దేవుని ప్రియమైన బిడ్డలుగా జీవించుదాం!

జోసెఫ్ అవినాష్
20 Oct 2026
సామాన్య 29వ బుధవారం
సువిశేష ధ్యానం:
లూకా 12:39-48
ఈనాటి సువార్తలో యేసుప్రభువు ఆయన ద్వితీయాగమనమును గూర్చి ఉపదేశించుచు,దొంగను గురించి ఉపమానమును చెప్పెను. మన ఇంటిలో దొంగలు ఏ సమయంలో పడునో ఎవరికీ తెలియదు.కనుక రాత్రి సమయంలో మేల్కొనియుండి తన ఇంటిని, సంపదలను, ప్రాణమును కాపాడుకోవాలని యేసు హెచ్చరిక చేస్తున్నారు.ఈలోక సంపదలను కాపాడుకోవటానికి ఎంత శ్రద్ధ చూపుతామో, అదే విధంగా మన ఆత్మను సాతాను స్వాధీనం చేసుకోకుండా,మన నిత్యం మేల్కొనియుండాలి, దాని క్రియలకు దూరంగా ఉండాలని యేసు ఉపమానం ద్వారా తెలియజేశారు. అప్పుడు పేతురు ప్రభువును ఇట్లు ప్రశ్నించెను "ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా? అందరితోను చెప్పుచున్నావా? అందుకు ప్రభువు సమాధానంగా బుద్ధిగల మరియు బుద్ధిలేని గృహ నిర్వాహకులను గూర్చిన ఉపమానమును చెప్పెను. "నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను. మెలకువగా నుండవలెను. (మార్కు 13:37), ఈ వాక్యము బట్టి ప్రత్యేకముగా శిష్యులకు యిచ్చిన ఆ ఉపమానము అందరికి అన్యయించుకోవచ్చు. ఆయన రెండవ రాకడ ఎప్పుడో తెలియదు. కనుక ప్రతి గడియ మనం సిద్ధపడియుండవలయును. తన రాకడ తనకు కూడా తెలియదని యేసే స్వయంగా తెలియపరిచారు.కనుక మన యజమాని అయిన దేవునికి మనం నిత్యం నిజాయితీపరులైన సేవకులుగా జీవించాలి.ప్రతి నిత్యం ఆయన ఆలోచనతో జీవించాలి. ప్రతి మాట, పని ఆయనకు ఆనందకరంగా చేయాలి. ప్రయత్నం చేద్దాం! సిద్దపడుదాం! విశ్వాసములో జీవిచుదాం! మెలుకువతో ప్రయత్నం చేద్దాం! దేవుని ప్రియమైన బిడ్డలుగా జీవించుదాం!
