దేవుడు మౌనంగా ఉన్నప్పుడు… మన ప్రార్థనలు ఎక్కడికి వెళ్తాయి?

ప్రసాద్ గార్లపాటి
03 Nov 2026
కొన్ని మౌనాలు మాటలకంటే బలమైనవి… కొన్ని నిరీక్షణలు జీవితానికే అర్థం నేర్పుతాయి!
మనిషి జీవితంలో అత్యంత భారమైన క్షణం ఏదో తెలుసా?
అది కన్నీళ్లు వచ్చినప్పుడు కాదు… ఆ కన్నీళ్లను తుడిచే చేయి కనిపించనప్పుడు! బాధలు చుట్టుముట్టినప్పుడు కాదు… వాటి నుంచి బయటపడే మార్గం ఏదీ కనిపించనప్పుడు! ప్రార్థిస్తున్న పెదవులకు సమాధానం వినిపించనప్పుడు...
అప్పుడే మనిషిలో ఒక అంతర్గత సంఘర్షణ మొదలవుతుంది.
'నేను ఇంతగా ప్రార్థిస్తున్నా… దేవుడు ఎందుకు స్పందించడం లేదు? నా కన్నీళ్లు ఆయనకు కనిపించడం లేదా? నా మొర ఆయన చెవులకు చేరడం లేదా?'
ఇది కేవలం ఒక ప్రశ్న కాదు… బాధలో ఉన్న ప్రతి విశ్వాసి హృదయంలో ఎప్పుడో ఒకసారి ప్రతిధ్వనించే ఆర్తనాదం!
కానీ ఒకసారి ఆలోచించండి…
దేవుని మౌనం నిజంగా ఆయన మన ప్రార్థనలను వినకపోవటానికి సంకేతమా? లేక మనకు అందని దైవ కార్యానికి నిశ్శబ్ద నేపథ్యమా?
గెత్సేమనే తోటలోనూ ఒక రాత్రి ఇలాంటి మౌనమే ఆవరించింది!
అక్కడ ఒక తోట ఉంది. ఆ తోటలో ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పెదవులపై ప్రార్థన, హృదయంలో వేదన, కళ్లలో ఆవేదన!
ఆయనే యేసుక్రీస్తు!
తన ముందున్న శ్రమల పాత్ర తొలగిపోవాలని తండ్రిని ప్రార్థించాడు. అయినప్పటికీ తన చిత్తం కంటే తండ్రి చిత్తమే నెరవేరాలని సమర్పించుకున్నాడు.
(మత్తయి 26:36–46)
ఆ రాత్రి ప్రార్థనకు సమాధానంగా సిలువ మార్గం ఎదురైంది. కానీ ఆ సిలువ ఓటమి కాదు. ఆ మరణం అంతిమం కాదు. సమాధి చివరి అధ్యాయం కాదు!
మూడవ రోజున పునరుత్థానం సంభవించింది!
ఇక్కడే ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది. మనం కోరుకున్న సమాధానం రావడమే దేవుని ప్రేమకు నిదర్శనం కాదు. మనం కోరుకున్నది జరగనప్పుడు కూడా ఆయనపై విశ్వాసంతో నిలబడగలగడమే నిజమైన విశ్వాస పరిపక్వత.
కొన్నిసార్లు మనకు కావలసింది ఒక అద్భుతం. కానీ దేవుడు మనకు నేర్పించేది నిరీక్షణ. మనకు కావలసింది వెంటనే మారిపోయే పరిస్థితి. కానీ మనలో మారవలసింది మన ఆలోచన కావచ్చు.
అందుకే దేవుని మౌనాన్ని ఆయన నిరాకరణగా భావించకూడదు. ప్రతి ఆలస్యాన్నీ నిర్లక్ష్యంగా అనుకోకూడదు. మనకు అర్థం కాని జీవిత సందర్భాల్లోనూ ప్రార్థనను విడిచిపెట్టకూడదు.
చివరగా ఒక్కసారి ఆలోచించండి…
ఒక విత్తనం భూమి గర్భంలో పాతిపెట్టబడినప్పుడు, బయట ప్రపంచానికి అది అంతమైపోయినట్లే కనిపిస్తుంది. కానీ ఆ చీకటి నేలలోనే కొత్త జీవం రూపుదిద్దుకుంటుంది. సమాధిలో ఉంచబడిన క్రీస్తు విషయంలోనూ మానవ కళ్లకు కనిపించింది అంతమే… కానీ దేవుని కార్యంలో అది పునరుత్థానానికి ముందు అధ్యాయం!
మరి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి చీకటి నిజంగా అంతమేనా? ప్రతి కన్నీరు ఓటమికి గుర్తేనా? ప్రతి నిరీక్షణ వ్యర్థమేనా?
బహుశా మనం దేవుని సమాధానం కోసం ఎదురుచూస్తున్న సమయంలో, దేవుడు మన విశ్వాసం ఎంత లోతుగా ఉందో మనకే తెలియజేస్తున్నాడేమో!
కాబట్టి ఈరోజు రేపు కూడా ప్రార్థించండి. సమాధానం వినిపించకపోయినా ప్రార్థించండి. మార్గం కనిపించకపోయినా విశ్వసించండి. ఎందుకంటే విశ్వాసం అంటే వెలుగు ఉన్నప్పుడు నడవడం మాత్రమే కాదు… చీకటిలోనూ వెలుగు వస్తుందనే నమ్మకంతో అడుగులు వేయడం!
దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించే రాత్రులే… మన విశ్వాసానికి అత్యంత లోతైన పరీక్షలు కావచ్చు. కానీ క్రీస్తు పునరుత్థానం మనకు గుర్తుచేసే సత్యం ఒక్కటే: సమాధి.... చివరి మాట కాదు… దేవునిదే చివరి మాట!
"నిరీక్షణగలవారై సంతోషించుడి; శ్రమలో ఓర్పుగలవారై యుండుడి; ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి." — రోమీయులకు 12:12
ఆమెన్!
