కరుణ గల కాపరి క్రీస్తుప్రభువు

ప్రసాద్ గార్లపాటి

05 Nov 2026

తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం…
తొంభై తొమ్మిదింటిని విడిచిపెట్టిన కాపరి!
(బైబిలు ఆధారం: లూకా 15:3–7)

సూర్యాస్తమయం సమీపిస్తోంది. సూర్యుడు నెమ్మదిగా కనుమరుగవుతున్నాడు. పచ్చిక బయళ్ల నుంచి గొర్రెల మందను తోలుకుంటూ ఒక కాపరి తన నివాసానికి చేరుకుంటున్నాడు. ప్రతిరోజూ మాదిరిగానే తన మందను లెక్కించడం ప్రారంభించాడు.ఒక్కొక్కటిగా లెక్కపెడుతున్నాడు. తొంభై ఏడు… తొంభై ఎనిమిది… తొంభై తొమ్మిది…కానీ వందో గొర్రె కనిపించలేదు!
ఒక్క గొర్రె మాత్రమే కదా! మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలు సురక్షితంగా ఉన్నాయి కదా! దాని కోసం వెతకడం ఎందుకు? అని ఆ కాపరి హృదయం అలా ఆలోచించలేదు. అతనికి ఆ తప్పిపోయిన గొర్రె కూడా మిగిలిన వాటితో సమానంగా అమూల్యమైనదే! అందుకే తొంభై తొమ్మిదింటిని విడిచి, ఆ ఒక్కదాని కోసం వెతుకుతూ బయలుదేరాడు.

ముళ్ల పొదల్లో, కొండ చరియల మధ్యన, లోయల లోతుల్లో, అంతటా వెతికాడు. కానీ అతని అన్వేషణ ఆగలేదు. చివరకు ఆ గొర్రె కనిపించింది. దానిని మందలించకుండా, శిక్షించకుండా, ఆనందంతో తన భుజాలపై వేసుకొని తిరిగి తీసుకొచ్చాడు.అసలు ఒక గొర్రె కోసం కాపరి ఇంతగా ఎందుకు తపించాడు? తప్పిపోయిన ఆ ఒక్క జీవికి అంత విలువ ఇచ్చాడా? ఈ సాధారణ గొర్రెల కథలో యేసుక్రీస్తు మానవాళికి వెల్లడించిన అసాధారణమైన దైవప్రేమ రహస్యం ఏమితో చూదాం రండి.

తప్పిపోయిన గొర్రెలో దాగివున్న మానవ జీవితం!
ఒక సందర్భంలో పాపులు, సుంకరులు యేసు బోధలు వినడానికి ఆయన దగ్గరకు వస్తున్నారు. దీనిని చూసిన పరిసయ్యులు, శాస్త్రులు ఆయన పాపులను ఆదరిస్తున్నాడని విమర్శించారు. అప్పుడు యేసు ఈ ఉపమానాన్ని వివరించాడు (లూకా 15:1–7).

వంద గొర్రెలున్న ఒక కాపరి, వాటిలో ఒక్కటి తప్పిపోయినప్పుడు దానిని వెతకడానికి బయలుదేరాడు. దొరికిన తరువాత దానిని భుజాలపై వేసుకొని ఆనందంతో ఇంటికి వచ్చాడు. తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి తన ఆనందాన్ని పంచుకున్నాడు.

ఈ ఉపమానంలో కాపరి దేవుని ప్రేమను ప్రతిబింబించాడు.తప్పిపోయిన గొర్రె పాపంలో చిక్కుకున్న మనిషిని గుర్తుచేస్తుంది. గొర్రెను వెతకడానికి బయలుదేరిన కాపరి చర్య, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు చూపిన దైవకరుణను వెల్లడిస్తుంది.

మనుషుల దృష్టిలో ఒక వ్యక్తి తప్పు చేసినవాడై ఉండవచ్చు. సమాజం అతనిని తిరస్కరించి ఉండవచ్చు. అతని గతం ఎన్నో తప్పులతో నిండి ఉండవచ్చు. కానీ దేవుని దృష్టిలో అతనికి పశ్చాత్తాపపడి తిరిగి రావడానికి అవకాశం ఉంది.
దేవుడు పాపాన్ని సమర్థించడు; పాపిని పశ్చాత్తాపం ద్వారా రక్షణ వైపు నడిపించాలని కోరుకుంటాడు.
తొంభై తొమ్మిదింటికంటే ఒక్కదానికి విలువ ఎక్కువా?
ఈ ఉపమానాన్ని చదివినప్పుడు ఒక ప్రశ్న మనలో కలగవచ్చు. మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలను వదిలేసి ఒక్కదాని కోసం వెళ్లడం ఎందుకు?

ఇక్కడ యేసు మనకు బోధిస్తున్నది సంఖ్యల లెక్క కాదు; దేవుని కరుణలో ప్రతి ఒక్కరి విలువ. దేవుని ప్రేమలో ఎవ్వరూ నిర్లక్ష్యానికి గురికారు. ఎవరి జీవితం కూడా ఆయనకు అల్పమైనది కాదు.
ఒక వ్యక్తి పాపంలో పడిపోయాడని అతనిని శాశ్వతంగా తిరస్కరించాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి దేవుని నుంచి దూరమయ్యాడని అతనిపై ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదు.
యేసు చెప్పిన మాటల్లో ఈ ఉపమానపు పరాకాష్ఠ కనిపిస్తుంది:
“అలాగే పశ్చాత్తాపం అవసరం లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతులకంటే, పశ్చాత్తాపపడే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ ఆనందం కలుగును” (లూకా 15:7).
ఇది దేవుని హృదయాన్ని పరిచయం చేసే వాక్యం. పాపి తిరిగి వచ్చినప్పుడు దేవుడు అతనిని అవమానించడు; అతని పశ్చాత్తాపాన్ని ఆనందంతో స్వీకరిస్తాడు.
దేవుని ప్రేమలో ఎవ్వరూ తప్పిపోయినవారు కాదు!

ప్రియమైన సహోదరీ సహోదరులారా!
మన జీవితాల్లో కొన్నిసార్లు మనమే ఆ తప్పిపోయిన గొర్రెలా మారుతాం. అహంకారం మనల్ని దేవుని నుంచి దూరం చేయవచ్చు. పాపం మన ఆత్మీయ జీవితాన్ని బలహీనపరచవచ్చు. నిరాశ మనలో ఆశను చంపివేయవచ్చు. అయినప్పటికీ దేవుని వైపు తిరిగి రావడానికి తలుపు మూసుకుపోలేదు.
ఈ ఉపమానం మనకు మరో బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది. తప్పిపోయినవారిని విమర్శించడం సులభం; వారిని వెతికి, ప్రేమతో తిరిగి నడిపించడం నిజమైన క్రైస్తవ ధర్మం. మన కుటుంబాల్లోనూ, సమాజంలోనూ, సంఘంలోనూ దూరమైనవారిని ప్రేమతో చేరదీసే కాపరులుగా మనం మారాలి.

ఒక్కసారి ఆలోచించండి… మన చుట్టూ ఎవరో ఒకరు ఒంటరితనంతో బాధపడుతుండవచ్చు. ఎవరో ఒకరు విశ్వాసాన్ని కోల్పోయి ఉండవచ్చు. మరొకరు పాపభారంతో దేవుని సన్నిధికి రావడానికి భయపడుతుండవచ్చు. అలాంటి వారికి తీర్పు చెప్పే మనుషులుగా కాకుండా, దేవుని ప్రేమను చూపించే సాధనాలుగా మారుదాం.
గుర్తుంచుకోండి! తొంభై తొమ్మిది గొర్రెల మధ్య కనిపించకుండా పోయిన ఒక్క గొర్రెను కూడా కాపరి మరచిపోలేదు. అలాగే ప్రపంచమంతటిలో నీ ఉనికి చిన్నదిగా కనిపించినా, దేవుని ప్రేమలో నీ జీవితం అమూల్యమైనది.
మనిషి నిన్ను వదిలేయవచ్చు… సమాజం నిన్ను తిరస్కరించవచ్చు… కానీ దేవుని కరుణ వైపు తిరిగి రావడానికి నీ హృదయాన్ని ఎప్పుడూ మూసుకోకు!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN