మరణించిన కతోలిక గురువు ఖాతాలోని రూ.56 లక్షలు మఠ సభకే: హైకోర్టు తీర్పు

జోసెఫ్ అవినాష్
20 Oct 2026
2026 అక్టోబర్ 13న మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.తమిళనాడుకు చెందిన ఫా. దేవకుమార్ అరుళానందం 2018లో మరణించిన తరువాత, ఆయన బ్యాంకు ఖాతాలోని రూ.56 లక్షల స్థిర నిక్షేపాలపై ఆయన సోదరులు,మేనకోడలు వారసత్వ హక్కు కోరారు. అయితే, ఆయన సభ్యుడిగా ఉన్న సొసైటీ ఆఫ్ కాథలిక్ అపోస్టలేట్ (పల్లొటైన్స్ సభ) ఆ సొమ్ముపై హక్కు తమదేనని కోర్టును ఆశ్రయించింది.గురువు మఠ సభలో చేరిన తరువాత చేసిన మతపరమైన ప్రమాణాలు,ఆస్తి సంపాదించిన పరిస్థితులు,సమాజానికి ఇచ్చిన హామీలను పరిశీలించిన న్యాయస్థానం, బంధువులకు అనుకూలంగా 2024లో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.బంధువులు ఉపసంహరించుకున్న రూ.56 లక్షలను నెల రోజుల్లోగా మఠ సభకే తిరిగి చెల్లించాలని ఆదేశించింది. గడువులోగా చెల్లించకపోతే సంవత్సరానికి 9 శాతం వడ్డీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా “దొంగిలించకూడదు” అనే పది ఆజ్ఞల్లోని బోధనను కూడా న్యాయస్థానం ప్రస్తావించింది.
