జపమాల మాసం: 26వ రోజు

Father gopu praveen
26 Oct 2026
దేవమాత ప్రార్థనలో మరియతల్లిని "వేదసాక్షుల యొక్క రాజ్జీ" అని పిలుస్తాం. మన క్రైస్తవ విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు పట్ల దృఢమైన విశ్వాసం కలిగి ఆయన కోసం మరణించిన వారిని వేదసాక్షులు అంటారు.మరియమాత వేదసాక్షి మరణం పొందకపోయినా, ఆమె అనుభవించిన వేదనలు, భౌతికమైన బాధలు, తక్కువేమీ కావు. యేసు పుట్టుక మొదలుకొని మరణం వరకు మరియమాత తన కుమారుని అడుగుజాడలలో నడచారు. కడకు కపాల కొండపై లోకరక్షకుని ఆవేదనలో తానూ పాలుపంచుకొన్నారు. లోక కల్యాణం కోసం తానూ ఒక సమిధగా ఆహుతి అయ్యారు. ఆమె సాక్ష్యం పలికినది రక్త తర్పణం ద్వారా కాకపోయినా, ప్రాణానికి ప్రాణమైన తన ప్రియతమ కుమారుణ్ణి త్యాగం చేయడం ఆత్మబలిదానాన్ని మించిన అపురూపమైన సాక్ష్యం.
బైబిల్ ఆధారంగా మరియమాత అనుభవించిన శ్రమలు:
1. సిమియోను ప్రవచనం (లూకా 2:34-35) మరియమాత అనుభవించవలసిన శ్రమల గురించి వెల్లడిస్తుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సంసిద్ధురాలైన మరియమాత దానినే తన జీవిత ధ్యేయంగా మలచుకున్నారు.
2. ఐగుప్తునకు పలాయన ఘట్టంలో (మత్తయి 2:34-35) దేవుని చిత్తానికి కట్టుబడి తన ప్రియతమ కుమారుని కాపాడుకోవడానికిగాను ఎన్నో శ్రమల ననుభవించారు.
3. యెరుషలేమున బాలయేసుకు దూరమయిన సందర్భంలో (లూకా 2:4245) అది తాత్కాలిక ఎడబాటు అయినా అది మరియమాతకు దుర్భర వేదననే కలిగించింది.
4. సిలువ మార్గంలో (లూకా 23:27) ఆ తల్లీతనయులు అనుభవించిన మనోవేధన, బాధ మాటలకందనిది.
5. యేసు శిలువ మరణ ఘట్టంలో (యోహాను 19:18,26-27) తన ప్రియ కుమారుని శ్రమలన్నీ అగ్ని జ్వాలలై మరియతల్లిని దహించివేశాయి. తన కుమారునితో పాటు తల్లి మరియమాత తానూ లోకరక్షణార్థమై ఆత్మాహుతి గావించుకున్నారు.
6. యేసు మరణానంతరం (మార్కు 15:42-46) తన ఒడిలో నిర్జీవంగా ఒదిగియున్న తన ప్రియతమ తనయునిగాంచి మరియమాత అనుభవించిన కడుపుకోత వర్ణించనలవికానిది.
7. యేసు భౌతిక దేహాన్ని సమాధి చేస్తూ (యోహాను 19:40-42) ఆ దేవమాత భరింపశక్యంగాని బాధననుభవించారు.
మరియమాతకు "వేదసాక్షుల యొక్క రాజ్జీ" అన్న సంబోధన అన్ని విధాల సరిపోతుంది. పైన చెప్పిన ఏడు సందర్భాలలో అంటే తన జీవితాంతమూ మరియమాత మరణయాతను ననుభవించారు. క్రీస్తు జననానికీ, మరణానికీ, క్రీస్తు దివ్యత్వానికీ ఆమె దేదీప్యమానమైన సాక్షిగా నిలచారు. మనం కూడా ఆ తల్లి వలె ఎన్ని కష్టనష్టాలు మన జీవితంలో ఎదురైన మన విశ్వాసాన్ని కడవరకు నిలుపుకొని, దేవుని బాటలో అడుగులు వేద్దాం..
