సకల ఆత్మల సంస్మరణ - నవంబర్ 2

ప్రసాద్ గార్లపాటి

01 Nov 2026

సమాధుల నిశ్శబ్దంలో... పునరుత్థాన నిరీక్షణ!...

ప్రధాన భావం: మరణం ముగింపు కాదు – నిత్యజీవానికి నాంది.

కాలం తన ప్రయాణంలో ఎన్నో జీవితాలను తనలో కలుపుకుంటుంది. నిన్నటి వరకు మనతో కలిసి నడిచిన అడుగులు నేడు మట్టిలో విశ్రమిస్తున్నాయి. మన ఇంటి గడపను నవ్వులతో నింపిన ముఖాలు నేడు చిత్రపటాలుగా మిగిలిపోయాయి. మన కష్టాలలో భుజం తట్టిన చేతులు, మన కన్నీళ్లను తుడిచిన వేళ్లు, మన జీవితానికి వెలుగునిచ్చిన వ్యక్తులు నేడు మన కళ్లకు కనిపించకపోవచ్చు. కానీ వారి జ్ఞాపకాలు మన హృదయాల గర్భంలో సజీవంగానే నిలిచిపోయాయి.

ఒకప్పుడు వారి మాటలతో సందడిగా ఉన్న ఇల్లు నేడు నిశ్శబ్దాన్ని ధరించి ఉండవచ్చు. వారి అడుగుల కోసం గడప ఎదురుచూస్తూ ఉండవచ్చు. వారి జ్ఞాపకం కన్నీటిని తెప్పించవచ్చు. కాలం గాయాన్ని కొంత మాన్పించినా, ప్రేమ మాత్రం వారి ఉనికిని మరచిపోనివ్వదు.

క్రైస్తవ విశ్వాసం మనల్ని కేవలం గతపు జ్ఞాపకాల దగ్గర నిలిపివేయదు. కన్నీళ్ల మధ్య కూడా నిరీక్షణను చూడమని ఆహ్వానిస్తుంది. ఎందుకంటే సమాధి మనిషి చూపుకు చివరి గమ్యంగా కనిపించినా, దేవుని వాగ్దానానికి అది అంతిమ సరిహద్దు కాదు.

నేటి మొదటి పఠనంలో యోబు తన తీవ్రమైన వేదన మధ్య ఒక అద్భుతమైన విశ్వాస ప్రకటన చేస్తున్నాడు: *"నా విమోచకుడు సజీవుడైయున్నాడని నాకు తెలియును"* (యోబు 19:25).

అన్నీ కోల్పోయినప్పటికీ తన నిరీక్షణను కోల్పోని యోబు విశ్వాసం మనకు ఆదర్శం. శరీరం క్షీణించినా విశ్వాసం క్షీణించలేదు. జీవితం చీకటిలో చిక్కుకున్నా నిరీక్షణ దీపం ఆరిపోలేదు.

ఈ రోజు మనం కూడా అదే విశ్వాసంతో మన మరణించిన ప్రియమైనవారి ఆత్మలను దేవుని కరుణకు అప్పగించడానికి సమావేశమయ్యాము.

మరణాన్ని దాటే క్రీస్తు జీవం

మరణం అనేది మానవ జీవితంలో తప్పించుకోలేని వాస్తవం. కానీ క్రైస్తవునికి మరణం అంతిమ ఓటమి కాదు. నేటి రెండవ పఠనంలో పౌలు రోమీయులకు 6:3–9 ద్వారా క్రీస్తుతో మరణించినవారు ఆయనతో కూడ జీవిస్తారని బోధిస్తున్నాడు.

*"ఆయనతో కూడ మరణించినవారమైతే ఆయనతో కూడ జీవించుదుమని నమ్ముచున్నాము"* (రోమీయులకు 6:8).

బాప్తిస్మం ద్వారా మనం క్రీస్తు మరణంలోనూ, పునరుత్థానంలోనూ భాగస్వాములమవుతాము. అందుకే మరణం గురించి మన దృక్పథం ప్రపంచ దృక్పథానికి భిన్నంగా ఉంటుంది. ప్రపంచం మరణాన్ని ముగింపుగా చూస్తుంది; క్రైస్తవ విశ్వాసం క్రీస్తులో నూతన జీవితపు నిరీక్షణను చూస్తుంది.

కతోలిక విశ్వాసం ప్రకారం, దేవుని కృపలో మరణించినప్పటికీ సంపూర్ణ పవిత్రతను ఇంకా పొందని ఆత్మలు ప్రక్షాళన స్థితిలో ఉండవచ్చు. అందుకే వారి కోసం మనం ప్రార్థిస్తాము. దివ్యబలులను అర్పిస్తాము. మన ప్రార్థనలు, త్యాగాల ద్వారా వారికి ఆధ్యాత్మిక సహాయం అందించాలని కోరుకుంటాము. మరణించినవారి కోసం ప్రార్థించడం అనేది క్రీస్తులో మనందరినీ కలిపే పరిశుద్ధుల సహవాసానికి ఒక సాక్ష్యం.

కన్నీళ్లను అర్థం చేసుకునే దేవుడు

యోహాను సువార్త 11:17–27లో లాజరు మరణించిన సందర్భాన్ని మనం చూస్తాము. సోదరుడిని కోల్పోయిన మార్త, మరియల దుఃఖాన్ని యేసుప్రభువు అర్థం చేసుకున్నాడు. వారి కన్నీళ్లను నిర్లక్ష్యం చేయలేదు. వారి బాధలో వారితో పాటు నిలిచాడు.

అయితే ఆయన కేవలం ఓదార్పు మాటలతో ఆగిపోలేదు. మరణాన్ని జయించే తన దైవిక అధికారాన్ని ప్రకటిస్తూ ఇలా అన్నాడు:

*"పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు మరణించినను జీవించును"*(యోహాను 11:25).

ఇది ఈ రోజు మనందరికీ గొప్ప నిరీక్షణ. మన కన్నీళ్లను తుడిచే దేవుడు మనకు నిత్యజీవాన్ని కూడా వాగ్దానం చేస్తున్నాడు. మన ప్రియమైనవారు మన కళ్లకు కనిపించకపోయినా, వారిని దేవుని అనంతమైన కరుణకు అప్పగిద్దాం.

జ్ఞాన గ్రంథము 4:7–15 నీతిమంతుని జీవితపు విలువను మనకు గుర్తుచేస్తుంది. జీవితపు గొప్పతనం దాని సంవత్సరాల సంఖ్యలో కాదు; దాని పవిత్రతలో ఉంది. 1 యోహాను 3:1–2 మనం దేవుని బిడ్డలమనే గొప్ప సత్యాన్ని ప్రకటిస్తుంది. దేవుని ప్రేమలో మనకు నిత్యజీవపు నిరీక్షణ ఉంది.

కన్నీళ్లకు అవతల ఒక పునరుత్థాన ఉదయం

ప్రియమైన సహోదరీ సహోదరులారా!

ఈ రోజు మనం స్మరించుకుంటున్నవారు మన జీవితాల్లో ప్రేమను పంచినవారు. వారి మంచితనం మనకు ఆదర్శం. వారి జ్ఞాపకాలు మనకు ఆత్మీయ సంపద. వారి వియోగం మనకు జీవితపు అశాశ్వతత్వాన్ని గుర్తుచేస్తుంది.

అందుకే ఈ రోజు మనం మూడు విషయాలను హృదయంలో నిలుపుకోవాలి. మరణించినవారి కోసం ప్రార్థించాలి; జీవించి ఉన్నవారిని ప్రేమించాలి; నిత్యజీవానికి సిద్ధపడేలా పవిత్రమైన జీవితాన్ని జీవించాలి.

ఎందుకంటే ఒకరోజు మనమూ ఈ భూలోక ప్రయాణాన్ని ముగించవలసిందే. అప్పుడు మనం కూడబెట్టిన సంపద కాదు, పంచిన ప్రేమ; సంపాదించిన కీర్తి కాదు, చేసిన సేవ; పొందిన అధికారం కాదు, చూపిన కరుణ మన జీవితానికి నిజమైన సాక్ష్యాలుగా నిలుస్తాయి.

*సమాధులపై పూలు వాడిపోవచ్చు... కానీ పునరుత్థానంపై మన నిరీక్షణ వాడిపోకూడదు!*

*కొవ్వొత్తుల జ్యోతులు ఆరిపోవచ్చు... కానీ క్రీస్తు వెలుగు మన హృదయాల్లో ఆరిపోకూడదు!*

*మనుషుల అడుగులు భూమిపై ఆగిపోవచ్చు... కానీ దేవుని ప్రేమలో మన నిరీక్షణ అంతం కాకూడదు!*

మరణం మనల్ని విడదీసినట్లు కనిపించినా, క్రీస్తు ఇచ్చిన నిత్యజీవపు వాగ్దానం మనకు పునరుత్థానంపై ఆశను కలిగిస్తుంది. అందుకే యోబుతో కలిసి మనమూ విశ్వాసంతో ప్రకటిద్దాం:

*"నా విమోచకుడు సజీవుడైయున్నాడు!"*

ఆ సజీవుడైన విమోచకుడు మన మరణించిన సహోదర సహోదరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించుగాక! దుఃఖిస్తున్న కుటుంబాలకు ఓదార్పునిచ్చుగాక! జీవించి ఉన్న మనందరినీ పవిత్ర జీవితంలో నడిపించి, ఒకనాడు తన నిత్యరాజ్యంలో చేర్చుకొనుగాక!

*ప్రభువా!వారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించు*
*నిత్యకాంతి వారిపై ప్రకాశింపజేయుము!*
*వారు శాంతితో విశ్రమింపజేయుము . ఆమేన్!**

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN