట్టుదలతో వారి ఉత్తరింపుకొరకు ప్రార్థించెడివారు. వారి ప్రార్థనలు, తపోక్రియలు దేవుని దృష్టిలో విలువ గలిగినవిగా ఉండెను. అందువల్ల ఉత్తరించు ఆత్మలు వారికి దర్శనమై తమ నిమిత్తము వేడుకొనవలయునని అనేకమారులు కోరినట్లు వారి చరిత్ర ద్వారా తెలియుచున్నది. ఒకనాడు వారు నిద్రించునపుడు, కొన్ని దినములకు ముందు చనిపోయినవారి స్నేహితుడు బెలెగ్రినో అను మఠవాసి ఆత్మ వారికి దర్శనమిచ్చినది. తాను ఉత్తరించు స్థలములో వేదనలు అనుభవిస్తున్నానని, మీరు నా వెంబడి వచ్చి నావలె వేదనలను అనుభవిస్తున్న ఆత్మలను చూడమని కోరింది. పునీత నికోలస్ గారు ఆ ఆత్మను అనుసరించి ఒక పెద్ద మైదానమును చేరారు. ఆ మైదానములో ఘోరమైన మంటలు, ఆకాశమువరకు లేచెడు ఇసుకతో కూడిన ఒక పెద్ద జ్వాలను చూచారు. ఆ జ్వాలమధ్య అనేక ఆత్మలు వేదనలతో ప్రలాపించుటను, తమ మీద దయకలిగి సహాయము చేయమని ప్రార్థించుటను చూచారు. ఆ భయంకర దృశ్యమును గాంచి వణికి నిశ్చేష్టుడై నిలుచుండిపోయారు. అప్పుడు వారిని పిలుచుకొని వచ్చిన బెలెగ్రినోగారి ఆత్మ ఈ విధంగా కోరినది. ఈ ఆత్మలమీద దయకలిగి వీరికొరకు జపములు, ఉపవాసములు, తపోక్రియలు, దివ్యపూజలు సమర్పించి వారు మోక్షమునకు పోవునట్లు పాటుబడమని చెప్పి మరుగైపోయినది.
పునీత నికోలస్ గారు మేలుకొనిన పిమ్మట ఆ ఆత్మలకొరకు కన్నీటితో భక్తితో ప్రార్థన చేశారు. ప్రాతఃకాలమునే ఆ ఆత్మలకొరకు దివ్యపూజ చేశారు. ఆ విధంగా ప్రతి దినము అనేక జపములు, దివ్యపూజలు సమర్పిస్తూ వచ్చారు. ఎనిమిదవ దినమున బెలెగ్రినోగారి ఆత్మ సంతోషముతోను, మహిమతోను కనిపించి తాను, తనతోకూడ అనేక ఆత్మలు వారి జపములు, దివ్యపూజలవలన ఉత్తరింపుపొంది మోక్షమునకు పోవుచున్నట్లుగా తెలియపరచి, కృతజ్ఞతా వందనములు చెప్పి మరుగైపోయినది.
క్రైస్తవులారా ! ఇప్పుడు వినిన అద్భుతము ఉత్తరించు ఆత్మలను రక్షింప వలయునను ఆశ మీకు కలిగియుండును. పునీత నికోలగారివలె మీరు ఉత్తరించు స్థలములోని ఆత్మల నిమిత్తం పట్టుదలతో జప, తప, దాన ధర్మములు, దివ్యపూజలు సమర్పించండి. మీ వలన రక్షింపబడిన ఆత్మలు తప్పక మీ కొరకు ప్రార్థిస్తారు.
మృతిచెందిన విశ్వాసుల ఆత్మలకొరకు 1 పరలోక . 1 మంగళ . 1 త్రిత్వ. చెప్పుము.
"స్వామీ ! పాతాళము నుండి మిమ్ము ఎలుగెత్తి పిలుచుచున్నాను" అను సుకృతజపము చెప్పండి.
నిత్యపితా ! యేసునాధుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మలమీద దయగానుండండి (3 సార్లు చెప్పవలెను).
ఉత్తరించు ఆత్మలకొరకు ప్రార్థన :-
దేవా ! పాతాళము నుండి మిమ్ము ఎలుగెత్తి పిలుచుచున్నాను. నా మొర ఆలకించండి. మా పాపములను లెక్కించినచో మీ ఎదుట నిలువబడ గలవాడు ఎవడు? మమ్ము కనికరించి మా పాపములు మన్నించండి. మీ యందే నమ్మకము కలిగియున్నాము. మీ రక్షణమును అనుగ్రహించండి.
ఒకరు: ఏలినవారా! ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయండి.
అందరు: నిత్య ప్రకాశము వారలకు ప్రకాశించునుగాక!
ఒకరు: వారలు సమాధానమందు విశ్రమింతురుగాక!
అందరు: ఆమెన్
ప్రార్ధించుదము :
సకల విశ్వాసుల సృష్టికర్త, రక్షకుడైన సర్వేశ్వరా! మీ దాసుల ఆత్మలకు సంపూర్ణ పాప పరిహారము ప్రసాదించండి. వారు ఆశించు మన్నింపును దయ చేయండి. పితతోను, పవిత్రాత్మతోను సదాకాలము జీవించు మా ప్రభువు యేసునామమున ప్రార్థిస్తున్నాము. పరమతండ్రి! ఆమెన్.
