పోప్ వేదవ్యాపక ఆదివార సందేశం

ప్రసాద్ గార్లపాటి
17 Oct 2026
పరిశుద్ధ లియో XIV పోప్ వారి సందేశం
"క్రీస్తునందు ఏకమై, సువార్త సేవలో సమైక్యమై"
(వందేళ్ల సువార్త ప్రచార యాత్ర)
[2026 అక్టోబరు 18]
ప్రియమైన సహోదరి సహోదరులారా,
1926లో పోప్ పయస్ XI గారు "ప్రపంచ వేదవ్యాపక ఆదివారాన్ని" (World Mission Sunday) స్థాపించారు. పరిశుద్ధ శ్రీసభకు అత్యంత ప్రియమైన ఈ వేడుక శతవార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, 2026 ప్రపంచ వేదవ్యాపక దినోత్సవానికి "క్రీస్తునందు ఏకమై, సువార్త సేవలో సమైక్యమై" అనే ఇతివృత్తాన్ని నేను ఎంచుకున్నాను. జూబిలీ సంవత్సరం ముగిసిన తర్వాత కూడా, పరిశుద్ధాత్మ శక్తితో తల్లి శ్రీసభ యావత్తూ ఆనందోత్సాహాలతో, తన సువార్త యాత్రను నిరంతరం కొనసాగించాలని నేను నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దీనికి క్రీస్తులో ఐక్యమైన హృదయాలు, సమాధానపడిన సమాజాలు మరియు ఉదారత, నమ్మకంతో సహకరించే విశ్వాసులందరిలో ఉండాలి. క్రీస్తులో ఏకమై, సువార్త సేవలో ఐక్యంగా ఉండటాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దైవకృప మనల్ని నడిపించడానికి, ప్రేరణ ఇవ్వడానికి మనల్ని మనం సమర్పించుకుందాం. "శ్రీసభ చరిత్రలోని ఈ దివ్య నూతన యుగంలో, సువార్తీకరణ పట్ల మన నిష్ఠను బలపరుచుకుంటూ, దివ్యసందేశ పిలుపు యొక్క పవిత్రాగ్ని జ్వాలను మరల ప్రజ్వలింపజేసి ముందుకు సాగడానికి ఈ తరుణం ఎంతగానో దోహదపడుతుంది."
1. క్రీస్తులో ఏకమై ప్రభువునందూ, పరస్పర సహోదరత్వమందూ ఒక్కటైన సువార్తా సాక్ష్య శిష్యులు
దివ్యసందేశ సేవకు మూలం క్రీస్తుతో ఐక్యత. ఈ ఐక్యత ఒక దివ్యమర్మం. తన శ్రమలకు ముందు యేసుప్రభువు తండ్రిని ఇలా ప్రార్థించారు, వారందరూ ఒక్కటిగా ఉండాలి; తండ్రీ, నీవు నాలోను, నేను నీలోను ఉన్నట్లే, వారు కూడా మనలో ఉండాలి (యోహాను 17:21).ఈ మాటల్లో యేసునాథుని కోరిక, ఆయన శిష్యుల పరంగా శ్రీసభకు లభించిన దివ్య గుర్తింపు స్పష్టమవుతుంది.ఇది త్రిత్వైక దేవుని ద్వారా ఎల్లప్పుడూ పోషించబడే గొప్ప ఐక్యత. ఈ పవిత్ర ఐక్యత అందరు మానవుల మధ్య సహోదరత్వాన్ని, మొత్తం సృష్టిలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది.
