ఓటర్ల హక్కులను కాపాడాలి – ఎన్నికల సంఘానికి భారత కతోలిక పీఠాధిపతుల విజ్ఞప్తి

జోసెఫ్ అవినాష్
10 Oct 2026
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయనే వార్తలపై భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (CBCI) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.అర్హులైన ఏ ఓటరు కూడా తన రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును కోల్పోకూడదని ఎన్నికల సంఘాన్ని కోరింది.ఓటు హక్కును కోల్పోయే పరిస్థితులు సాధారణమైపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పీఠాధిపతులు హెచ్చరించారు.ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియ స్వేచ్ఛగా,నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని వారు స్పష్టం చేశారు.ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కాపాడటం ఎన్నికల సంఘం బాధ్యత అని పేర్కొన్నారు.ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న పౌరులకు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తూ,నిరసనకారులు ఎలాంటి హింసకు పాల్పడకుండా శాంతియుతంగా తమ ఆందోళనలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో దేశం కోసం ప్రార్థించాలని పీఠాధిపతులు పిలుపునిచ్చారు.
