ఆధ్యాత్మిక వికాసమే విశ్రాంతి దిన పరమార్థంగా ఆచరించుదాం

జోసెఫ్ అవినాష్

29 Oct 2026

సామాన్య 30వ శుక్రవారం
సువిశేష ధ్యానం -:
లూకా 14:1-6
ధ్యానం:
"ఆధ్యాత్మిక వికాసమే నిబంధనల పరమార్థం”

క్రమశిక్షణతో కూడిన జీవితానికై ఈ సమాజంలో అనేక నియమ నిబంధనలు ఉన్నాయి.వాటిని పాటించడం ద్వారా నిబద్ధతతో కూడిన జీవిత విధానాన్ని అలవర్చుకుంటాం.స్వార్థపూరిత జీవిత విధానం అలవాటు చేసుకున్నవారు చట్టాలను చుట్టాలుగా భావిస్తారు.వారి స్వప్రయోజనాలకు,తోటి వారిని బలి చేస్తారు.యేసుక్రీస్తు ప్రభువు అలాంటి వారిని ఖండించారు.మనం ఆచరించే సాంప్రదాయాలు, నియమనిబంధనలు, ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడాలి.విశ్రాంతి దినం దైవ ప్రజలలో,ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందిస్తుంది. కేవలం శరీర సుఖానికై విశ్రాంతి దిన నియమింపబడలేదు. దేవుడు చేసిన మేలులను స్మరించుకొని,తోటి వారికి మేలు చేసే అలవాటు పెంపొందించుకోవాలి.క్రీస్తు ప్రభువు విశ్రాంతి దినాన్ని గూర్చి ప్రస్తావిస్తూ నిజమైన విశ్రాంతి దినం ఆధ్యాత్మిక వికాసానికే గాని, తోటి వారికి హాని చేయడానికి కాదని బోధించారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడానికి కుంటి సాకులు వెదికే వారిని ప్రభువు ప్రశ్నించాడు. మనలో భక్తిని పెంపొందించడానికి పూర్వ సంప్రదాయాలు అవసరమే.సంప్రదాయాల పేరు చెప్పి ఆపదలో ఉన్న వారిని ఆదుకోకపోవడం,మత మూఢత్వమే అవుతుంది. యేసుక్రీస్తు నిజమైన విశ్రాంతి దిన ఆచార విధానాన్ని బోధించారు.జలోదర రోగ పీడితుడు యేసు చెంతకు వచ్చాడు. విశ్రాంతి దినమున అతన్ని స్వస్థపరచి మేలు చేయడమే ధర్మమని ప్రకటించాడు. ప్రియులారా, మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు, ఎవరైనా సహాయం చేస్తారా అని ఎదురు చూస్తాం.అలాగే మన తోటి వారు అవసరంలో ఉన్నప్పుడు ఆదుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి. నామమాత్రంగా నియమాలను పాటిస్తే, ఎలాంటి వికాసం ఉండదు. దేవుడిచ్చిన నియమ నిబంధనలు, మన ఆధ్యాత్మిక శ్రేయస్సుకై ఉపయోగించలే కానీ,మంచిని పెంపొందించడానికి అడ్డుగోడలు నిర్మించుకోకూడదు.మన ఆధ్యాత్మిక జీవితంలో,ఆపదలో ఆదుకోలేని నియమ నిబంధనలు ఆత్మలేని మృత శరీరంలా ఉంటాయి.మనిషికి విలువనివ్వని నియమాలు వ్యర్థమే. దైవ మానవ ప్రేమను పెంపొందించుకోవడమే ఆధ్యాత్మిక జీవితం.ఆధ్యాత్మిక వికాసమే విశ్రాంతి దిన పరమార్థంగా ఆచరించుదాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN