తగ్గింపు జీవితమే గొప్ప జీవితం

జోసెఫ్ అవినాష్
30 Oct 2026
సామాన్య 30వ శనివారం
సువిశేష ధ్యానం -:
లూకా 14:1,7-11
మనిషికి గర్వం ఎప్పుడు చెడ్డ పేరే తెస్తుంది. 'నేనే గొప్ప' అనుకునేవారు.''నాకన్నీ తెలుసు' అని భావించేవారు, ఎదుటి వారిని లెక్కచేయరు. తమ్ము తాము తగ్గించుకునేవారు వినయాత్ములు.గర్వాంధులు దైవ రాజ్యానికి దూరంగా ఉంటారు.మన అనుదిన జీవిత అనుభవంలో,ఎంతో మందిని వారి ప్రవర్తనను బట్టి వారి మనస్తత్వాన్ని పసిగట్టగలం. చాలాసార్లు మన ప్రవర్తనను చూసి కన్న తల్లిదండ్రులను, విద్యను బోధించిన ఉపాధ్యాయులను,కుటుంబ నేపథ్యాన్ని ప్రశ్నిస్తారు.మన వలన, ఎంతో మంది బాధపడవలసిన పరిస్థితి వస్తుంది.యేసుక్రీస్తు ప్రభువు, అధికార దాహంతో, ప్రధాన ఆసనాలను కోరుకునే వారిని ఉద్దేశించి, చక్కని పాఠం బోధించారు.ఎవరైనా మనల్ని విందుకు ఆహ్వానించినప్పుడు, మనకు మనమే గొప్పవాళ్ళంగా భావించకూడదు.మనకంటే గొప్పవాళ్ళు ఎంతోమంది ఉంటారు. మనల్ని ఆహ్వానించిన వారు,మనకు ఇచ్చే గౌరవమే.అందరిలో ప్రశంసనీయంగా ఉంటుంది. మనకు మనమే కోరుకునే గౌరవం,మనకు నిరాశనే మిగులుస్తుంది.యేసుప్రభు నేర్పిన పాఠం, మన మదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. యేసుప్రభు బోధించిన తగ్గింపు గుణం,అందరూ ఆచరించడం ఆరంభించాలి. లోక రక్షకుడైన యేసువే తన్ను తాను తగ్గించుకున్నాడు. తన పుట్టుక మొదలుకొని మరణం వరకు తగ్గింపు స్వభావమే ఆచరించాడు.యేసు జీవితమే మనకు గొప్ప పాఠం.పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టిన యేసయ్య,మన హృదయాలను తన సింహాసనంగా మార్చుకున్నాడు.యేసుక్రీస్తు బోధనలను మన హృదయంలో ధ్యానిస్తూ,మన ప్రవర్తనలో యేసుక్రీస్తు హెచ్చింపబడాలని కోరుకుందాం.తగ్గింపు జీవితం అవమానం కాదు,ఆశీర్వాదం. నిగర్విగా జీవించడమే దేవుని దృష్టిలో గొప్ప లక్షణం.
