మరణ భయాన్ని అధిగమించడం ఎలా?

గురుశ్రీ సిహెచ్ అరుణ్ కుమార్ SHS

01 Nov 2026

క్రీస్తు నందు ప్రియమైన సహోదరీ,సహోదరులారా ఈ వ్యాసంలో మరణ భయాన్ని ఎలా జయించాలి అనే అంశాన్ని గురించి ధ్యానిస్తున్నాము.

'మరణం' అనే 4 అక్షరాల పదం వినడానికి మనము ఎవరమూ ఇష్టపడము.‘మరణం’ అనే మాటను ఎప్పుడూ తప్పిస్తూ ఉంటాము.మరణం అనే పదాన్ని మనము చాలా దూరంగా ఉంచుతాం. ఎందుకంటే 'మరణం' అనే 4 అక్షరాలు మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది.అందుకే 'మరణం' అనే పదాన్ని వింటేనే మనస్సులో భయం,హృదయంలో అలజడి, ఆందోళన మరియు ఏదో తెలియని ఆవేదన మనల్ని ముంచెత్తుతుంది.

మరణ భయాన్ని అధిగమించడం ఎలా?
(1)
యేసుక్రీస్తులో విశ్వాసం వలన:-
మనందరికీ తెలుసు విశ్వాసం వలన విశ్వాసి తన జీవిత ప్రయాణాన్ని సాగించగలడు అని ఈ విశ్వాసమే ప్రతి మానవుని దేవుని దరి చేరుస్తుంది.దేవుని దరిచేరి వచ్చువారందరు దేవుడు ఉన్నాడని విశ్వసిస్తూ,ఆయన అన్ని విధాలుగా విశ్వాసుల విశ్వాసాన్ని బలపరుస్తుంటారని మనము విశ్వసించాలి. మనము చదువుతాము హైబ్రీ 11:1- 6 వచనాలు మనకు విశ్వాస పరమరహస్యాన్ని తెలియజేస్తాయి.ఇంకా పౌలుగారి లేఖ అయినటువంటి రోమీయులకు రాసిన లేఖలో విశ్వాసం దేవుని వాక్కు వినటం ద్వారా కలుగుతుంది. మరియు నీతిమంతుడు విశ్వాసం
ద్వారా జీవించును. రోమి: 1:7, 10:17.

ఈ విధముగా యేసుక్రీస్తులో విశ్వాసం కలిగిన ప్రతి బిడ్డ యేసు ప్రభువు మరణాన్ని జయించారని విశ్వసించడం ద్వారా మనము కూడా మరణ భయం నుండి భయటపడి ఈ మరణం అనే భయాన్ని ధైర్యంగా అధిగమించగలము.ఇంకా చెప్పాలి అంటే యేసుప్రభువు పునరుత్తానం ద్వారా మన జీవితాలలో 'కూడా' పునరుత్తానాన్ని "ధ్యేయంగా” ఎంచుకున్నప్పుడు మరణాన్ని లేదా మరణ భయాన్ని అవలీలగా ఎదిరించగలము.యేసుక్రీస్తులో పునరుత్తానంలో భాగస్తులు కావడమే మనందరి లక్ష్యం. ఆ 'పునరుత్తాన' లక్ష్యాన్ని సాధించాలంటే మరణించక తప్పుదు అని విశ్వసిస్తూ ముందుకు సాగిపోదాం.

పాపము నుండి విముక్తిని పొందటం వలన మరణాన్ని మానవుడు కొనితెచ్చుకున్నాడని ఆదికాండములో ఆది తల్లిదండ్రుల ద్వారా మనకు చక్కగా విధితమవుతుంది. అనగా దేవునికి విరుద్ధంగా, వ్యతిరేకంగా మరియు అశ్రద్ధ కలిగి జీవిస్తే అది మరణానికి దారి తీస్తుందని మనము తెలుసుకోవాలి.ఆది తల్లిదండ్రులు పాపము చేయడం ద్వారా దేవుని దీవెనలు కోల్పోయారు.వారిపాప ఫలితమే ఈ మరణము. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ మరణాన్ని మనము ఆధ్యాత్మిక మరణముగా కూడా చెప్పవచ్చు. దేవునికి విరోధముగా జీవించడము పాపము అయితే ఆ పాపపుఫలితమే మరణము అని మనకు పవిత్రగ్రంధం నేర్పుతుంది.

కనుక మనము ఈ మరణ భయాన్ని జయించాలంటే మన పాపముల నుండి విముక్తిని పొంది దేవుని దరిచేరాలి.అప్పుడే మనకు మరణ భయం నుండి బయటపడగలము.యేసు ప్రభువు చెప్పినట్లుగా జీవము ఉండగా ఆయనను విశ్వసించి, పాప విముక్తిని పొందువారు ఎన్నడును మరణింపరు కానీ నిత్యముగా జీవిస్తారు అని యోహాను 11:25 పలికారు కనుక మన పాపములను తెలుసుకొని, పశ్చాత్తాపడి నూతన జీవితాన్ని పొందటం ద్వారా మనకు 'మరణం' అనే భయం తొలగి క్రీస్తులో సజీవులుగా జీవించగలము.పాప విముక్తికై ప్రయత్నించి నిత్య జీవితానికి ద్వారమును సుగమము చేసుకుందాం.

3)పవిత్ర జీవితం జీవించడం వలన:-
పవిత్ర జీవితం మనకు మరియు ముఖ్యముగా మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతగానో సహకరించి మనము దేవుని ముఖాముఖిగా దర్శించుటకు సహాయపడుతుంది. ఎప్పుడయితే మనము పవిత్రంగా జీవిస్తున్నపుడు ఈ లోకంలో ఎదురయ్యే ఎలాంటి భయాలకు మరీ ప్రత్యేకముగా ‘మరణం’ అనే భయానికి లొంగవలసిన అవసరం ఉండదు. పవిత్రమయిన జీవితం మనల్ని దేవుని సన్నిధికి చేర్చి శాశ్వత జీవాన్ని అందిస్తుంది. కనుక మనము ఈ లోకములో ఉన్నపుడే పవిత్రముగా జీవిస్తున్నట్లయితే 'మరణం' అనే భయానికి ఆందోళన పడవలసిన అవసరం లేదు. పవిత్రముగా జీవించేవారు 'మరణం' అనే ఈ పదానికి భయపడరు కూడా. ఎందుకంటే పవిత్రంగా జీవించేవారి లక్ష్యం దేవున్ని ముఖాముఖి దర్శించడమే. ఆ ముఖాముఖి దర్శించే భాగ్యాన్ని ఈ లోకంలో ఉన్నపుడే మార్గాన్ని సుగమము చేసుకోవడం వలన 'మరణానికి' భయపడకుండా నేను దేవునితో కలకాలము, జీవితాంతము ఉండబోతున్నామని సంతోషంగా ఉంటూ, మరణానికి భయపడకుండా జీవిస్తారు. ఇదే విషయాన్ని హేబ్రి: 12:14లో పవిత్రత లేకుండా ఎవరు దేవుని దర్శించలేరు అనే విషయం బైబిల్ గ్రంధంలో చాలా చక్కగా లిఖించబడింది. కనుక పవిత్రత అన్ని భయాలకు పరిష్కార మార్గం.

ముగింపు:-
కనుక ప్రియులారా! 'మరణం' అనే నాలుగు అక్షరాలకు భయపడకుండా, ఆందోళన చెందకుండా, కృంగిపోకుండా, బలహీనపడకుండా మరియు వేదన చెందకుండా మరణాన్ని ధైర్యముతో అంగీకరించుటకు, మరణభయాన్ని అధిగమించుటకు, కావలసిన విశ్వాసం, పాపం నుండి విముక్తి మరియు పవిత్రత అనే ఈ మూడు సాధనాలను మన జీవిత సోపానాలుగా మలచుకొని జీవించుదాం.తద్వారా ‘మరణ' భయం లేకుండా సంతోషంగా జీవించగలమే కాకుండా మరణాన్ని కూడా మనము ఆనందముగా స్వీకరించగలము.

దేవుడు మనందరినీ దీవించును గాక ! ఆమెన్..

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN