పరిసయ్యులు – సద్దూసయ్యులు

ప్రసాద్ గార్లపాటి
12 Oct 2026
ప్రియమైన సహోదరీ సహోదరులారా!
పవిత్ర బైబిలు పుటలను మనం ధ్యానించినప్పుడు, యేసు ప్రభువు బోధనల చుట్టూ తరచుగా కనిపించే రెండు సమూహాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. వారే పరిసయ్యులు, సద్దూసయ్యులు. ఒకవైపు ధర్మశాస్త్రాన్ని నిష్ఠతో ఆచరించాలని తపించిన పరిసయ్యులు; మరోవైపు యెరూషలేము దేవాలయ వ్యవస్థలో విశేష ప్రభావాన్ని కలిగివున్న సద్దూసయ్యులు. వీరి విశ్వాసాలు, ఆచారాలు, అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, యేసు ప్రభువు దివ్యబోధనల సందర్భంలో వీరి పాత్ర బైబిలులో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
పరిసయ్యులు దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రజల దైనందిన జీవితంలో ఆచరించడానికి ప్రాధాన్యమిచ్చేవారు. ప్రార్థన, ఉపవాసం, శుద్ధి నియమాలు, సబ్బాతు ఆచరణ వంటి అంశాలను శ్రద్ధగా పాటించేవారు. లిఖిత ధర్మశాస్త్రంతో పాటు పూర్వీకుల మౌఖిక సంప్రదాయాలకు కూడా ప్రాముఖ్యతనిచ్చేవారు. మృతుల పునరుత్థానాన్ని, దేవదూతల ఉనికిని విశ్వసించేవారు. అయితే, వారిలో కొందరు బాహ్య ఆచారాలకు అధిక ప్రాధాన్యమిస్తూ, ధర్మశాస్త్రంలోని న్యాయం, కనికరం, ప్రేమ వంటి ప్రధాన విలువలను నిర్లక్ష్యం చేశారు.
అటువంటి సందర్భాలలో యేసు ప్రభువు వారి హృదయాలను పరిశీలించమని పిలిచాడు. ధర్మశాస్త్రాన్ని పాటించడం మంచిదే, కానీ దాని వెనుక ఉన్న దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోవడం మరింత ముఖ్యమని బోధించాడు. మత్తయి 23:23లో న్యాయం, కనికరం, విశ్వాసం ధర్మశాస్త్రంలోని ప్రధాన విషయాలని గుర్తుచేశాడు. అయినప్పటికీ పరిసయ్యులందరూ యేసును వ్యతిరేకించలేదు. నికొదేము వంటి వ్యక్తులు ఆయనను సమీపించి ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించారు (యోహాను 3:1–21).
ఇక సద్దూసయ్యులు యూదుల మతజీవితంలో, ముఖ్యంగా యెరూషలేము దేవాలయ వ్యవస్థలో ప్రభావవంతులుగా ఉన్నారు. ప్రధాన యాజక కుటుంబాలతో, ఉన్నత వర్గాలతో వారికి సంబంధం ఉండేది. లిఖిత ధర్మశాస్త్రానికి ప్రాధాన్యమిస్తూ, పరిసయ్యులు అనుసరించిన మౌఖిక సంప్రదాయాలకు అదే విధమైన అధికారాన్ని అంగీకరించలేదు. ముఖ్యంగా మృతుల పునరుత్థానాన్ని వారు తిరస్కరించారు. అపొస్తలుల కార్యములు 23:8 ఈ విశ్వాసభేదాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.
ఒక సందర్భంలో సద్దూసయ్యులు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి పునరుత్థానం గురించి ప్రశ్నించారు. ఏడుగురు సహోదరులను వరుసగా వివాహం చేసుకున్న ఒక స్త్రీ ఉదాహరణను ప్రస్తావిస్తూ, పునరుత్థానంలో ఆమె ఎవరి భార్య అవుతుందని అడిగారు. యేసు ప్రభువు వారి ప్రశ్నకు సమాధానమిస్తూ, పునరుత్థాన జీవితాన్ని భూలోక జీవితంలోని సంబంధాలతో పూర్తిగా పోల్చలేమని వివరించాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన ప్రభువు జీవులకు దేవుడని బోధించాడు (మార్కు 12:18–27).
ఈ సంఘటనలో క్రీస్తు ప్రకటించిన సత్యం ఎంతో గంభీరమైనది. మానవ జ్ఞానానికి పరిమితులు ఉన్నప్పటికీ, దేవుని శక్తి అపరిమితమైనది. మరణమే అంతిమమని భావించే మానవ దృష్టికి భిన్నంగా, క్రైస్తవ విశ్వాసం క్రీస్తు పునరుత్థానం ద్వారా నిత్యజీవ నిరీక్షణను ప్రకటిస్తుంది.
ప్రియమైన విశ్వాసులారా! పరిసయ్యులు, సద్దూసయ్యుల చరిత్రను పరిశీలించడం ద్వారా మనం ఇతరులను తీర్పు తీర్చడం కంటే, మన స్వంత ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలించుకోవాలి. మనం జపమాల ప్రార్థన చేస్తున్నామా? దివ్యబలిలో పాల్గొంటున్నామా? పవిత్ర సంస్కారాలను స్వీకరిస్తున్నామా? ఇవన్నీ ముఖ్యమైనవే. అయితే, మన ప్రార్థన మనలో ప్రేమను పెంచుతోందా? మన భక్తి పేదల పట్ల కనికరంగా మారుతోందా? మన విశ్వాసం క్షమాగుణాన్ని, సేవాభావాన్ని పెంపొందిస్తోందా? అనే ప్రశ్నలకు కూడా సమాధానం వెదకాలి.
ఎందుకంటే, క్రైస్తవ జీవితం బాహ్య ఆచారాలతో మాత్రమే పరిపూర్ణం కాదు. అది క్రీస్తు ప్రేమతో అంతరంగాన్ని నూతనీకరించుకోవడంలో, దేవుని వాక్యాన్ని జీవితంలో ఆచరించడంలో, బాధితులకు సేవ చేయడంలో పరిపూర్ణతను పొందుతుంది. పరిసయ్యుల చరిత్ర మనకు అంతరంగ పవిత్రతను గుర్తుచేస్తే, సద్దూకయ్యులతో జరిగిన సంభాషణ పునరుత్థాన విశ్వాసపు ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
కాబట్టి, మన భక్తి ప్రేమగా వికసించాలి; మన ప్రార్థన సేవగా రూపాంతరం చెందాలి; మన విశ్వాసం నిత్యజీవ నిరీక్షణతో బలపడాలి. ధర్మశాస్త్రంలోని దైవసంకల్పాన్ని గ్రహిస్తూ, పునరుత్థాన ప్రభువైన యేసుక్రీస్తుకు మన జీవితాల ద్వారా సాక్షులమవుదాం.
ఆమెన్!
