2027 ప్రపంచ యువజన దినోత్సవానికి నమోదు చేసుకోవాలని యువతకు పోప్ పిలుపు
జోసెఫ్ అవినాష్
23 Oct 2026
2027లో దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో జరగనున్న ప్రపంచ యువజన దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత నమోదు చేసుకోవాలని పోప్ లియో XIV గారు పిలుపునిచ్చారు.అక్టోబర్ 22న పునీత రెండవ జాన్ పాల్ పాపు గారి పండుగ సందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన ఈ ఆహ్వానాన్ని అందించారు. ఈ కార్యక్రమం కేవలం ఒక నగరాన్ని సందర్శించడం మాత్రమే కాదని,విశ్వాసం,స్నేహం, నిరీక్షణలతో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణమని ఆయన పేర్కొన్నారు.
వివిధ దేశాలు,భాషలు,సంస్కృతులకు చెందిన యువత ఒకచోట చేరడం ద్వారా క్రీస్తులో ఐక్యతను అనుభవించగలరని ఆయన తెలిపారు.ఈ సమావేశం యువత తమ విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోటి యువతతో స్నేహబంధాలను ఏర్పరచుకోవడానికి దోహదపడుతుందని చెప్పారు. ఈ ప్రపంచ యువజన దినోత్సవానికి “ధైర్యంగా ఉండండి! నేను లోకాన్ని జయించాను” (యోహాను 16:33) అనే అంశాన్ని ఎంపిక చేశారు.యువత తమ కలలు,ఆశలు,జీవితంలోని కష్టాలు,గాయాలను దేవుని సన్నిధికి తీసుకురావాలని పోప్ ఆకాంక్షించారు.దేవుడు ప్రతి ఒక్కరినీ పేరుపెట్టి పిలుస్తున్నాడని,వారిలో నిరీక్షణను మేల్కొలిపి సంపూర్ణమైన జీవాన్ని,ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాడని వివరించారు. సియోల్‌లో యువతను కలుసుకోవడానికి ఎదురుచూస్తున్నట్లు తెలియజేస్తూ,యువతకు, వారి కుటుంబాలకు తన ఆశీర్వాదాలను అందించారు.
