ఉత్తరించు స్థలం అంటే ఏమిటి?

ఫాదర్ పూదోట జోజయ్య. Sj

01 Nov 2026

...........................................................................
కతోలిక శ్రీసభ ఉత్తరించే స్థలంలోని ఆత్మల కొరకు ప్రార్థన చేయమని ఏటేటా తన బిడ్డలను హెచ్చరిస్తుంది. ఇప్పుడు మనం ఇతరుల కొరకు జపిస్తే. రేపు మన వంతు వచ్చినప్పుడు ఇతరులు మన కొరకు జపిస్తారు.

ఉత్తరించే స్థలం అంటే దాటిపోయే స్థలం అని అర్థం. ఆ స్థలాన్ని దాటిపోయి మోక్షాన్ని చేరుకుంటామని భావం. ఉత్తరించే స్థలం ప్రధానంగా మన పాప మాలిన్యాన్ని తొలగించి శుద్ధి చేస్తుంది. కనుక దాన్ని శుద్ధికరణ స్థలమని గాని లేక ప్రాయశ్చిత్త స్థలమని గాని అనటం ఉచితం.

మామూలుగా ఉత్తరించే స్థలం అంటాం గానీ యదార్ధంగా అవి స్థలం కాదు. ఒక దశ లేక స్థితి. బాల్యం, యవ్వనం అనేవి స్థలాలు కాదు, దశలు. ఉత్తరించే స్థలం కూడా ఇలాంటిదే. మనం అర్థం చేసుకోవడం కొరకు దాన్ని స్థలం అన్నారు. అంటే ప్రాచీనులు అక్కడ మృతులు దీర్ఘకాలం ఉంటారు అనుకున్నారు. కానీ ఇప్పటి వేద పండితులు అక్కడకు పోయిన వాళ్ళు కొద్ది కాలం మాత్రమే ఉంటారు అని చెప్తున్నారు. ప్రధానంగా మన పాప మాలిన్యాన్ని తొలగించి మోక్షానికి సిద్ధం చేసేది. అక్కడి వాళ్ళ బాధ అగ్నిలో కాలడం కాదు. అసలు పరలోకంలో మన భౌతిక వస్తువులు ఏవి ఉండవు. అక్కడ వాళ్ళ బాధ ప్రధానంగా దేవుని దర్శించ లేకపోవడం. అపవిత్రమైన ప్రాణి ఏది దేవున్ని చూడలేదు.

బైబిల్ ఉత్తరించే స్థలాన్ని గూర్చి ఏమీ చెప్పదు. బైబిల్ లో దాని గురించి ఒక్క పరోక్షమైన అవలోకన మాత్రమే ఉంది. పూర్వం యూద మక్కబీయుడు యుద్ధంలో దుర్మరణం చెందిన సైనికుల కొరకు సొమ్ము పంపించి ఎరుషలేములో పాప పరిహార బలిని సమర్పించేలా ఏర్పాటు చేశాడు. (2 మక్కా 13, 38 43) అతని ఉద్దేశం ప్రకారం మృతుల కొరకు బలులు, ప్రార్థనలు అర్పించవచ్చు.రెండో శతాబ్దం నుండి మృతుల కొరకు ప్రార్థనలు, పూజలు సమర్పించడం అలవాటులోకి వచ్చింది. బైబిల్ లో కనిపించని కొన్ని ఆచారాలు, విధానాలు తొలినాటి క్రైస్తవ సమాజం ఆచరణలోకి వచ్చాయి. దేవుని ఆత్మ ఈ సాంప్రదాయాలను ప్రేరేపించింది. ఇలాంటి సాంప్రదాయాలు, బోధలను కలిపి వారంపర్య బోధ అంటున్నాం. ఉత్తరించే స్థలం అనే అంశం బైబిల్ లో లేదు కనుక ప్రోటెస్టెంట్ క్రైస్తవులు దీన్ని అంగీకరించరు.

విశ్వాస సంగ్రహంలో పునీతుల సంబంధ ప్రయోజనాన్ని విశ్వసిస్తున్నాను అని చెప్తాం కదా అనగా మోక్షవాసులను ఉత్తరించే స్థలం వాసులను, భూలోకంలోని క్రైస్తవులకు పరస్పర సంబంధం ఉంటుందని భావం. వాళ్ళు ఒకరికొకరు, ఒకరు ప్రార్ధనలు, బలులు ఉపవాసాలు సమర్పించవచ్చు. ఒకరికొకరు ఉపకారం చేసుకోవచ్చు.

దైవార్చన నియమం ప్రకారం మనం ఏటేటా నవంబర్ రెండున ఉత్తరించే స్థలంలోని ఆత్మల కొరకు ప్రార్థనలు, ఉపవాసాలు, పరిపూర్ణ ఫలాలు సమర్పిస్తున్నాం. ఆ ఆత్మలు తమకు తాము సహాయం చేసుకోలేవు. పుణ్యాలు గానీ పాపాలు గాని ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే చేయగలం. అందుకే అక్కడి ఆత్మలు మన సహాయం కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళ తరఫున వాళ్లు మోక్షానికి పోయిన తర్వాత మన కొరకు ప్రార్థన చేస్తారు . ఆత్మల కొరకు మనం విశేషంగా పూజ బలులు సమర్పించాలి. భక్తి గలవాళ్లు కుటుంబ సభ్యులకు పూజాబలులు తప్పక పెట్టిస్తారు. ఈ లోకంలోని మనలను గాని, ఉత్తరించే స్థలంలోని ఆత్మలను గాని రక్షించి మోక్షానికి చేర్చేది క్రీస్తు.

మన సొంత బంధువులు, స్నేహితులు ఉత్తరించే స్థలంలో ఉండవచ్చు. వాళ్ళు ఇతర ఆత్మలు కూడా మన సహాయాన్ని ఆశిస్తారు, ఎదురుచూస్తారు. కనుక వారి కొరకు ప్రార్థనలు, పుణ్యక్రియలు అర్పించడం మన బాధ్యత.

ఒకరోజు మనం కూడా ఉత్తరించే స్థలాన్ని చేరి శ్రమలు అనుభవిస్తాం. అయితే ఆ శ్రమలను ఈ లోకంలో ఉండగానే కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇక్కడే మన ప్రార్థనలు, పూజలు శ్రమలు ,దానధర్మాలు రాబోయే ఉతరించు స్థలంలోని శ్రమలను తగ్గించుకోవడం కొరకు సమర్పించుకోవచ్చు. అలా చేయకపోతే రేపు అక్కడ పూర్తి శ్రమలను అనుభవిస్తాం .ఇప్పుడు మనం అక్కడి ఆత్మలను పట్టించుకోకపోతే రేపు అక్కడికి పోయాక మనలను ఎవరూ పట్టించుకోరు. ఒక్క నవంబర్ రెండవ దినాన మాత్రమే గాక సంవత్సరం పొడుగునా కూడా మృతుల ఆత్మల కొరకు జపించటం సమంజసం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN