"దైవమా? ద్రవ్యమా?”

జోసెఫ్ అవినాష్
06 Nov 2026
సామాన్య 31వ శనివారం
సువిశేష ధ్యానం -:
లూకా 16:9-15
ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపజాలడు.వాడు ఒకనినిద్వేషించును,వేరొకరిని ప్రేమించును.మీరు దైవాన్ని, ద్రవ్యాన్ని సేవింపలేరు. ఈ మాటలలో యేసు మనిషిలోని కపటత్వాన్ని ఎత్తిచూపిస్తున్నారు.దేవుని సేవించేవారు.దేవుని మాత్రమే సేవించాలి. యేసుక్రీస్తుని అనుసరించేవారు యేసుక్రీస్తుని మాత్రమే అనుసరించాలి. రెండు పడవల మీద కాలు పెడితే మునిగిపోవడం లేదా పడిపోవడం జరుగుతుంది. దేవుని నమ్ముకున్న వారు, వారి దృష్టి సంపూర్ణంగా దేవుని పైనే ఉండాలి.అప్పుడు తప్పనిసరిగా వారు గమ్యాన్ని చేరుకుంటారు. యేసు శిష్యులు ఎలా జీవించాలో నేర్పించారు. ఎలా జీవించకూడదో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువుకు పేదల ఎడల ప్రత్యేక శ్రద్ధ ఉన్నది. పేద ధనిక తారతమ్యాలతో జీవిస్తున్న ప్రపంచంలో పేదలను
ఆదరించడం పూర్తిగా మర్చిపోయారు. దేవుని రాజ్యంలో ఇలాంటి తారతమ్యాలు ఉండవు. దేవుడు సంపదలను ఇచ్చేది మనం బాధ్యతాయుతంగా ఉపయోగించడానికే కానీ వాటిని దుర్వినియోగపరచి, తోటి వారిని దోచుకోవాలన్న మనస్తత్వంతో జీవించడానికి కాదు. ధనంతో మనకున్న సంబంధం ఎలా ఉంది? ధన సంపాదనకు ఎంత సమయాన్ని, ఎంత శక్తిని ఉపయోగిస్తున్నాం? మన జీవితంపై ధనానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నామా? ధనమే మనపై యజమానిగా ఉన్నదా? యేసుక్రీస్తు ప్రభువు ధనాన్ని ఎలా ఉపయోగించాలని ఆదేశిస్తున్నాడు? ఈ లోక సంపదల విషయంలో మనం నమ్మదగిన వారం కానిచో పరలోక సంపదలను దేవుడు ఎలా మనకి
అప్పగిస్తాడు? పరుల సొమ్ము విషయంలో మనం నమ్మదగిన వారం కానిచో, మన ఆత్మ రక్షణను ఎలా సంపాదించుకుంటాం? దేవుడు అనుగ్రహించిన సంపదలను
నిజాయితీగా వెచ్చించాలి. మన హృదయంలో దేవునికే స్థానం ఉండాలి కానీ సృష్టి వస్తువులతో నింపుకోకూడదు. మన అనుదిన జీవితంలో చిన్న చిన్న పనులను మనం
ఎలా చేస్తున్నామో పరిశీలిద్దాం! ఉదయం లేవగానే దేవుని స్మరిస్తున్నామా? పరాకు లేకుండా ప్రార్థన చేయగలుగుచున్నామా? తల్లిదండ్రులకు విధేయిస్తున్నామా? పెద్దల మాటలను గౌరవిస్తున్నామా? మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటున్నామా?
అవసరాలలో ఉన్న వారిని ఆదుకుంటున్నామా? ధనాన్ని వృథాగా చేస్తున్నామా?
విలాస జీవితాన్ని కోరుకుంటున్నామా? ప్రతి విషయానికి అబద్ధాలు చెబుతున్నామా? మోసం చేస్తున్నామా? లంచాలు తీసుకుంటున్నామా? దేవుడే మన యజమానిగా
స్వీకరిద్దాం. దేవునికి ప్రియమైన కార్యాలు చేద్దాం..
