పునీత అవిలాపురి తెరేసమ్మ స్మరణ - అక్టోబర్ 15

సిస్టర్ A. రాజకుమారి (CSA)

14 Oct 2026

అక్టోబర్ 15
పునీత అవిలాపురి తెరేసమ్మ స్మరణ
................................................
పునీత అవిలాపురి తెరేసమ్మ ఆధ్యాత్మిక జీవిత యాత్ర - నేటి క్రైస్తవులకు చక్కని ఆదర్శం

శ్రీసభ పునీతులమయం. ఎంతోమంది ప్రభువుని విశ్వసించి, ప్రభు బాటలో పయనించి, ప్రభు నిమిత్తమై జీవించి, మరణించిన వారు పునీతుల స్థానంలో నిలిచి ఉన్నారు.వారిలో చిరస్థాయిగా నిలిచిన వారు కొందరైతే, ఆ చిరస్థాయిగా నిలిచిన వారిలో నిత్యము జ్ఞాపకములో ఉండేవారు కొలదిమంది.ఆ కొలదిమందిలో ఒకరు పునీత యేసు తెరేసమ్మ. ఆమెనే పునీత అవిలాపురి తెరేసమ్మ అని కూడా శ్రీసభ సంబోధిస్తుంది .స్పెయిన్ దేశంలో ఒక ధనిక కుటుంబములో ప్రియమైన కుమార్తెగా జన్మించి కుటుంబ ప్రేమను ఎంతో గొప్పగా అందుకొని భోగలాలసములకు అలవాటు పడి,తన యొక్క తండ్రి చిత్తం ప్రకారము జీవితాన్ని స్వీకరించిన ఒక కన్యక పునీత అవిలాపురి తేరేసమ్మ.తన యొక్క మఠవాసి జీవిత ప్రయాణంలో రెండు దశాబ్దాల పాటు ప్రార్ధన లేమితో బాధపడింది.ప్రార్థన అంటే అనాసక్తి కనపరిచింది.ప్రార్థన లేని జీవితాన్ని జీవించి తన యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నాననే ఆలోచనతో సతమతమయింది.ఆ సమయంలో ఆమె మదిలో మెదిలిన ఒక ఆలోచన “నేను దీనికేనా!” ప్రాపంచికపు విలువలకు దూరమై మఠవాస జీవితాన్ని అంగీకరించింది? అని తనను తాను ప్రశ్నించుకోవడం ప్రారంభించింది.అలా ప్రశ్నించుకోవడం ప్రారంభించిన ఆమె ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చి, ధ్యానానికి సమయాన్ని ఇచ్చి, ధ్యానమనన ప్రార్థనలు ద్వారా ఒక సిద్ధహస్తురాలుగా,ప్రార్ధనా తపస్విగా ఇతరులకు ప్రార్ధన నేర్పే ఒక ఋషిగా ఆమె ఎదిగింది. ప్రార్థన అనేది మన జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక సాధనం.ప్రార్థన ఆత్మకు జీవనాధారం,ఇది దేవునితో జరిపే దివ్య సంభాషణ.ప్రార్ధన మనలను మారుస్తుంది,స్వస్థత కలిగిస్తుంది, సృష్టికర్తతో మరింత సన్నిహితం చేస్తుంది.ప్రార్థన అనేది కేవలం పదాల వాక్యరూపం కాదు;దేవునితో ఐక్యతకు చేరవేసే శక్తివంతమైన సాధనం అని ఈ పునీతురాలు తన జీవితం విధానం ద్వారా తెలియజేశారు . ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న ఆమె పేరు పండుగను కొనియాడుతున్న తరుణంలో ప్రార్ధనకు పునీత అవిలాపురి తెరేసమ్మ గారిచ్చిన ప్రాముఖ్యతను మరొక్కసారి ధ్యానించుకునే అవకాశం మనకు వచ్చింది.

