ఆధునిక లోకానికి ఆదర్శ వనిత - మరియమాత

ప్రసాద్ గార్లపాటి

16 Oct 2026

“ఇదిగో ప్రభువు దాసురాలిని; నీ మాట చొప్పున నాకు జరుగును గాక!”
- లూకా సువార్త 1:38

ఒక తల్లి హృదయం ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే, తన బిడ్డ కోసం కన్నీళ్లు కార్చిన ప్రతి తల్లిని చూడాలి. కానీ, తన కుమారుని సిలువ వేదనను కళ్లారా చూస్తూ, హృదయం ముక్కలవుతున్నా దేవునిపై విశ్వాసాన్ని విడిచిపెట్టని తల్లి ప్రేమ ఎంత లోతైనదో తెలుసుకోవాలంటే కల్వరి కొండపై నిలిచిన మరియమాతను చూడాలి!

లోకం ఆమెను ఒక సాధారణ యువతిగా చూసింది. కానీ దేవుడు ఆమె వినయ హృదయంలో తన రక్షణ ప్రణాళికకు ఒక పవిత్రమైన స్థలాన్ని కనుగొన్నాడు. నజరేతు అనే చిన్న గ్రామంలో జీవించిన ఆ యువతి, తన జీవితంపై తనకున్న ప్రణాళికలకంటే దేవుని చిత్తానికే ప్రథమ స్థానం ఇచ్చింది. తన భవిష్యత్తు ఎలా ఉంటుందో పూర్తిగా తెలియకపోయినా, దేవుని వాక్కును విశ్వసించి, తన జీవితాన్ని ఆయనకు సమర్పించింది.

ఆమె పలికిన ఆ ఒక్క మాట *“నీ మాట చొప్పున నాకు జరుగును గాక!”* ఆమె విశ్వాసానికి, వినయానికి, సంపూర్ణ సమర్పణకు శాశ్వత సాక్ష్యంగా నిలిచిపోయింది.

బెత్లెహేము పశువుల పాకలో తన కుమారుడైన యేసును ప్రేమతో తన ఒడిలోకి తీసుకున్న తల్లి ఆమెనే… కానాలో తన కుమారుని దైవిక మహిమను చూసిన తల్లి కూడా ఆమెనే… కల్వరి సిలువ పాదాల వద్ద తన ప్రియ కుమారుని వేదనను మౌనంగా భరించిన తల్లి కూడా ఆమెనే!

ఆనందంలో దేవునికి కృతజ్ఞతలు అర్పించింది. బాధలో దేవునిపై నమ్మకాన్ని కోల్పోలేదు. తన హృదయం కత్తితో పొడిచినట్లుగా వేదనను అనుభవించినా, విశ్వాసంలో నిలిచింది. మరియమాత జీవితం మనకు నేర్పేది ఇదే: దేవుని చిత్తాన్ని అంగీకరించడం అంటే కష్టాలు లేని జీవితాన్ని పొందడం కాదు; కష్టాల మధ్య కూడా దేవుని ప్రేమపై నమ్మకంతో నిలబడటం!

మరియమాత- స్త్రీతత్వానికి గౌరవం, మాతృత్వానికి మాధుర్యం, వినయానికి ప్రతిరూపం, విశ్వాసానికి సజీవ సాక్ష్యం!

ఈనాటి తల్లులు మరియమాతలో మాతృత్వపు ఆదర్శాన్ని చూడాలి. యువత ఆమె ధైర్యాన్ని, పవిత్రతను నేర్చుకోవాలి. కుటుంబాలు ఆమె ప్రార్థనా జీవితాన్ని అనుసరించాలి. ప్రతి క్రైస్తవుడు ఆమెవలె క్రీస్తుకు తన హృదయంలో స్థానం కల్పించాలి.

మరియమాతను నిజంగా గౌరవించడం అంటే ఆమెను స్తుతించే మాటలతోనే ఆగిపోవడం కాదు; ఆమె చూపించిన క్రీస్తు మార్గంలో నడవడం. ఆమె కానాలో సేవకులతో చెప్పిన మాటలు నేటికీ మన ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి:

*“ఆయన మీతో చెప్పునది చేయుడి.”*
- యోహాను సువార్త 2:5

ఈ మాటలే మరియమాత భక్తి యొక్క అసలైన సారాంశం. ఆమె మనలను తనవైపు మాత్రమే ఆకర్షించదు; తన కుమారుడైన యేసుక్రీస్తు వైపు నడిపిస్తుంది. ఆమె జీవితాన్ని ధ్యానించినప్పుడు, దేవుని వాక్కును వినడం, దానిని విశ్వసించడం, ఆచరణలో పెట్టడం నేర్చుకుంటాము.

ప్రియమైన సహోదరి సహోదరులారా!

జీవితపు కల్వరి మార్గంలో కన్నీళ్లు ఎదురైనప్పుడు… మన ప్రార్థనలకు సమాధానం ఆలస్యమైనప్పుడు… మన ఆశలన్నీ సిలువపై వేలాడుతున్నట్లు అనిపించినప్పుడు… మరియమాత విశ్వాసాన్ని గుర్తుచేసుకుందాం.

మన జీవితంలో తుఫానులు సంభవించ వచ్చు. మన హృదయాలు వేదనతో నిండిపోవచ్చు. మన భవిష్యత్తు చీకటిగా కనిపించవచ్చు. అయినప్పటికీ, దేవుని చిత్తంపై విశ్వాసంతో నిలబడితే, మన బలహీనతల మధ్య కూడా ఆయన కార్యం కొనసాగుతుంది.

దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్న ఒక వినయపూర్వక హృదయం, తరతరాలకు విశ్వాస దీపంగా నిలవగలదు!

మరియమాతా! మా కన్నీళ్లలో ఓదార్పుగా, మా సందేహాల్లో విశ్వాసంగా, మా కుటుంబాలకు ప్రార్థనా బలంగా నిలిచి, నీ కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరకు మమ్మల్ని నడిపించుము. మా జీవితాలు దేవుని చిత్తానికి అనుగుణంగా మారేలా మాకు సహాయం చేయుము.

ఆమేన్!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN