“కపటత్వమనే పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడుడి!”

ప్రసాద్ గార్లపాటి
15 Oct 2026
“కపటత్వమనే పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడుడి!”
లూకా 12:1–7
ప్రియమైన సహోదరీ సహోదరులారా!
యేసుప్రభువు ఈ సువార్తలో మనకు ఒక గంభీరమైన ఒక హెచ్చరిక చేస్తున్నాడు: పరిసయ్యుల కపటత్వమనే పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడండి.
పులిసిన పిండి కొద్దిగా ఉన్నా, అది మొత్తం పిండిని పాడు చేస్తుంది. అలాగే మన హృదయంలో దాగి ఉన్న కపటం కూడా మన ఆలోచనలను, మాటలను, ప్రవర్తనను నెమ్మదిగా పాడు చేస్తుంది.
మనుషుల ముందు మంచివారిగా కనిపించడం ఒకటి; దేవుని ముందు నిజాయితీగా జీవించడం మరొకటి!
1. బయట పవిత్రత… లోపల కపటత్వమా?
మనుషులు మన ప్రార్థనలను చూడవచ్చు. మన భక్తిని ప్రశంసించవచ్చు. మనం చర్చికి వెళ్లడాన్ని గమనించవచ్చు. కానీ మన హృదయంలో ఏముందో దేవునికి తెలుసు.
మన పెదవులపై ప్రార్థన ఉండి, హృదయంలో ద్వేషం ఉంటే ఏమిటి ప్రయోజనం?
మన మాటల్లో భక్తి ఉండి, మన ప్రవర్తనలో అహంకారం ఉంటే ఏమిటి ప్రయోజనం?
ఇతరులకు నీతిని బోధిస్తూ, మన తప్పులను దాచిపెడితే ఏమిటి ప్రయోజనం?
యేసుప్రభువు మనలను అవమానించడానికి కాదు, మన అంతరంగాన్ని శుద్ధి చేయడానికి ఈ మాటలు చెబుతున్నాడు.
మన తప్పులను అంగీకరించడం బలహీనత కాదు. దేవుని ముందు నిజాయితీగా నిలబడటమే నిజమైన ఆధ్యాత్మిక బలం.
2. దాచినది వెలుగులోకి వస్తుంది!
యేసుప్రభువు ఇలా బోధిస్తున్నాడు: దాచబడినది ఏదీ చివరికి తెలియకుండా ఉండదు (లూకా 12:2–3).
మనుషుల కళ్లకు కనిపించకుండా మనం కొన్ని విషయాలను దాచవచ్చు. మన మాటలతో ఇతరులను నమ్మించవచ్చు. మన నిజమైన ఉద్దేశాలను బయటపడకుండా ఉంచవచ్చు.
కానీ దేవుని ముందు మన జీవితం తెరిచిన పుస్తకం వంటిది.
మనుషులు మనల్ని చూస్తున్నప్పుడు ఎలా ఉంటున్నాం అన్నదానికంటే, ఎవరూ చూడనప్పుడు ఎలా జీవిస్తున్నాం అన్నదే మన ఆత్మపరిశీలనకు ముఖ్యం?
ఎవరూ చూడనప్పుడు నిజాయితీగా ఉండటం, ఎవరికీ తెలియకుండా మంచి చేయటం, తప్పు చేసినప్పుడు దానిని అంగీకరించడం ఇవే మన విశ్వాసానికి నిజమైన పరీక్షలు.
3. మనుషులకు భయపడుతున్నామా? దేవునిపై విశ్వాసం ఉంచుతున్నామా?
యేసుప్రభువు తన శిష్యులకు మనుషుల బెదిరింపులకు అతిగా భయపడవద్దని బోధిస్తున్నాడు (లూకా 12:4–5).
కొన్నిసార్లు మనుషులు ఏమనుకుంటారోనని మనం సత్యం మాట్లాడటానికి భయపడతాం. ఇతరులు మనల్ని అంగీకరించరేమోనని మన విశ్వాసాన్ని దాచిపెడతాం. మనకు నష్టం కలుగుతుందేమోనని సరైన నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడతాం.
కానీ క్రైస్తవ జీవితం మనుషుల ప్రశంసల కోసం జీవించడం కాదు; దేవుని చిత్తానికి నమ్మకంగా ఉండటం.
అయితే ఈ బోధన ఇతరుల పట్ల నిర్లక్ష్యంగా ఉండమని కాదు. దేవునిపై విశ్వాసంతో, వివేకంతో, ప్రేమతో సత్యం కోసం నిలబడమని పిలుపు.
లోకం మనల్ని ఎలా చూస్తుందో అన్న భయం కంటే, దేవుని ముందు మనం ఎలా జీవిస్తున్నామో అన్న ఆత్మపరిశీలన చేసుకోవాలి.
4. నీ జీవితాన్ని దేవుడు మరచిపోలేదు!
ఈ సువార్తలో యేసుప్రభువు పిచ్చుకల గురించి మాట్లాడుతున్నాడు. వాటిలో ఒక్కటిని కూడా దేవుడు మరచిపోడు. మన తలవెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయని ఆయన చెబుతున్నాడు (లూకా 12:6–7).
ఎంత అద్భుతమైన దేవుని ప్రేమ!
ప్రపంచానికి నువ్వు సాధారణ వ్యక్తివి కావచ్చు. నీ కష్టాలను ఎవరూ గుర్తించకపోవచ్చు. నీ కన్నీళ్లను ఎవరూ చూడకపోవచ్చు. నీ మంచితనాన్ని ఎవరూ ప్రశంసించకపోవచ్చు.
కానీ దేవుని దృష్టిలో నీ జీవితం విలువైనది.
ఈ సువార్త మనకు కేవలం హెచ్చరికను మాత్రమే ఇవ్వటం లేదు. గొప్ప ధైర్యాన్ని కూడా ఇస్తుంది.
కపటత్వాన్ని విడిచిపెట్టి నిజాయితీగా జీవించమని పిలుస్తూనే, భయపడకుండా దేవునిపై విశ్వాసం ఉంచమని ఆహ్వానిస్తుంది.
మనుషుల ప్రశంసలు తగ్గినా నిరాశపడకు. నీ నిజాయితీని ఎవరూ గుర్తించకపోయినా మంచిని విడిచిపెట్టకు. దేవుని ప్రేమలో నీ విలువను గుర్తించు.
“మనుషుల కళ్లకు కనిపించే నీ రూపం కంటే, దేవుని ముందు నీ హృదయంలో ఉన్న నిజాయితీ ముఖ్యం. నీ జీవితాన్ని దేవుని ప్రేమకు, సత్యానికి సాక్ష్యంగా మార్చుకో!” ఆమెన్.