ప్రార్థనతో కష్టాలను అధిగమించిన తెరేసమ్మ విశ్వాసం
.............................................
ఆవిలాపురి తెరేసమ్మ, ప్రార్థన శక్తిని గాఢంగా విశ్వసించేవారు. ఒకసారి, ఆమె ఒక కొత్త కాన్వెంట్ స్థాపించడానికి ప్రయాణం చేస్తూ ఒక పెద్ద సవాలును ఎదుర్కొన్నారు.ఆ ప్రయాణం చాలా కష్టమైనది,వాతావరణం కూడా చాలా ప్రతికూలంగా ఉండింది.ఆమె ప్రయాణిస్తున్న గుర్రపు బండి కఠినమైన మార్గంలో ముందుకు సాగుతుండగా,గుర్రం మోకాళ్లతో తూలిపోయి,వర్షం కారణంగా బండి బురదలో పడిపోయింది. తడిసి,దెబ్బలు తిన్నప్పటికీ, తెరేసమ్మ మనోధైర్యాన్ని కోల్పోలేదు.ఆ సమయంలో ఆమె దేవుని వైపు చూసి నవ్వుతూ "నీ ప్రియమైన స్నేహితులను, నీ కోసం సేవచేసే వారిని ఇలా ఇబ్బంది పెడితే, నీకు తక్కువ మంది స్నేహితులు ఉంటారని అర్థమవుతోంది!" అని అన్నారు. ఆమె ఈ సరదా ఫిర్యాదు చేసినా, తన ప్రయాణాన్ని ఆపలేదు.కష్టాలు,అవాంతరాలు ఆమెను భయపెట్టలేదు.ప్రార్థన ద్వారా,ఆమె తాను ఎదుర్కొంటున్న అన్ని ఇబ్బందులను అధిగమించేందుకు అవసరమైన ధైర్యాన్ని పొందారు. ఆ కష్టాలు ఆమె విశ్వాసాన్ని కదిలించలేదు;ఆమె కష్టాలను దేవునితో మరింత సన్నిహితమవ్వడానికి అవకాశాలుగా వాడుకున్నారు. దీని ద్వారా ప్రార్థన మన జీవితంలో ఎంత ముఖ్యమైందో, మరియు కష్టాలను ఎలా అధిగమించగలదో మనకు తెలియజేస్తుంది.

ఆధ్యాత్మిక యాత్రలో ఏడు దశల సత్యం: దేవుని (రాజు కోటను) చేరే మార్గం
.....................................
ఆవిలాపురి తెరేసమ్మ గారు ఆధ్యాత్మిక జీవిత యాత్రను ఏడు దశలుగా వర్ణించారు.ఆత్మను ఒక దుర్గము లేక కోటతో పోలుస్తుంది. కోట మధ్యలో సూర్యునివలే ప్రకాశిస్తూ ప్రభువు వాసం చేస్తుంటారు.ఆయనను చేరాలంటే ఒక అంతరంగిక యాత్రను ప్రారంభించాలి.ఆ కోట వెలుపలి ద్వారము నుండి ఆయనను చేరే దారిలో ఏడు వలయాలుంటాయి. ప్రభుని చేరాలంటే మనిషి ఈ ఏడు వలయాలను లేక గదులను దాటి వెళ్ళాలి.ప్రార్థనాభ్యాసం, పుణ్యాచరణ ద్వారా ఇది సాధ్యమౌతుందని తెలుపుతూ, ఈ రాజుకోటను ఆధారముగా తీసుకోని ప్రార్ధనలో వున్న ఏడు ముఖ్యదశలను తెలియపరిచారు. రాజుగారి కోటను దేవుడు నివసించే ఆలయముగా అనుకొని ఆయనను సమీపించాలి అంటే ఈ ఏడు దశల ప్రార్ధనతోనే ఆ దేవుణ్ణి చేరగలమని వివరించింది .ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఏడు దశలు మన మనోచింతనలను, ఆత్మను, మరియు ప్రవర్తనలను మారుస్తాయి.అవిలాపురి తెరేజమ్మ మనకు ప్రతి దశలో దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని ఎలా పొందాలో చక్కగా వివరించారు
ఈ చిన్ని సందేశంలో ఆమె శ్రీసభకు నేర్పిన ప్రార్థనా జీవిత పరమార్ధాన్ని హృదయపు కోటలో ఉన్న ప్రభువుని చేరుకొనుటలో ఒక ఆత్మ చేయవలసిన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ధ్యానించుకుందాం.ప్రభువుని చేరాలనే కోరిక కలవారు ఈ ఏడు ప్రార్ధన మార్గాలలో ప్రయాణం చేసి ఒక్కొక్క మార్గంలో, ఆధ్యాత్మిక జీవితంలో, ప్రార్థన జీవితంలో ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ఆ ప్రభువుని ఆంతరంగిక మందిరంలో ప్రవేశించే మార్గాలే ఈ ఏడు ప్రార్ధనా మార్గాలు.
1. పెదవులతో చేసే ప్రార్థన (Vocal Prayer):
ఈ దశలో, మనం భౌతికంగా దేవునికి ప్రార్థన చేస్తాం. ఇది మాటల ద్వారా జరిగే ప్రార్థన, ఇది మన హృదయాన్ని దేవుని వైపు తిప్పుతుంది. ఈ ప్రార్థన సాధారణంగా ప్రార్థనా పుస్తకాలు, విధివిధానాల ద్వారా లేదా మన హృదయంలోని మాటల ద్వారా చేయబడుతుంది. ఈ దశలో మనం బాహ్య ప్రపంచంలో ఉన్నా, మన హృదయాన్ని ఆధ్యాత్మికత వైపు తిప్పటానికి ఇది ఒక ఆరంభం.ఇందులో మనం ఆత్మను ఇంకా పూర్తిగా దేవునికి అప్పగించకపోయినా, ఆత్మ దేవుని వైపు ఒక అడుగు వేస్తుంది.

2. ధ్యాన ప్రార్థన (Prayer of Recollection): ఈ దశలో భక్తులు తమ జీవితంలో దేవుని పట్ల మరింత కృషి చేయడం ప్రారంభిస్తారు. ధ్యాన ప్రార్థన అంటే మనస్సును శాంతపరిచి, దేవుని వైపు దృష్టి సారించడం. ఈ దశలో భక్తులు తమ ఆత్మను బాహ్య వస్తువుల నుండి ప్రక్కకు తిప్పి , దేవుని వైపు మరలుతారు. ఈ దశలో, భక్తులు సాధారణ ప్రార్థనలతో పాటు, తమ ఆత్మను పరిశీలించడానికి ప్రయత్నిస్తారు. తెరిసా ప్రకారం, భక్తులు ఈ దశలో ఏకాగ్రతను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలి. ధ్యాన ప్రార్థనలో మనస్సు, హృదయం శాంతిలోకి వెళుతుంది. ఇది దేవుని సన్నిధిలో మన ఆత్మను తాకినప్పుడు కలిగే ఓ అంతరంగ అనుభూతి. ఈ దశను తెరిసా, ఆత్మ ఆధ్యాత్మికతలో ప్రవేశించే ఒక కీలకమైన ఘట్టంగా పేర్కొన్నారు.ఈ దశలో మనస్సు ఆలోచనల నుండి ప్రశాంతత కోసం వెదుకుతుంది. దేవునిపై ధ్యానం, ఆత్మను నిగ్రహించుకోవడం ఈ దశలో జరుగుతుంది. దీని ద్వారా మనం అంతరంగిక శాంతిని పొందగలుగుతాం.

3. నిశబ్ధ ప్రార్థన (Prayer of Quiet): నిశబ్ధ ప్రార్థన" అంటే ఆత్మ పూర్తిగా దేవుని ప్రేమలో నిమగ్నమైపోవడం. ఈ దశలో, ప్రార్ధనను ఆటంక పరచే శబ్దాలు, ఆలోచనలు అన్నీ ఆగిపోతాయి. మనస్సు పూర్తిగా నిశ్చలమై, దేవుని ప్రేమ సృష్టించే ప్రశాంతతను అనుభవిస్తుంది.నిశబ్ధంలో దేవునితో మనసు మరింత సన్నిహితమవుతుంది. మన ఆత్మ ఒక చంటిబిడ్డ తల్లి స్తన్యమును సేవించేటప్పుడు అనుభవించే ప్రశాంతతను పొందినట్లుగా, ఈ దశలో మన ఆత్మ దేవుని ప్రేమలో విశ్రాంతి తీసుకుంటుంది.

4. ఆధ్యాత్మిక నిశ్చితార్థం (Spiritual Betrothal): ఈ దశలో, ఆత్మ దేవునితో ఒక ప్రత్యేకమైన ఆత్మీక బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ దశను "ఆధ్యాత్మిక నిశ్చితార్థం" అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ఆత్మ మరియు దేవుని మధ్య జరిగే ఒక గాఢమైన బంధం. ఈ దశను తెరేజమ్మ వివాహం ముందు జరిగెటువంటి ప్రధాన ఉత్సవంతో పోలుస్తుంది. వివాహంలో ప్రవేశించే ముందు యువతి, యువకులు ఒకచోట చేరి తమ ఆశలను, ఆకాంక్షలను ఒకరితో ఒకరు పంచుకొంటు ఆ మధుర క్షణాలను ఆస్వాదిస్తారో అటువంటి అనుభూతి పరమాత్మునకు, జీవాత్మకు మధ్య జరుగుతుంది. ఈ స్థితిలో పరమాత్ముడు ఆ ఆత్మను తనవైపు గాఢంగా ఆకర్షిస్తాడు. ఈ దశలో, భక్తులు తమ మనస్సును మరియు హృదయాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేస్తారు.

5. రూపాంతర ఐక్యతా ప్రార్థన (Prayer of Transforming Union): ఈ దశలో, ఆత్మ పూర్తిగా దేవునితో ఐక్యమవుతుంది. ఇది భక్తుడి ఆత్మ మరియు దేవుని మధ్య ఏర్పడే ఒక అంతరంగ అనుభవం, ఇందులో భక్తుడు తన ఆత్మను, తన హృదయాన్ని మరియు తన జీవితాన్ని పూర్తిగా దేవుని ప్రేమలో నిలుపుకుంటాడు. పునీత తెరేజమ్మ ప్రకారం, ఈ దశలో ఆత్మ దేవుని కృపతో పరిపూర్ణంగా ఐక్యమవుతుంది, దాంతో భక్తుడు ఒక రూపాంతర అనుభవాన్ని పొందుతాడు.

6. వేదన మరియు విరక్తత్వ ప్రార్థన (Prayer of Suffering and Detachment): ఈ దశను తెరిసా "ఆత్మీక ఆరాధన" (Spiritual Mortification) అని పేర్కొన్నారు. ఈ దశలో, ఆత్మ తన భౌతిక సంబంధాల నుండి మరియు తన స్వార్థ కాంక్షల నుండి విడిపోతుంది. భక్తుడు తన జీవితంలో ఉన్న అన్ని అనుబంధాలనూ విడిచిపెట్టి, తన ఆత్మను దేవుని ప్రేమలో నిమగ్నం చేస్తాడు. ఈ దశలో, ఆత్మ విరక్తత సాధించి, దేవుని ప్రేమలో గాఢమైన అనుభవాన్ని పొందుతుంది.

7. త్యాగమయ మరియు సమర్పణ ప్రార్థన (Prayer of Abandonment and Surrender): చివరి దశను పునీత తెరేజమ్మ "పరిపూర్ణ సమర్పణ" (Perfect Surrender) అని పేర్కొన్నారు. ఈ దశలో, భక్తులు తన ఆత్మను పూర్తిగా దేవుని ప్రేమలో నిమగ్నం చేస్తారు. తమ జీవితాన్ని మరియు ఆత్మను పూర్తిగా దేవుని ఇష్టానికి సమర్పిస్తారు.ఈ స్థితిలో భక్తులు దైవానుగ్రహంలో తేలియాడుతారు, వారి ఆత్మ అనుభవించే ప్రశాంతత మరియు ఆనందం వర్ణించలేనివి. ఆత్మ పూర్తిగా దేవుని దయలోఉంటుంది .వ్యక్తిగత ఆశలు, భయాలు వదిలించుకొని, త్యాగ క్రియలతో దేవుని ప్రణాళికకు శరణాగతి చేస్తుంది. దీని ద్వారా మనం దేవుని పరమానందంలో శాంతిని పొందుతాము.అవిలాపురి తెరేజమ్మ గారి ఆధ్యాత్మిక యాత్ర - ప్రార్థన ద్వారా దేవునితో ఐక్యతకై స్ఫూర్తిదాయక మార్గం పునీత అవిలాపురి తెరేజమ్మ గారి ఆధ్యాత్మిక యాత్ర మనందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన ఆదర్శం. ఆమె జీవితమంతా ప్రార్థనలో గడిపి, కష్టసమయంలోను, సంతోష సమయంలోను దేవునితో సన్నిహిత సంబంధం నెలకొల్పింది. ఆమె చూపిన ఈ ఏడు దశలు మన జీవితంలో కూడా ప్రార్థనకు ప్రాముఖ్యతను, మన ఆత్మను దేవునితో ఏకీకృతం చేసుకునే సాధనాలను నేర్పిస్తాయి.ఈ దశలు మనల్ని మనోపరివర్తనకు, పవిత్రతకు, ప్రశాంతతకు, మరియు దేవుని ప్రేమలో మరింతగా దగ్గర కావడానికి సహాయపడతాయి.అందువలన, ఆమె చూపిన ఈ మార్గాలను అనుసరిస్తూ, మన జీవితంలో ప్రార్థనకు ప్రాధాన్యం ఇచ్చి, మన ఆత్మను దేవునితో సన్నిహితంగా కలుపుకోవడానికి మనమందరము కృషి చేయాలి. ఈ ఆధ్యాత్మిక యాత్ర ద్వారా మనము దేవుని సమీపాన ఉండి , ఆయన ప్రేమలో జీవించి, శాంతిని, ఆనందాన్ని మన హృదయాల్లో పొందుపరచుకోవాలని మనమందరం కోరుకుందాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN