అద్భుతాల అంతోని వారు !

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి
19 Oct 2026
అద్భుతాల అంతోని వారు !
----------------------
అంతోని వారు తమ జీవిత కాలంలో ఎన్నో అద్భుతాలు చేశారు. వారి అద్భుతాలను కనులారా చూసిన పాదువా పురి ప్రాంత ప్రజలు ఎంత అదృష్ట వంతులో గదా !
ఒకసారి అంతోనివారు పాపసంకీర్తనములు వింటున్నారు. 'లియోనార్డో ' అనే బాలుడు పాప సంకీర్తనం చేస్తూ , తాను కోపంతో తన తల్లిని కాలితో తన్నిన విషయం అంతోని వారికి చెప్పాడు .దానికి అంతోని వారు 'తల్లిని తన్నిన కాలిని విరిచేయడమే తగిన శిక్ష ' అని బాలుని హెచ్చరిస్తూ, పాప మన్నింపునిచ్చారు . ఆ బాలుడు ఇంటికి వెళ్ళి, స్వామి వారన్న మాటలను మననం చేసుకుంటూ ,ఒక కత్తిని తీసుకొని తన కాలిని నరుక్కున్నాడు.నెత్తురు మడుగులో అల్లాడుతున్న కుమారుని చూసిన అతని తల్లి లబలబ లాడుతూ అంతోని వారి దగ్గరకు వెళ్ళి ఆ విషయం చెప్పింది. అంతోని వారు ఆ బాలుని చేరి , విరిగిన కాలిని తీసి వానికతికించారు.అంతే ! ఎక్కడి నెత్తురు అక్కడే మాయమై , మచ్చ కూడా మిగలకుండా ,కాలు ఒంటికి అతుక్కుపోయింది.
మరొక్కసారి ఒక తల్లి తన పసి బిడ్డని ఉయ్యాలలో పండబెట్టి చలి వేయకుండా దుప్పటి కప్పి ,గుడికి వెళ్ళి అంతోని వారి ప్రసంగం వింటూ కూర్చుంది.ప్రసంగం అయిపోయింతర్వాత ఇంటికి వెళ్ళీచూస్తే ఏముంది? ఊయలలొ పసివాడు వంటికి దుప్పటి చుట్టుకొని ఊపిరాడక నిర్జీవుడయ్యాడు. ఆ తల్లి ఆ బిడ్డతో వెళ్ళి అంతోని వారి కాళ్ళపై పడింది.అంతోని వారు చల్లని చూపులతో ఆ బిడ్డను తాకగానే విగత జీవుడైన బిడ్డడు లేచి 'కేర్ ' మన్నాడు.
ఇంకొకసారి , అంతోని వారి తండ్రి 'మార్టిన్' పై హత్యా నేరం మోప బడింది .ఆయన్ని బంధించి విచారించడం మొదలు పెట్టారు.ఆయన హత్య చేశాడని చెప్పబడుతున్న బాలుని శవాన్ని కూడా న్యాయ స్థానానికి తీసుకొని వచ్చారు. అంతలో అంతోని వారు అక్కడకు వచ్చి , బాలుని శవానికి ప్రాణం పోసి వాని చేతనే అసలైన హంతకుల పేర్లు బయట పెట్టించారు.
ఈ విధంగా చెప్పుకుంటూ చరిత్ర పుటలు విప్పుకుంటూ పోతే ,అంతోని వారు చేసిన అద్భుతాలు పుంఖాను పుంఖాలుగా దర్శనమిస్తాయి .
ఆ.వె :
అర్చ్య శిష్టు లందు అధిక మన్నన కల్గి
అద్భుతాలు చేసి ఆదుకొనుచు
సానుభూతి తోడ సాయమందించేవు
పాదువ పుర స్వామి ప్రణతి సేతు .
