మత్స్యగర్భంలో మూడు రాత్రులు! మరణాన్ని దాటి తిరిగివచ్చిన మనిషి రహస్యం!

ప్రసాద్ గార్లపాటి
28 Oct 2026
బైబిలు ఆధారం:
యోనా 1:1–2:10;
మత్తయి 12:39–40
చుట్టూ అంతులేని సముద్రం… ఆకాశాన్ని తాకే కెరటాలు… ఉరుములను తలపించే అలల గర్జనలు… ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడుతున్న నావికులు! ఆ భయంకరమైన సముద్రంలో ఒక మనిషి పడవేయబడ్డాడు. క్షణాల్లోనే అతడు అలల మధ్య కనుమరుగయ్యాడు. ఇక అతడు తిరిగి వస్తాడని ఎవరూ ఊహించలేరు. సముద్రపు అగాధంలో అతని పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియదు.
కానీ ఇక్కడే ఒక అసాధారణమైన సంఘటన ప్రారంభమయింది !
ఒక పెద్ద చేప అతన్ని మింగివేసింది! సముద్రపు లోతుల్లో, వెలుతురు చొరబడని చీకటిలో, మూడు పగళ్లు మూడు రాత్రులు అతడు ఉన్నాడు. బయట ప్రపంచానికి అతని ఆచూకీ తెలియదు. అతడు జీవించి ఉన్నాడో, మరణించాడో ఎవరూ చెప్పలేని పరిస్తితి .
అసలు ఒక మనిషి మత్స్యగర్భంలో మూడు రోజులు ఎలా ఉన్నాడు? ఆ చీకటిలో అతడు ఏమి చేశాడు? దేవుడు అతన్ని ఎందుకు అటువంటి పరిస్థితిలోకి నెట్టాడు? మరణం తప్పదనిపించిన ఆ ప్రయాణం వెనుక దాగివున్న దైవసందేశం ఏమిటి?
ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే బైబిలులోని అద్భుతమైన యోనా గ్రంథంలో చూడాలి.
దేవుడు ఒక ప్రవక్తను పిలిచాడు. నీనెవె అనే గొప్ప నగరానికి వెళ్లి, అక్కడి ప్రజల దుష్టత్వాన్ని గురించి హెచ్చరించమని ఆజ్ఞాపించాడు. అయితే ఆ ప్రవక్త దేవుని ఆజ్ఞకు విధేయత చూపకుండా మరో దిశగా ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు.
అతని పేరే యోనా!
దేవుని ఆజ్ఞ నుంచి పారిపోవాలని భావించిన యోనా, తర్షీషుకు వెళ్లే ఓడను ఎక్కాడు. కానీ సముద్రంలో భయంకరమైన తుఫాను చెలరేగింది. అలలు ఓడను బలంగా తాకాయి. ఓడ మునిగిపోతుందేమోనని నావికులు భయపడ్డారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించారు.
చివరకు యోనా తాను దేవుని ఆజ్ఞ నుంచి పారిపోతున్నానని వారి ముందు అంగీకరించాడు. తనను సముద్రంలో పడవేస్తే తుఫాను శాంతిస్తుందని చెప్పాడు. నావికులు అతన్ని సముద్రంలో పడవేశారు. వెంటనే సముద్రం శాంతించింది.
అయితే యోనా కథ అక్కడితో ముగియలేదు.
దేవుడు ఒక పెద్ద చేపను సిద్ధం చేశాడు. ఆ చేప యోనాను మింగివేసింది. యోనా మూడు పగళ్లు, మూడు రాత్రులు చేప కడుపులో ఉన్నాడు (యోనా 1:17).
ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించండి! వెలుతురు లేదు. బయటకు వెళ్లే మార్గం కనిపించదు. తన శక్తితో బయటపడే అవకాశం లేదు. మానవ సహాయం అందని ఆ అగాధంలో యోనాకు మిగిలింది ఒక్కటే దేవుని వైపు తిరిగి ప్రార్థించడం!
మత్స్యగర్భపు చీకటిలో వినిపించిన ప్రార్థన!
యోనా గ్రంథంలోని రెండవ అధ్యాయం అతని ప్రార్థనను మనకు పరిచయం చేస్తుంది. తన బాధలో యోనా దేవుణ్ణి మొరపెట్టుకున్నాడు. సముద్రపు లోతుల్లో, మరణం తనను చుట్టుముట్టినట్లు అనిపించిన ఆ సమయంలో, దేవుడు తన ప్రార్థనను ఆలకించాడని అతడు ప్రకటించాడు.
యోనా పారిపోయాడు; అయినా దేవుడు అతన్ని పూర్తిగా విడిచిపెట్టలేదు. అతని అవిధేయతకు పరిణామాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ, అతడు దేవుని వైపు తిరిగినప్పుడు ప్రార్థనకు అవకాశం లభించింది.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. బైబిలు యోనా చేప కడుపులో ఉన్నప్పుడు జరిగిన ప్రతి శారీరక వివరాన్ని చెప్పదు. అతడు ఎలా శ్వాసించాడు, ఆహారం ఎలా తీసుకున్నాడు అనే ప్రశ్నలకు గ్రంథం సమగ్ర వివరణ ఇవ్వదు. కాబట్టి ఆధారాలు లేని ఊహాగానాల కంటే, బైబిలు వెల్లడించిన ఆధ్యాత్మిక సందేశంపై దృష్టి పెట్టడం సముచితం.
యోనా చేప కడుపులో గడిపిన ఆ మూడు పగళ్లు, మూడు రాత్రులు అతని జీవితంలో కీలకమైన సమయంగా నిలిచాయి. తన శక్తి, తన ప్రణాళికలు తనను రక్షించలేని స్థితిలో అతడు దేవునిపై ఆధారపడటం నేర్చుకున్నాడు.
అప్పుడు దేవుడు చేపతో ఆజ్ఞాపించాడు. చేప యోనాను పొడి నేలపై కక్కివేసింది (యోనా 2:10).
అగాధంలో ముగిసిపోయినట్లుగా కనిపించిన అతని ప్రయాణం, దేవుని కృపతో కొత్త ఆరంభాన్ని పొందింది. దేవుడు మళ్లీ అతన్ని నీనెవెకు వెళ్లమని పిలిచాడు. ఈసారి యోనా ఆ ఆజ్ఞకు విధేయత చూపించాడు. అతని ప్రకటనను విని నీనెవె ప్రజలు పశ్చాత్తాపపడ్డారు.
అందువల్ల ఈ కథ కేవలం ఒక పెద్ద చేప గురించి కాదు. అవిధేయత, పశ్చాత్తాపం, ప్రార్థన, దైవకరుణ, రెండవ అవకాశం గురించి కూడా చెబుతుంది.
ఈ సంఘటనకు క్రైస్తవ విశ్వాసంలో మరింత లోతైన ప్రాధాన్యం ఉంది. యేసుక్రీస్తు తన మరణం, సమాధి, పునరుత్థానాన్ని వివరించేటప్పుడు యోనా సూచనను ప్రస్తావించాడు.
“యోనా మూడు పగళ్లు మూడు రాత్రులు పెద్ద చేప కడుపులో ఉన్నట్లే, మనుష్యకుమారుడు మూడు పగళ్లు మూడు రాత్రులు భూమి గర్భంలో ఉండును” అని యేసు తెలిపాడు (మత్తయి 12:40).
ఇక్కడ యోనా సంఘటన యేసుక్రీస్తు మరణం, సమాధి, పునరుత్థానానికి ఒక సూచనగా నిలుస్తుంది. యోనా చేప కడుపు నుంచి బయటకు రావడం, యేసు మరణాన్ని జయించి పునరుత్థానుడవడం ఒకే సంఘటన అని కాదు; యేసు స్వయంగా యోనా అనుభవాన్ని తన మరణం, పునరుత్థానానికి సంబంధించిన సూచనగా ఉపయోగించాడు.
క్రైస్తవ విశ్వాసానికి పునాది యేసుక్రీస్తు పునరుత్థానం. అందుకే యోనా కథ మనకు గతంలో జరిగిన అద్భుతాన్ని గుర్తుచేయడమే కాదు, క్రీస్తులో లభించే జీవ నిరీక్షణను కూడా ప్రకటిస్తుంది.
ప్రియమైన సహోదరీ సహోదరులారా!
యోనా దేవుని పిలుపు నుంచి పారిపోయాడు. తుఫానును ఎదుర్కొన్నాడు. సముద్రపు అగాధంలో పడిపోయాడు. మత్స్యగర్భంలో మూడు పగళ్లు, మూడు రాత్రులు గడిపాడు. అయినప్పటికీ అతని కథ చీకటిలో ముగియలేదు. దేవుడు అతనికి మరో అవకాశం ఇచ్చాడు.
మన జీవితాల్లోనూ తప్పులు, వైఫల్యాలు, నిరాశలు ఎదురుకావచ్చు. కొన్నిసార్లు మనమే తీసుకున్న తప్పుడు నిర్ణయాలు మనల్ని కష్టాల్లోకి నెట్టవచ్చు. అయినా పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగడానికి ఆలస్యం చేయకూడదు.
మన అవిధేయత మనల్ని అగాధంలోకి నెట్టవచ్చు; కానీ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన దేవుని వైపు తిరిగి నడిపించగలదు. మనకు ముగింపుగా కనిపించిన చోట కూడా దేవుడు కొత్త ఆరంభానికి మార్గం చూపగలడు.
యోనా కథ మనకు నేర్పే గొప్ప సత్యం ఇదే: దేవుని పిలుపు నుంచి పారిపోవడం కంటే, ఆయన చిత్తాన్ని అర్థం చేసుకొని దానికి విధేయత చూపడం మేలు. ఆయన కరుణను ఆశ్రయించి, మనకు లభించిన రెండవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం.
చిన్న ప్రార్థన...
ప్రభువా! నీ చిత్తం నుంచి దూరమయ్యే మా బలహీనతలను గుర్తించే జ్ఞానాన్ని ప్రసాదించు. కష్టాల్లో నీ వైపు తిరిగి ప్రార్థించే విశ్వాసాన్ని, తప్పులను సరిదిద్దుకునే వినయాన్ని, నీవు ఇచ్చే కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించు. మరణాన్ని జయించిన నీ పునరుత్థానంపై మా నిరీక్షణను బలపరచుము. ఆమేన్!
