సమాధులు - వెలిగే క్రొవ్వొత్తులు

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్

02 Nov 2026

సకల ఆత్మల పండుగ నాడు చనిపోయిన వారి సమాధుల దగ్గర క్రొవ్వొత్తులను వెలిగిస్తారు. ఈ ఆచారం ఎప్పటి ప్రారంభమైందో ఇదిమిద్ధంగా తెలియదు. కానీ, మూలాలు మాత్రం క్రైస్తవేతర/అన్యదేవతా ఆచారాలలో కూడా వున్నాయనడం ఒక వాస్తవం. క్రీస్తుప్రభువు "వెలుగు" అనే విశ్వాసం ప్రభలంగా దైవ గ్రంధంలో చూపబడింది. మొదటి నుండి అగ్ని, వెలుగు కంటికి కనుపించని దైవ సన్నిధికి, సాక్షాత్కారానికి సాదృశ్యంగా చూపబడినాయి (అగ్ని - నిర్గమ 3:1-14, వెలుగు - యోహాను 8:12). పునరుత్థాన పండుగనాడు వెలిగించే తెల్లని క్రొవ్వొతి క్రీస్తుప్రభువుకు నిదర్శనం.మరణమనే చీకటిని జయించిన స్వయం ప్రకాశుడుగా క్రీస్తును అభివర్ణిస్తూ, వెలిగే క్రొవ్వొత్తిని తార్కాణంగా చూపుతున్నాము.క్రొత్త అగ్నితో వెలిగించే క్రొవ్వొత్తి మరణాన్ని జయించిన విజయున్ని సూచిస్తుంది.భూస్థాపిత క్రమంలో క్రైస్తవులు పాస్కావత్తిని వెలిగించి శవపేటిక దగ్గర ఉంచుతారు. సజీవంగా కదలాడే ఆ దీపశిఖ ఆ వ్యక్తి జ్ఞానస్నాన జ్ఞాపకాలను, వాగ్దానాలను గుర్తు చేస్తుంది. అతని/ఆమె నిత్య జీవన ప్రస్థానాన్ని సూచిస్తూ మరణించిన వ్యక్తి క్రీస్తులో ఐక్యమవడాన్ని సంకేత పూర్వకంగా ఈ వత్తి సూచిస్తుంది.సకల ఆత్మల పండుగనాడు సమాధుల దగ్గర వెలిగించే క్రొవ్వొత్తులు ఈ క్రింది భావాలకు నిదర్శనం:

1) క్రొవ్వొత్తులు ప్రార్ధనను ఇనుమడింపజేస్తాయి.అవి ప్రార్ధన కొనసాగింపు.... ప్రార్ధనలో ఒకభాగం.

2) చీకటిని వెలుగు దూరం చేసినట్లు, చీకటికి ప్రతిరూపమైన దుష్టశక్తిని వెలుగు రూపుమాపుతుంది.

3) తమను తాము హరించుకొని వెలిగే క్రొవ్వొత్తులు త్యాగానికి చిహ్నం. వెలిగే క్రొవ్వొత్తుల రూపంలో త్యాగంతో కూడిన క్రొవ్వొత్తులను కానుకగా వెలిగించి మన ఆత్మీయుల ఆత్మలకు శాంతిని చేకూరుస్తున్నాము.

చనిపోయిన వ్యక్తి దగ్గర వుంచిన క్రొవ్వొత్తి ఆ వ్యక్తి జ్ఞాపకాలు మన చుట్టూ ఆవరించి ఉన్నాయని గుర్తు చేస్తుంది. వారి స్మృతి చిహ్నాలు కదలాడే అగ్ని శిఖలా మనలో సజీవంగా మెదులుతున్నాయని సూచిస్తుంది. నిజానికి మనం చనిపోయిన వారి కోసం ప్రార్ధించడం లేదు. క్రీస్తులో నిత్య జీవం పొందుతున్న వారి కోసం ప్రార్దిస్తున్నాం. సజీవులను మృతులలో వెదకకూడదన్నారు దేవదూతలు (లూకా 24:5). ఇది క్రైస్తవ విశ్వాసం. సజీవంగా వెలిగే వత్తి మరణించిన వ్యక్తికున్న మరులోక జీవనాన్ని ప్రతిబింబిస్తుంది. క్రీస్తు అనే అఖండ జ్యోతిలోకి ఆత్మ . ఐక్యమవ్వడాన్ని ఈ దీపశిఖ ప్రతీకగా చూపిస్తుంది.

ప్రభువు ఎవరినీ పోగొట్టుకొనడు.ఆయన మాటలలో, “నా తండ్రి నాకు ఒసగు ప్రతివాడును నా యొద్దకు వచ్చును. వానిని నేను ఎన్నడును త్రోసి వేయను.... ఆయన నాకు ఒసగినది ఏదియు పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపినవాని చిత్తము. కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము” (యోహాను 6:37-40). చాలా ప్రాంతాలలో సకల ఆత్మల పండుగను ఒక వేడుకలా చేసుకుంటారు. సమాధులను పూలతోనూ క్రొవ్వొత్తులతోనూ అలంకరిస్తారు. ఈ వేడుకలు మన ఆత్మీయుల మీద మనకున్న ప్రేమనే కాదు అంతకంటే మిన్నగా వారి పరలోక ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్లుగా సూచిస్తాయి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN