దేవుని సేవలోని ఆణిముత్యాలు, పునీతులు సిమియోను మరియు యూదా

ఫాదర్ అల్లం సాగర్ మనోజ్

27 Oct 2026

పునీతులు దేశ భక్తుడనబడు సీమోను,
యూదా తద్దయి గార్ల స్మరణ
(అపోస్తులులు, వేదసాక్షులు)

పునీత దేశ భక్తుడనబడు సీమోను గారు:
12 మంది అపోస్తులలో సీమోను అను ఒకే పేరుగల వారు ఇద్దరు ఉన్నారు. వారు 1) సీమోను పేతురు 2) కాననీయుడగు సీమోను లేక దేశ భక్తుడనబడు సీమోను. సీమోను పేతురుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. సీమోను పేతురు అపోస్తలులకు నాయకుడు. అందువల్ల రెండవ సీమోను పేరు ప్రాచుర్యములోనికి రాలేదు. అపోస్తలుల జాబితాలో కాననీయుడగు సీమోను 11వ వాడు. ఇతను గుర్తింపుకోరని వినయాత్ముడుగా పరిచర్య చేశారు. ఒక మౌనిగా ఉన్నారు. కాననీయుడు అనగా రాజకీయ ఉత్సహం గలవాడు లేక పోరాటవాది అని అర్ధము.

సీమోను అనగా "దేవుడు అలకించును" అని అర్ధం. సీమోను మారుపేరు దేశభక్తుడు. ఇతనిని దేశభక్తుడనబడు సీమోను, సీమోను జెలట్ అనికూడ అంటారు. వీరికి దేశభక్తి, రాజకీయ ఉత్సాహము ఎక్కువ. తమ దేశాన్ని ఆక్రమించి ఆధిపత్యం చేస్తున్న రోమన్ సైన్యాన్ని వ్యతిరేకించడం కోసం మరియు యూదుల సంరక్షణార్ధం జెలట్ సంస్థ ఉండేది. సీమోను ఈ ఉద్యమంలో పాల్గొన్న దేశభక్తుడు, యూదా తద్దయి కూడ సీమోనుతో పాటు ఈ ఉద్యమంలో పాల్గొన్నవాడే.

ప్రభువు పన్నిద్దరు శిష్యులను ఉద్దేశించి చెప్పిన మాటలను ధ్యానించుదాము. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉంటారు. నేను ఇక మీదట మిమ్ము దాసులని పిలువను. స్నేహితులని పిలుస్తాను. ఎందుకనగా తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. నేను నా తండ్రి వలన విన్నదంతయు మీకు విశదపరచాను (యోహాను 15:14-15). ప్రభువు శిష్యులందరిని తన స్నేహితులుగా భావించి అందరికి ప్రాధాన్యత నిచ్చారు, అందరిని ప్రోత్సహించారు, గౌరవించారు, ఆదరించారు. సీమోను కూడ ప్రభువును ప్రేమించాడు. ప్రభువు ఆదేశాలను అనుసరించాడు. యేసు చేత స్నేహితుడా! అని పిలిపించుకున్నాడు.

అదే విధంగా, సీమోను తన బాధ్యతలు నెరవేర్చారు. త్యాగపూరితమైన పరిచర్య చేశారు. పరలోక రాజ్యం సమీపించింది అని ప్రకటించారు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. మరణించిన వాళ్ళను జీవంతో లేపండి. కుష్టరోగులను శుద్ధులను గావించండి. దురాత్మలను వెడల గొట్టండి అని అంటూ యేసు ప్రసాదించిన అనుగ్రహాలను సీమోను పరిచర్యలో ప్రజల కోసం వినియోగించారు (మత్తయి 10:7-10).

సీమోనుకు యూదా రాజ్యం స్థాపన కాంక్ష ఎక్కువగా ఉండేది. సీమోను, యూదా తద్దయిలతో పాటు ఇతర శిష్యులంత యేసే మెస్సయ్య అని నమ్మారు. శిష్యులు మరియు అనేక మంది ప్రజలు మెస్సయ్యపై తమ ఆశలు నిలుపుకొన్నారు. తమను పాలిస్తున్న రోమాను పాలకులను జయించి యూదుల రాజ్యాన్ని పునర్నిర్మించే గొప్పనాయకుడని నమ్మారు. యూదులు రాజకీయ సంబంధమైన విమోచకుని కోసం నిరీక్షిస్తున్నారు. కాని యేసు స్థాపించదలచుకొన్న రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, యేసు దైవరాజ్య నిర్మాత. దైవరాజ్య స్థాపనకు తనను బలిగ అర్పించుకుంటారు. కాని శిష్యులు మెస్సియా రాజ్యాన్ని స్థాపించి ఆయన పాలనలో తనుకు ప్రత్యేక పదవులిస్తారని ఆశించారు. మేము సమస్తాన్ని వదలిపెట్టి నిన్ను అనుసరించాము. మాకేమి లభించును? అని పేతురు అడిగెను (మత్తయి 19:27). జెబదాయి కుమారుల తల్లి ప్రభువుతో నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపున, ఒకడు నీ ఎడమవైపున కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసింది (మత్తయి 20:21). కాని వారు ఆశించింది జరుగలేదు. ప్రభువు సిలువ మరణం పొందారు. శిష్యులు నిరాశాపరులయ్యారు, పూర్వపు జాలరి వృత్తికే సుముఖత చూపారు.

ప్రభువు ఉత్థానమై శిష్యులకు దర్శనమిచ్చారు. మోక్షారోహణ సందర్భంలో ప్రభూ! ఇప్పుడు మీరు యిస్రాయేలునకు రాజ్యమును తిరిగి ఇచ్చెదరా? అని అడిగారు (అ.కా. 1:6). ఎందుకంటే ఈ శిష్యులందరు ప్రభువుచే పిలువబడి, సమస్తాన్ని వదలుకొని వెంబడించారు. వాళ్ళకు మేలు జరుగుతుందని నమ్మారు. మెస్సయా యూదుల రాజ్యాన్ని స్థాపిస్తారు. అందులో తమకు పదవులు లభిస్తాయని భావించారు. కాని, ప్రభుని ఆలోచన, ప్రణాళిక శిష్యుల జీవితాలలో మరో విధముగా ఉంది.

సీమోను ప్రేషిత సేవను చూసినట్లయితే, తన అన్నయైన చిన్న యాకోబు క్రీ.శ.62లో వేదసాక్షిగ మరణించారు. చిన్న యాకోబు యెరూషలేము మొదటి పీఠాధిపతి. ఇతని తరువాత సీమోను యెరూషలేము పీఠాధిపతిగ బాధ్యత స్వీకరించారు. గుర్తింపును ఆశించక సువార్తను బోధించారు. గుప్తంగా పనిచేసుకోవడం, గుర్తింపు కోరిక పోవడం వీరి లక్షణం. ఈజిప్టు, లిబియా, ఆఫ్రికా, బ్రిటన్లో కూడ సువార్త బోధించారు.

ఇదే క్రమంలో యెరూషలేము విధ్వంసమును సీమోను చూశారు. అపోస్తులుడైన సీమోను యెరూషలేము పీఠాధిపతిగా ఉన్న కాలంలో రోమన్ చక్రవర్తి టైటస్ యెరూషలేమును ముట్టడించి ధ్వంసం చేశాడు. పవిత్ర స్థలాలను నాశనం చేశాడు. సీమోను తీవ్రమైన వేదన చెందాడు. యేసు ప్రభువు ముందుగానే ప్రవచించిన ఈ వినాశనము ఇతర శిష్యులకు కూడ తెలుసు (లూకా 21:20-24). యెరూషలేములో ఉన్న విశ్వాసులు సీమోను నాయకత్వంలో ప్రవాసం వెళ్ళారు. వివిధ ప్రదేశాలలో సువార్తను బోధించారు. సీమోను ప్రభువు శిష్యుడు కాకముందు రాజకీయంగా పోరాడాడు. శిష్యుడైన తరువాత దైవరాజ్య నిర్మాణంకోసం కృషి చేశారు. ఉత్సాహం, నిగ్రహం, ఓపిక, పట్టుదల కలిగి సువార్త పరిచర్య చేసి ధన్యుడయ్యారు. కట్టె పుల్లలు కొట్టేవారికి, చర్మాలు శుభ్రం చేసే వారికి పునీత సీమోను గారు పాలక పునీతులు.

పునీత యూదా తద్దయి గారు:
యూదా తద్దయి 12 మంది అపోస్తులలో 10వ స్థానంలో వున్నారు. యూదాను జూడ్ అని కూడా అంటారు. యూదా అనగా ప్రభువు స్తుతింపబడునుగాక" అని అర్థం. యూదా మారుపేరు తద్దయి. తద్దయి అంటే ధైర్యశాలి, గొప్పవాడు, మహాత్ముడు అని అర్థం. ఇతడు పోరాటవాది. యూదా తద్దయి వివాహితుడు. ప్రభువు అపోస్తలునిగా ఎన్నుకొనక ముందు నుంచే భార్యాపిల్లలతో జీవిస్తున్నాడు. రైతు కుటుంబానికి చెందినవాడు. వ్యవసాయ పరిజ్ఞానం గలవాడు.

దైవరాజ్య నిర్మాణానికి విశ్వాసం, సేవా భావం, త్యాగం, ధైర్యం, సాహసం ఎంతో అవసరం. ఉద్రేక పూరిత భావాలు కలిగి, రాజకీయ స్వేచ్ఛా ప్రియుడైన యూదాను యేసు క్రమక్రమంగా సంస్కరించాడు. శాంతికోసం పోరాడువానిగా, ఆధ్యాత్మిక స్వేచ్ఛాసాధకునిగా మలచారు. విప్లవకారులవల్ల గాని, పోరాటవాదుల వల్లగాని దైవరాజ్య నిర్మాణం సాధ్యంకాదు అనే సత్యాన్ని శిష్యులు గ్రహించారు.

కడరా భోజన సమయమున "నా ఆజ్ఞలను పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని ప్రభువు శిష్యులతో అన్నారు. అందుకు తద్దయి "ప్రభూ! లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను తెలియపరచుకొనుట ఎట్లు సంభవించును" అని అడిగెను (యోహాను 14:22), అందుకు యేసు "నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అపుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వానియొద్దకు వచ్చి వానితో నివసింతుము. కాని, నన్ను ప్రేమింపనివాడు నా మాటను పాటింపడు అన్నారు (యోహాను 14:23-24).

పునీత యూదా తద్దయి గారి ప్రేషిత సేవను లోతుగా ధ్యానించినట్లయితే, పెంతుకోస్తునాడు అపోస్తలులతో పాటు యూదా తద్దయి పవిత్రాత్మ వరాలను సమృద్ధిగా పొందారు. పాలస్తీనాలోని యూదియా, గలిలీయ, సమరియ, ఇదుమీయలో వేదబోధ చేశారు. అలాగే టర్కి దేశంలో గల "ఊర్ఫా" పట్టణంలో కూడ సేవచేశారు. ఆర్మేనియా దేశంలో క్రైస్తవ సంఘాన్ని స్థాపించారు, సువార్తను బోధించారు.

ఈ సువార్త పరిచర్యలో పునీత యూదా తద్దయి గారు ఒక అబారు రాజుకు స్వస్థతను చేయడం మనం ధ్యానించుదాం. "ఊర్ఫా" పట్టణ అబారు రాజు నయంగాని వ్యాధితో బాధపడుతున్నాడు. రాజు కోరిక మేరకు తద్దయి రాజు తలపై తన హస్తాలనుంచి యేసు ప్రభువు పేరిట ప్రార్ధించారు. రాజు సంపూర్ణ స్వస్థత పొందాడు. అలాగే అనేక మందిని ఎన్నో వ్యాధుల నుండి స్వస్థపరచారు. రాజు పారితోషికం ఇవ్వబోగా వినయంగా తిరస్కరించారు. అంతయు విడిచిపెట్టిన నాకు ధనమెందుకు అన్నారు. సువార్తను బోధించటానికి అనుమతి పొంది అనేకులకు ప్రభువుని గూర్చి బోధించి జ్ఞానస్థానమిచ్చారు. బలహీనుడైన మరొక రాజుకు శత్రువుపై జయమును సూచించారు.

ప్రారంభము నుండి యూదా తద్దయిగారు అసాధ్యమైన కార్యాలలో అనగా అన్ని ఆశలు వదులుకొన్న సంఘటనలలో సహాయము చేయువారుగ పేరుపొందారు. దీర్ఘకాలంగా అసాధ్యంగ ఉన్నకార్యాలను వారి మధ్యస్త ప్రార్ధన ద్వారా సుసాధ్యము చేయువారుగా విశ్వసింపబడుచున్నారు. నిరాశ చెందినవారికి ధైర్యమును నమ్మికను కలిగించు ప్రత్యేక అనుగ్రహమును శక్తిని కలిగియున్నారు. ఫ్రాన్స్ దేశస్తులు వీరిని ఎక్కువగా గౌరవిస్తారు. పునీత యూదా గారు ఆసుపత్రులకు పాలక పునీతులు.

పునీతులు దేశ భక్తుడనబడు సీమోను, యూదా తద్దయి గార్ల వేదసాక్షి మరణము:

పర్షియా దేశములో (ఇరాన్) సోదరులు తద్దయి, సీమోనులు సమిష్టిగ సువార్తను బోధించారు. ప్రాణాపాయం పొంచి ఉన్నా బోధించడం మానలేదు. ఫలితంగా సుమారు 60వేల మంది పురుషులు (స్త్రీలు, పిల్లలుకాక) విశ్వాసులయ్యారు. దురాత్మలను, దబ్బర దేవతలను అణచివేశారు. అనేక అద్భుతాలను చేశారు. స్థానిక మంత్రగాళ్ళ నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. మాంత్రికుల కుట్రలవల్ల ప్రజలు కొందరు తద్దయి సీమోనులను హింసించి రాళ్ళతోను, కర్రలతోను కొట్టారు. పునీత యూదా తద్దయి మరణించారు. ప్రాణంతో ఉన్న సీమోనును రంపంచేత ముక్కలుగా కోశారు. వేదసాక్షి మరణానికి గుర్తుగా యూదా తద్దయి గారి చేతిలో దుడ్డుకర్ర ఉన్నట్లు చిత్రింపబడ్డారు. సీమోను చేతిలో రంపం ఉన్నట్లు చిత్రింపబడ్డారు. వీరిరువురు ఒకేరోజు వేదసాక్షి మరణం పొందారు. అందువల్ల శ్రీసభ అక్టోబరు 28వ తేది ఈ అపోస్తలుల స్మరణోత్సవమును కొనియాడుచున్నది. కనుకనే, శ్రీసభ వేద పండితుడు తెర్తులియాన్ గారి మాటలలో ధ్యానించుదాం: "వేద సాక్షుల రక్త బిందువులే క్రైస్తవ విశ్వాస బీజాలు" (The Blood of Martyrs is the Seed of Christianity).

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN