మరియతల్లి - సజీవ దేవుని మందసం

జోసెఫ్ అవినాష్
24 Oct 2026
కతోలిక క్రైస్తవులు మరియమాతను సజీవ దేవుని మందసముగా పిలుస్తారు. పాత నిబంధన కాలంలో దేవుని మందసం పవిత్ర వస్తువులను అనగా అహరోను చేతి కర్ర, ఒక బంగారపు పాత్రలో మన్న, పవిత్రమైన పది ఆజ్ఞల రాతి పలకలను మోసింది. వీటన్నిటిని మించి దేవుని కృప శక్తి ఆ పవిత్ర వస్తువులపై ఉండేది. దీనిని చాలా పవిత్రముగా ఉంచేవారు. దేవుడు ఈ పవిత్ర మందసాన్ని దావీదు నాయకత్వంలో యెరూషలేముకు తీసుకువస్తారు. ఇలా దావీదు వాగ్దత మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు దానిని అపవిత్రంగా తాకిన వారు వెంటనే మరణించారని మనం చదువుతున్నాం.
అయితే-మరియమాతకు-వాగ్దత్త మందసానికి మధ్య గల సంబంధం ఏమిటి? యావే దేవుడు ఏర్పాటు చేయించుకున్న మందసాన్ని ఎలా పవిత్రముగా సృజించారో, దానిని అపవిత్రంగా తాకినవారిని ఏవిధంగా శిక్షించారో అదే విధంగా దేవుడు, తన కుమారుని ఈ లోకానికి పంపించడానికి ఎన్నుకున్న కన్య మరియమాత అను నూతన నిబంధన మందసాన్ని అంతకు మించిన పవిత్రమూర్తిగా తీర్చిదిద్దారు; గనుకనే తల్లి మరియమాతను అనేక బాధల నుండి, కష్టాల నుండి కాపాడారు, ఈ లోకాశలకు అతీతంగా పవిత్రంగా ఉంచారు. ఆనాడు మందసాన్ని ఏ విధంగా అన్యుల బారినుండి రక్షించారో, అదేవిధంగా మరియతల్లిని కూడా ఎప్పుడు మనసా వాచా కర్మణా రక్షించారు ప్రభువు. మరియతల్లి కూడా ఎప్పుడు మనసా వాచా కర్మణా అంతా ఆ తండ్రి చిత్తం ప్రకారమే చేసేవారు (1 సమూ 4:10; లూకా 2:43). "నా దేవుని తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను” అంటూ ఎలిజబేతమ్మ ఆశ్చర్యపోయినట్లే దావీదు రాజు కూడా ఆనాటి మందసాన్ని చూచి ఆశ్చర్యపోతారు (2 సమూ 6:9).
అలాగే మరియమాత మూడు మాసాలు ఎలిజబేతమ్మ ఇంటిలో ఉన్నట్లు దేవుని మందసం కూడా ఓబేదెదోము ఇంటిలో మూడు మాసాలు ఉంది (2 సమూ 6:11).దావీదు రాజు దేవుని మందసం ముందు నృత్యం చేసినట్లే దేవుని తల్లి మరియమాత సందర్శనంతో స్పందించిన ఎలిజబేతమ్మ గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసినట్లు సువార్తా గ్రంథం ప్రకటిస్తుంది (లూకా 1:44). మరియమాత సజీవ దేవుని మందసం అందుకే ఆ తల్లి తేరు గ్రామ పురవీధులలోకి ప్రవేశిస్తున్నప్పుడు కతోలిక విశ్వాసులు భక్తిశ్రద్ధలతో ఆ తల్లిని తమ హృదయాల్లోకి ఆహ్వానిస్తారు. ఆనాటి నిబంధన మందసం దేవుని పవిత్ర వస్తువులను మోస్తే ఈనాటి మరియమాత అను సజీవ నిబంధన మందసం సాక్షాత్తు భగవంతుడినే మోసింది.
