విశ్వాస ప్రయాణంలో ప్రశ్నలు వేయడం ఎంతో అవసరం: పోప్
జోసెఫ్ అవినాష్
09 Oct 2026
2026 అక్టోబర్ 8న రోమ్‌లోని పాంటిఫికల్ విశ్వవిద్యాలయాల నూతన విద్యా సంవత్సర ప్రారంభం సందర్భంగా పోప్ లియో XIV సెయింట్ పీటర్స్ బసిలికాలో దివ్యబలిపూజను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు, అధ్యాపకులు తమ అధ్యయనాన్ని విశ్వాసానికి, సత్యానికి సేవగా భావించాలని పిలుపునిచ్చారు. దేవుని వాక్యం, క్రైస్తవ సంఘ సంప్రదాయాల వెలుగులో ప్రశ్నలు వేయడం, వాటికి సమాధానాలను అన్వేషించడం క్రీస్తును అనుసరించే విశ్వాస ప్రయాణంలో ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. విద్య అనేది కేవలం జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే పరిమితం కాకుండా, ఇతరులకు సేవ చేయడానికి ఉపయోగపడాలని సూచించారు. విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను తీవ్రవాద ధోరణుల వైపు నడిపించే తప్పుడు బోధకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విద్యార్థులు పరస్పరం స్నేహాన్ని పెంపొందించుకోవాలని, వివిధ దేశాలు, సంస్కృతులకు చెందిన వారితో తమ అనుభవాలను పంచుకోవాలని కోరారు. విద్యావకాశాలు లభించని వారికి సహాయం చేస్తూ, విద్య ద్వారా సమాజానికి మేలు చేయాలని పిలుపునిచ్చారు. జ్ఞానం, విశ్వాసం, సోదరభావం కలిసినప్పుడే విద్య మానవాళి అభివృద్ధికి, క్రైస్తవ సేవకు దోహదపడుతుందని పోప్ తన సందేశంలో వివరించారు.
