Day 04 - ఉత్తరించు ఆత్మల స్మరణ మాసము

సకల ఆత్మల సంస్మరణ మాస పుస్తకం
04 Nov 2026
Day 04 - ఉత్తరించు ఆత్మల స్మరణ మాసము
ధ్యానాంశము :
ఉత్తరించు స్థలము కలదనుట న్యాయ సమ్మతమైన సత్యము
ధ్యానము
ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకడు తన కన్న తల్లిదండ్రులను ద్వేషించి, హింసించి, చంపేశాడు. మరియొకడు ఒక దోసకాయ దొంగిలించాడు. వీరిద్దరిలో మొదటివాడు చేసిన పాపమునకు రెండవాడు చేసిన తప్పిదమునకు ఎంతో వ్యత్యాసము ఉన్నది.
ఒకడు తన విరోధిని అంతము చేయాలను ఉద్దేశముతో వానిమీద లేని తప్పిదమును మోసి అబద్ద సాక్ష్యములను పలికించి పొనికి మరణశిక్ష పడునట్లు చేశాడు. మరియొకడు ఎగతాళిగా ఒక స్వల్ప అబద్దమును చెప్పాడు. మొదటివాడు చేసిన పాపము రెండవాడు చేసిన తప్పిదము సమానమేనని ఎవరైన చెప్పగలరా ?
ఎవరైనను పెద్ద పాపములు, చిన్న పాపములు గలవని తమ స్వంత జ్ఞానముతో గ్రహించి చెప్పగలరు. ముందు చావైన పాపములు చేసిన వారందరు పాప సంకీర్తనము చేయకయు, ఉత్తమ మనస్తాపము పడకయు ఆకస్మికముగా మరణించినచో సర్వ నీతిగల సర్వేశ్వరుడు వారలను ఏమి చేయుదురు ? వారందరిని నరకములో పడద్రోయుదురు గదా ! అలాగే స్వల్ప పాపములను చేసిన వారలను కూడ నరకమునకు పంపుదురా? అందరిని ఒకేలాగు శిక్షించుట వారి నీతికిని దయకును తగునా ? అలా తగదని అందరికి అనిపిస్తుంది గదా ! చావైన పాపములను చేసినవారిని, స్వల్ప పాపములను చేసినవారిని దేవుడు ఒకే విధంగా శిక్షించరు. కాని మోక్షములో స్వల్ప తప్పిదములు చేసినవారు కూడ ప్రవేశింపలేరు. స్వల్పపాపములతో చనిపోవువారలు మోక్షమునకు వెంటనే పోక తాము పరిశుద్ధమగు వరకు ఒక మధ్యస్థలములో ఉత్తరించవలయును. తమ తప్పులకు తగిన దండన అనుభవించెడు స్థలమునే ఉత్తరించు స్థలము అంటారు.
అనేకులు చావైన పాపములు కట్టుకొన్నప్పటికీ మంచి పాప సంకీర్తనము వలనగాని ఉత్తమ మనస్తాపము వలనగాని ఈ పాపములకు మన్నింపు పొందిన తరువాత చనిపోవుచున్నారు గదా ! మనమొక సత్యమును తెలుసుకొనవలెను. మనసొప్పి చేసిన చావైన పాపమువలన రెండు విధాలుగా కీడు కలుగుచున్నది. ఒకటి పాప దోషము, మరొకటి దానికి తగిన శిక్ష. పాపదోషమువలన దేవ ఇష్ట ప్రసాదమును కోల్పో యి దేవునకు దూరమగు చున్నాము. శిక్ష రెండు విధాలుగ ఉంటుంది. ఒకటి నరకశిక్ష. మరొకటి అనిత్య శిక్ష. పాప దోషము తీరకపోయినట్టయిన నిత్యశిక్ష వలన సదాకాలము నరకములో ఉండాలి. పాపదోషము పాప సంకీర్తనము వలనగాని ఉత్తమ మనస్తాపము వలన గారి తీరినట్టయిన నిత్యనరకమును తప్పించుకొనగలము. కాని ఈ పాపముకు చెల్లించవలసిన అనిత్య శిక్ష తప్పదు.
ఈ అపరాధమును చెల్లింపవలసియుండినను అనేకులు దీనిని చెల్లింపక మరణిస్తున్నారు. దేవ ఇష్టప్రసాద స్థితిలో మరణించుటవలన నరకమునకుపోరు. అనిత్య అపరాధమును చెల్లింపకపోవుటవలన నేరుగా మోక్షమునకు పోలేరు. కావున వారు తమ పాపములకు చెల్లింపవలసిన అపరాధమును పరిహారమును చెల్లించుటకు ఉత్తరించు అను స్థలముగలదు. ఈ స్థలములోని ఆత్మలు తమకుతాము ఏ పుణ్యము సంపాదించు కొనలేవు. కనుక తాము అనుభవించు వేదనలవలన ఆ పరిహార అపరాధమును చెల్లించ వలెను. ఇది న్యాయసమ్మతమే గదా !
సర్వేశ్వరుడు దయచేసిన పది ఆజ్ఞలు రెండు ఆజ్ఞలలో ఇమిడి ఉన్నవి. ఒకటి సకల వస్తువులకంటే సర్వేశ్వరుని అధికముగ ప్రేమించాలి. రెండవది నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. పొరుగు వారినందరిని ప్రేమించవలసియున్నను, బంధువులను, మేలులు చేసినవారిని, స్నేహితులను ఎక్కువగా ప్రేమించవలెను కదా! ఈ ప్రేమ మరణించిన మనవారిపట్ల ప్రదర్శించుట ధర్మమే కదా! మరణించిన మనవారి ఆత్మలు ఉత్తరించు స్థలములో అనుభవించెడి వేదనలను తగ్గించుటకు వారికొరకు జపతప దానధర్మములు, దివ్యపూజలు ప్రేమతో సమర్పించాలి.
ఆలాగున వారి ఆత్మలు మన ప్రార్థనలవలన ఉత్తరించు స్థలము నుండి విడుదల పొంది మోక్షమునకు చేరిన పిమ్మట మనలను మరువక మన కొరకు దేవుని ప్రార్థిస్తారు. ఈ విధముగా యుద్ధ సభవారు, ఉత్తరించు సభవారు, మోక్షసభవారు వీడని బంధము కలిగియున్నారు. ఇది వేదవాక్యము వలన తెలుపబడిన విశ్వాస సత్యము.
ఈ దినము తరచుగా చెప్పవలసిన సుకృత జపము :
జేసువా మా మీద దయగా నుండండి.
జపము:-
సర్వవల్లభులైన నిత్య సర్వేశ్వరా ! ఈ లోకములో జీవించు వారిమీదను, ఉ తరించు స్థలములోని ఆత్మలమీదను, మోక్షవాసులమీదను మీరు సర్వాధికారము కలిగియున్నారు. ఉత్తరించు స్థలములోని ఆత్మలు మా దీన ప్రార్ధనల ద్వారా మరియు మోక్షవాసుల వేడుదలద్వారా ఉత్తరింపు పొంది మోక్ష రాజ్యములో ప్రవేశింప కరుణించండి స్వామీ. ఆమెన్.
అద్భుతము :-
ఉత్తరించు స్థలములేదని, మరణించినవారి ఆత్మలకు బ్రతికియున్న వారికి ఏ విధమైన సంబంధములేదని, ఈ ఆత్మలకు మనుష్యలవల్ల ఏ మేలు కలుగదని వాదించు అవిశ్వాసులు గలరు. ఇది వారి అజ్ఞానమును సూచిస్తుంది. మరణించిన పిమ్మట వీరు నిర్భాగ్యులుగా ఎంచబడుదురు.
స్కోపియా రాజ్యములో గొప్ప ధనవంతుడైన ఒక తండ్రికి జన్మించిన ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఉండెడివారు. వారు ఇద్దరు సుగుణవంతులు. కలసిమెలసి అన్యోన్యముగా అనురాగముగా జీవించెడివారు. వీరు ప్రొటెస్టంట్ సహోదరులు. మార్టిన్ లూథరుగారు ఉత్తరించు స్థలములేదని చెప్పుట వలన వీరు అదే విశ్వసించారు.
ఒకరోజు వీరిరువురు, కొంతమంది స్నేహితులు కలసి ఒక విందులో పాల్గొన్నారు. సంతోషముగా విందు ఆరగిస్తున్నారు. ఈ ఇద్దరు సోదరులలో చిన్నవాడు అకస్మాత్తుగా మూర్చిల్లి మరణించాడు. అన్న తమ్ముని మరణమునకు ఎంతో దుఃఖించాడు. ఎడతెగక కన్నీళ్లు కార్చుచుండెను. తమ్ముడు మంచి ఆయత్తము లేక అకస్మాత్తుగా మరణించి నందువలన మోక్షమునకు పోయాడో లేదోనని చింతించేవాడు. ఈ దిగులువలన నిద్ర, సంతోషము కరువై మానసిక రోగిగా మారాడు. అతని బంధువులు, స్నేహితులు అతనిని కొంతకాలము విదేశాలకు యాత్రకు పొమ్మని సూచించారు. అతడు ఆవిధంగా మానసికంగా కోలుకుంటాడని భావించారు.
యాత్రలో భాగంగా అతడు ఫ్రాన్స్ దేశానికి వెళ్ళాడు. అక్కడ అనుకోకుండ కథోలిక గురువును కలిశాడు. తన తమ్ముని ఆకస్మిక మరణమునుగూర్చి వారికి తెలిపాడు. గురువు అతనిని ఓదార్చి కథోలిక వేదమును గూర్చి తెలియపరచారు. అతనిని తన తమ్ముని ఆత్మ విశ్రాంతి కొరకు ప్రార్థించమని సూచించారు. అతడు మారుమనస్సు పొంది కథోలిక వేదమును అంగీకరించి, స్వీకరించాడు. తన తమ్ముని ఆత్మ విశ్రాంతి కొరకు నిత్యము ప్రార్థింప తీర్మానించుకొన్నాడు. తన తమ్ముని ఆత్మ ఉత్తరించు స్థలములో ఉత్తరింపుపొంది మోక్షమునకు పోవునని దృఢముగా విశ్వసి విశ్వసించాడు. తన తమ్ముని కొరకు ప్రార్థించసాగాడు. ఆ విశ్వాసము వలన అతని విచారము తొలగిపోయి మానసికముగా కోలుకొన్నాడు. సంతోషముగా జీవించగలిగాడు. మంచి కథోలిక క్రీస్తువుడుగా జీవించాడు.