క్రైస్తవుడిగా ఉండటం అంటే కేవలం ఆచారాలు పాటించడం లేదా కొన్ని ఆలోచనలు కలిగి ఉండటం కాదు; ఇది క్రీస్తుతో ఐక్యమైన జీవితం. ఈ ఐక్యతలో, పరిశుద్ధాత్మ ద్వారా తండ్రితో యేసుకు ఉన్న పుత్ర సంబంధంలో మనం కూడా పాలుపంచుకుంటాము. అంటే, ద్రాక్షావల్లికి తీగలు అతుక్కుని ఉన్నట్లు (యోహాను 15:4), మనం క్రీస్తుతో కలిసి ఉండటం. ఈ ఐక్యత విశ్వాసుల మధ్య పరస్పర సామరస్యానికి దారితీస్తుంది; సకల సువార్త ప్రచార ఫలభరితత్వానికి మూలధారగా నిలుస్తుంది. నిజానికి, పునీత రెండవ జాన్ పాల్ గారు బోధించినట్లు ఐక్యత అనేది దివ్యసందేశ సేవకు (ప్రేషిత కార్యానికి) మూలము, ఫలము కూడా అయి ఉన్నది. ఈ నేపథ్యంలో, తన సభ్యుల మధ్య ఆత్మసంబంధమైన, సహోదర ఐక్యతను పునరుద్ధరించడం, నిలబెట్టడం శ్రీసభ యొక్క ప్రాథమిక బాధ్యత. అనేక సందర్భాల్లో మనకు విభేదాలు, పొరపాట్లు, పరస్పర నమ్మకలేమి ఎదురవుతాయి. ఇవి మన సంఘాలలో జరిగినప్పుడు, అవి మన సాక్ష్యాన్ని బలహీనపరుస్తాయి. క్రీస్తు తన శిష్యులకు అప్పగించిన సువార్తీకరణకు, అన్నింటికంటే మించి, సమాధానపడిన, ఐక్యత కోసం తపించే హృదయాలు అవసరం. కాబట్టి, నైసియా విశ్వసభ యొక్క 1700వ వార్షికోత్సవ శుభసందర్భాన్ని పురస్కరించుకుని లభించే దివ్య అవకాశాలను వినియోగించుకుంటూ, సకల క్రైస్తవ సంఘాలతో ఐక్యతా ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేయడం శ్రేయస్కరం.
'క్రీస్తునందు ఏకమై' ఉండటం మన చూపులను నిరంతరం ప్రభువు వైపే నిలపడానికి ఆహ్వానిస్తుంది; తద్వారా ఆయన మన జీవితాలకు, సమాజాలకు, మన ప్రతి మాటకు, క్రియకు, అనుబంధానికి నిజమైన మూలకారకుడవుతారు. ఇది మనల్ని పరమాశ్చర్యంతో ఈ విధంగా చాటడానికి పురికొల్పుతుంది. “ఇక జీవించునది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు" (గలతీ 2:20). ప్రభువు వాగ్దాన వాక్యాన్ని నిత్యం శ్రద్ధతో ఆలకించడం ద్వారా, పరిశుద్ధ దేవద్రవ్యానుమానాల దివ్యకృప ద్వారా, మనం శ్రీసభ పవిత్ర మందిరంలో సజీవ రాళ్ళుగా మారగలుగుతాము. ఈనాడు శ్రీసభ, రెండవ వాటికన్ కౌన్సిల్ దివ్య సందేశాలను, తదనంతర ఆజ్ఞలను, విశేషంగా ఫ్రాన్సిస్ జగద్గురువుల పవిత్ర మార్గదర్శకాలను అంగీకరించడానికి ఆహ్వానించబడుతోంది. నిజానికి, అపోస్తలుడైన పౌలు గారు పలికినట్లు: 'మనం మనల్ని మనం చాటుకోవడం లేదు; యేసుక్రీస్తునే సర్వాధికారియైన ప్రభువుగా ప్రకటిస్తున్నాము' (2 కొరింథీ 4:5). ఈ కారణంచేత, నా పూర్వపు జగద్గురువుల పవిత్ర వాక్కులను నేను పునరుద్ఘాటిస్తున్నాను: 'దేవుని కుమారుడైన నజరేయుడైన యేసు యొక్క దివ్యనామం, బోధన, పవిత్ర జీవితం, వాగ్దానాలు, దైవరాజ్యం మరియు దివ్యరహస్యాలు ప్రకటింపబడకపోతే అక్కడ నిజమైన సువార్తీకరణ లేదు'. ఈ సత్య సువార్తీకరణ ప్రక్రియ మానవాళి అంతటికీ చేరడానికి ప్రతి క్రైస్తవుని హృదయ అంతరంగంలోనే ప్రారంభమవుతుంది. "అందుచేత, మనం క్రీస్తునందు ఎంతగా ఐక్యమై ఉంటే, ఆయన మన భుజస్కంధాలపై ఉంచిన సువార్తా సాక్ష్యపు బాధ్యతను అంత సమిష్టిగా పరిపూర్ణం చేయగలము."
2. సువార్త సేవలో సమైక్యమై – పరలోక ప్రభువైన క్రీస్తును విశ్వసించునట్లు
శిష్యుల ఐక్యత స్వయంసమృద్ధి కోసం ఉద్దేశించినది కాదు; అది ప్రేషిత కార్యం విస్తరించడానికి దోహదపడుతుంది. ప్రభువైన యేసు దీనిని స్పష్టంగా బోధించారు: "నీవు నన్ను పంపావని లోకం విశ్వసించునట్లు" (యోహాను 17:21). సామరస్యం, సోదరభావం, ఐక్యత కలిగిన విశ్వాస సమాజ సాక్ష్యం ద్వారానే సువార్త ప్రకటనకు దాని సంపూర్ణ శక్తి లభిస్తుంది. ఈ దృక్కోణం నుండి, ధన్యుడైన పావోలో మాన్న గారి దివ్య నినాదాన్ని స్మరించుకోవడం సముచితం.'యావత్ శ్రీసభ యావత్ లోక పరివర్తన కొరకు'. ఇది 1916వ సంవత్సరంలో పాంటిఫికల్ మిషనరీ యూనియన్ వ్యవస్థాపనకు ప్రేరణనిచ్చిన దివ్యాదర్శాన్ని సంక్షిప్తంగా వ్యక్తపరుస్తుంది. దీని 110వ వార్షికోత్సవ శుభసందర్భాన, యాజకులు, సమర్పిత వ్యక్తులు, విశ్వాసుల యొక్క దివ్యసందేశ (ప్రేషిత) ఆత్మను ప్రేరేపించడానికి, రూపుదిద్దడానికి, అలాగే సువార్తీకరణ ప్రయత్నాల సమైక్యతను ప్రోత్సహించడానికి మీరు చేస్తున్న కృషికి నా హృదయపూర్వక కృతజ్ఞతలను, దివ్యాశీస్సులను తెలియజేస్తున్నాను. వాస్తవానికి, జ్ఞానస్నానము పొందిన ఏ వ్యక్తి కూడా దివ్యసందేశ ప్రేషిత కార్యం నుండి మినహాయింపు పొందడు, ఉదాసీనంగా ఉండలేడు; ప్రతి ఒక్కరూ తమ తమ దివ్యపిలుపును, జీవన స్థితిని బట్టి, క్రీస్తునాథుడు శ్రీసభకు అప్పగించిన ఈ మహత్తర కార్యంలో భాగస్వాములవుతారు. ఫ్రాన్సిస్ జగద్గురువులు పదేపదే మనకు జ్ఞప్తికి తెచ్చినట్లు,సువార్త ప్రకటన అనేది ఎల్లప్పుడూ సామరస్యపూర్వకమైన, సమిష్టి రూపమైన, సినోడల్ దివ్యకార్యంగా నిలుస్తుంది. ఈ కారణంగా, ప్రేషిత కార్యంలో ఐక్యత అంటే ఐక్యతా ఆధ్యాత్మికతను, ప్రేషిత సహకారాన్ని కాపాడుకోవడం, పెంపొందించుకోవడం. ఈ వైఖరిని ప్రతిరోజూ అలవరచుకొనే కొద్దీ, దైవకృప మన సహోదరీ సహోదరులను విశ్వాస నేత్రాలతో చూడడం మనకు క్రమంగా నేర్పుతుంది. ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ ప్రేరేపించే సత్కార్యాలను సంతోషముతో గుర్తించడం, వైవిధ్యాన్ని శ్రీసభకు లభించిన దివ్యనిధిగా స్వీకరించడం, ఒకరి భారాలను మరొకరు భరించడం మరియు ఎల్లప్పుడూ మహోన్నతుడైన దేవుని నుండి లభించే ఐక్యతకై ఆరాటపడటం కూడా మనం అభ్యసిస్తాము. నిజంగా, ఒకే ప్రభువు, ఒకే విశ్వాసం, ఒకే జ్ఞానస్నానం; అందరికీ తండ్రి, అందరిపైనా, అందరి ద్వారానూ, అందరిలోనూ ఉన్న ఒకే దేవుడు(ఎఫెసీయులు 4:5-6) అనే సత్యంలో మనమంతా ఒకే ప్రేషిత కార్యంలో పాలుపంచుకుంటున్నాము. శ్రీసభ నిర్వహించే సువార్తీకరణ పట్ల సార్వత్రిక దృక్పథాన్ని తిరిగి పొందేందుకు, సమన్వయ లోపాలను, ప్రభువైన క్రీస్తు శిష్యుల నడుమ గల భేదాభిప్రాయాలను, పక్షపాతాలను అధిగమించడానికి ఇది మనకు ఉపకరిస్తుంది.
సువార్తా ప్రచార ఐక్యత అనేది కేవలం బాహ్య ఏకరూపత కాదు; ఒకే పవిత్ర లక్ష్యం కోసం విభిన్న వర ప్రసాదాల సమన్వయమై ఉన్నది. అనగా క్రీస్తునాథుని ప్రేమను లోకానికి పరిచేయడం చేయడం, ఆయనను అనుభవపూర్వకంగా దర్శించడానికి అందరినీ ఆహ్వానించడం. స్థానిక సమాజాలు ఒకరికొకరు తోడ్పడుతున్నప్పుడు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆరాధనా వైవిధ్యాలు ఒకే విశ్వాసంలో ఐక్యమై వ్యక్తమైనప్పుడు సువార్తా ప్రచారం పరిపూర్ణమవుతుంది. అందుచేత, శ్రీసభ పరిధిలోని సమస్త విభాగాలు తమ సమైక్యతా బంధాన్ని దృఢపరచుకోవాలని, సువార్తా పరిచర్య కొరకు, పాలుపంచుకుంటూ ఒకరికొకరు సహకరించుకోవడానికి స్పష్టమైన ప్రణాళికలను రూపొందించుకోవాలని కోరుతున్నాను."
ఈ సమయాన, పెరూలో సువార్తా ప్రచార సహకారం కొరకు పాంటిఫికల్ మిషన్ సొసైటీస్ చేస్తున్న దివ్యసేవలకు నా కృతజ్ఞతలు అందజేస్తున్నాను. ప్రొపగేషన్ ఆఫ్ ద ఫెయిత్, హోలీ చైల్డ్హుడ్, సెయింట్ పీటర్ ది అపోస్తల్, మరియు పాంటిఫికల్ మిషనరీ యూనియన్ అనే ఈ నాలుగు సంస్థలు అన్ని వయస్సుల క్రైస్తవులలో సువార్తీకరణను పోషిస్తూ, లోకమంతటా ఉన్న విశ్వాసులను ఐక్యపరిచే ప్రార్థన, త్యాగాల నెట్వర్క్ను పెంపొందిస్తున్నాయి.ఈ సందర్భంలో, విశ్వాస ప్రచార సభ (Society of the Propagation of the Faith) మూలకర్తయైన ధన్యురాలు పౌలిన్ మేరీ జారికో, రెండు వందల సంవత్సరాల క్రితం సజీవ జపమాల (లివింగ్ రోజరీ) భక్తిమార్గాన్ని నెలకొల్పారని స్మరించుకోవడం అత్యంత సముచితం. నేటికీ ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాదిమంది విశ్వాసులను శ్రీసభ యొక్క ప్రతీ ఆధ్యాత్మిక, ప్రేషిత కార్య అవసరం కొరకు ప్రార్థించేలా ఐక్యపరుస్తూనే ఉంది. విశ్వాస ప్రచార సభ ఆకాంక్ష మేరకు, 1926వ సంవత్సరంలో పయస్ XI జగద్గురువులు 'ప్రపంచ వేదవ్యాపక దినోత్సవాన్ని' (వరల్డ్ మిషన్ డే) ప్రవేశపెట్టారని జ్ఞాపకం చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఈ మహోత్సవ దినాన సేకరించిన వార్షిక కానుకలు, జగద్గురువుల (పోప్) పక్షాన, శ్రీసభ నిర్వహిస్తున్న ప్రేషిత కార్యాల వివిధ అవసరాలకు ఊతమిచ్చేలా ఈ సభ ద్వారా వికేంద్రీకరించబడతాయి. కావున, ఈ నాలుగు సొసైటీలు సమిష్టిగానూ, తమ తమ విశిష్ట సేవల్లోనూ శ్రీసభకు మహత్తరమైన, అమూల్యమైన సేవనందిస్తున్నాయి."
3. ప్రేమించడమే ప్రేషిత కార్యం: దేవుని విశ్వసనీయ ప్రేమను ప్రకటించడం, జీవించడం, పంచుకోవడం
ఐక్యత సువార్తికరణకు షరతు అయితే, ప్రేమ దాని సారాంశం. మనం లోకానికి ప్రకటించడానికి పంపబడిన దివ్యసువార్త ఒక ఊహాజనిత భావన కాదు; అది యేసుక్రీస్తు ముఖంలోనూ, జీవితంలోనూ వెల్లడైన దేవుని నమ్మకమైన ప్రేమ సువార్త. శిష్యుల, యావత్ శ్రీసభ ప్రేషిత కార్యం పరిశుద్ధాత్మలో క్రీస్తు ప్రేషిత కార్యాన్ని కొనసాగించడమే: ప్రేమ నుండి పుట్టిన కార్యం, ప్రేమలో జీవించే కార్యం, ప్రేమను నడిపించే కార్యం. క్రీస్తు ప్రేమ ప్రేరేపించగా, అపోస్తలులు క్రీస్తు కోసం సువార్తను ప్రకటించడానికి బయలుదేరారు (2 కొరింథీయులు 5:14). అదే విధంగా, శతాబ్దాలుగా అనేకమంది క్రైస్తవులు అమరవీరులు, విశ్వాస ప్రకటనకారులు, ప్రేషితులు ఈ దైవ ప్రేమను ప్రపంచానికి తెలియజేయడానికి తమ జీవితాలను అర్పించారు.
నేటి సువార్తా ప్రచారకులకు నా ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. పునీత ఫ్రాన్సిస్ జేవియర్ వలె, వారు సువార్తను ప్రకటించడానికీ, క్రీస్తును, ఆయన ప్రేమను తరచుగా సవాళ్లతో నిండిన, పేదరికంతో బాధపడే, సంఘర్షణలున్న, లేదా సంస్కృతిపరంగా దూరమైన ప్రాంతాలకు తీసుకువెళ్లడానికీ తమ మాతృభూమిని, కుటుంబాలను విడిచిపెట్టారు. ప్రతికూలతలూ, మానవ పరిమితులూ ఉన్నప్పటికీ, వారు సంతోషంగా తమను తాము అర్పించుకుంటున్నారు. ప్రపంచానికి ఇప్పటికీ ధైర్యవంతులైన ఈ సాక్షులు అవసరం; శ్రీసభ సంఘానికి కొత్త సువార్తా ప్రచారకులు అవసరం. మనం ఎల్లప్పుడూ వారిని మన హృదయాలకు దగ్గరగా ఉంచుకోవాలి, వారి కోసం తండ్రిని నిరంతరం ప్రార్థించాలి. అస్సీసి పునీత ఫ్రాన్సిస్, పునీత తెరేసమ్మల సాక్ష్యాల నుండి ప్రేరణ పొంది, మనమందరం మన పిలుపునకూ, లభించిన వరాలకూ అనుగుణంగా సువార్తీకరణ అనే మహా ప్రేషిత కార్యానికి సహకరించడానికి కట్టుబడి ఉందాం. మీ ప్రార్థనలు, ఆచరణాత్మక మద్దతు, ముఖ్యంగా ప్రపంచ వేదవ్యాపక దినోత్సవం నాడు, దేవుని ప్రేమ సువార్తను ప్రతి ఒక్కరికీ, ప్రత్యేకించి పేదలకూ, అత్యంత అవసరంలో ఉన్నవారికీ చేర్చడంలో గొప్ప సహాయంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ఐక్యతను పెంపొందించడానికి, ఈ చిన్న ప్రార్థనతో నా ఆశీర్వాదాన్ని మీకు అందజేస్తున్నాను:
"పరిశుద్ధ తండ్రీ, ఐక్యపరిచే, పునరుద్ధరించే మీ ప్రేమలో మమ్మల్ని నాటుకొనిపోయేలా చేసి, క్రీస్తులో మమ్మల్ని ఒక్కటి చేయుము. శ్రీసభ ప్రజలందరూ సువార్తా ప్రచారం లో ఏకమై, పవిత్రాత్మకు విధేయులై, సువార్తకు ధైర్యపు సాక్షులుగా నిలుస్తూ, సమస్త సృష్టి పట్ల మీ నమ్మకమైన ప్రేమను రోజువారీ జీవితంలో వ్యక్తపరిచేలా చేయుము. సువార్తా ప్రచారకులైన స్త్రీపురుషులందరినీ దీవించుము; వారి శ్రమలో తోడుగా ఉండి, నిరీక్షణతో వారిని భద్రపరచుము!
సువార్త ప్రేషిత కార్యముల రాజ్ఞి అమలోద్భవి మాతా , నలుదిక్కులా సాగుతున్న మా సువార్తీకరణ ప్రయత్నాలకు తోడ్పడము. మమ్మల్ని దైవిక శాంతికి ఉపకరణాలుగా చేయుము; లోక రక్షకుడైన క్రీస్తుప్రభువు వెలుగును సకల జనులు దర్శించేలా కృపచూపుము. ఆమెన్."
