వైవిధ్యంలో ఐక్యతను కాపాడుకోవడం కతోలిక సంఘపు గొప్ప సంపద: పోప్

జోసెఫ్ అవినాష్

06 Nov 2026

ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు,ఘర్షణలతో అల్లకల్లోలంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో,కతోలిక సంఘంలోని ఐక్యతను కాపాడుకోవడం అందరికీ శాంతిని అందించే గొప్ప సంపద అని పోప్ లియో XIV పేర్కొన్నారు.వైవిధ్యాన్ని గౌరవిస్తూ ఐక్యతతో జీవించాలి తప్ప,అందరూ ఒకే విధంగా ఉండటమే ఐక్యత కాదని ఆయన స్పష్టం చేశారు.చైనాలో కతోలిక సంఘం ప్రస్థానం, తొలి చైనా పీఠాధిపతుల అభిషేకానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా రోమ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు పోప్ లియో XIV వీడియో సందేశాన్ని పంపించారు.1926 అక్టోబర్ 28న రోమ్‌లోని పునీత పేతురు బసిలికాలో పోప్ పియస్ XI చేతుల మీదుగా ఆధునిక కాలంలో తొలి ఆరుగురు చైనా కతోలిక పీఠాధిపతులు అభిషేకం పొందిన చారిత్రక ఘట్టాన్ని ఆయన గుర్తుచేశారు.

కతోలిక సంఘం తన సువార్త పరిచర్యలో స్థానిక ప్రజల సంస్కృతి,సంప్రదాయాలు, ప్రత్యేకతలను గౌరవించాలని పోప్ పేర్కొన్నారు.1919లో పోప్ బెనెడిక్ట్ XV విడుదల చేసిన Maximum Illud అపోస్తలిక లేఖను ప్రస్తావిస్తూ,సువార్త పరిచర్యను వలసవాదంతోనూ,ఇతరులపై సంస్కృతిని బలవంతంగా రుద్దడంతోనూ ముడిపెట్టకూడదని వివరించారు.మానవుల వ్యూహాల వల్ల కాకుండా దేవుని కృప ద్వారానే సువార్త ప్రతి ప్రాంతంలో విస్తరిస్తుందని తెలిపారు.1924లో జరిగిన షాంఘై సదస్సులో చైనాలోని స్థానిక కతోలిక సమాజాల బాధ్యతలను స్థానికంగా జన్మించిన గురువులకు, పీఠాధిపతులకు అప్పగించాలనే ఆకాంక్ష వ్యక్తమైందని పోప్ గుర్తుచేశారు.సంఘం యొక్క నిజమైన స్వభావానికి అనుగుణంగా ఈ ప్రక్రియ అవసరమని, ఎందుకంటే సంఘ ఐక్యత అంటే అందరూ ఒకేలా ఉండటం కాదు;భిన్నత్వంలో పరస్పర సహవాసంతో జీవించడమేనని ఆయన వివరించారు.ప్రతి వ్యక్తి, ప్రతి ప్రజాసమూహం తమకంటూ ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారని, వాటిని కతోలిక విశ్వాసం గౌరవిస్తుందని పోప్ తెలిపారు. రోమ్ పీఠాధిపతితో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర పీఠాధిపతులతో ఐక్యతలో ఉంటూ ప్రతి పీఠాధిపతి తన పరిచర్యను కొనసాగిస్తారని పేర్కొన్నారు.

1926లో ఆరుగురు చైనా పీఠాధిపతులు అభిషేకం పొందిన సందర్భం అక్కడి కతోలిక విశ్వాసుల్లో ఆనందం, గర్వాన్ని నింపిందని, అపనమ్మకం, అనుమానం, శత్రుత్వాలకు ముగింపు పలికే గొప్ప సంకేతంగా నిలిచిందని పోప్ గుర్తుచేశారు.చివరగా, ప్రస్తుత ప్రపంచం యుద్ధాలతోనూ, ఘర్షణలతోనూ సతమతమవుతున్న తరుణంలో, ప్రతి ముప్పు నుంచి కతోలిక సంఘ ఐక్యత అనే అమూల్యమైన సంపదను ప్రభువు కాపాడాలని ప్రార్థిస్తున్నట్లు పోప్ లియో XIV తన సందేశంలో పేర్కొన్నారు. ఈ ఐక్యత ప్రపంచ ప్రజలందరికీ మేలు, శాంతిని చేకూర్చే ఫలవంతమైన మూలంగా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN