సత్యం, ప్రేమ, శాంతి వైపు మానవాళిని నడిపించాలి: పోప్

జోసెఫ్ అవినాష్
08 Oct 2026
పోప్ లియో XIV అక్టోబర్ 7న జరిగిన సాధారణ ప్రేక్షకుల సమావేశంలో Gaudium et Spes పత్రం ఆధారంగా సమకాలీన ప్రపంచంలో కతోలిక సంఘం నిర్వహించాల్సిన బాధ్యతను వివరించారు.మనిషి జీవితానికి సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలను చూపించడం శ్రీసభ ప్రధాన కర్తవ్యమని అన్నారు. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, జీవితానికి అర్థం ఏమిటి, బాధలు ఎందుకు వస్తాయి, మన గమ్యం ఏమిటి వంటి ప్రశ్నలకు క్రీస్తులోనే నిజమైన సమాధానం లభిస్తుందని ఆయన గుర్తుచేశారు. భౌతిక సుఖాలు, వినియోగమే జీవితానికి పరమ లక్ష్యమనే భావనకు దూరంగా, ప్రతి మనిషి హృదయం దేవుని వైపు, సత్యం వైపు, ప్రేమ వైపు మళ్లేలా శ్రీసభ మార్గనిర్దేశం చేయాలని అన్నారు. అదే సమయంలో పేదలు, బలహీనులు, అణగారినవారి పట్ల శ్రద్ధ చూపుతూ న్యాయం, శాంతి, సోదరభావం నెలకొల్పేందుకు కృషి చేయడం కూడా శ్రీసభ బాధ్యత అని పేర్కొన్నారు. క్రైస్తవులు తమ విశ్వాసాన్ని మాటల్లో మాత్రమే కాకుండా కుటుంబంలో, ఉద్యోగంలో, సమాజంలో తమ జీవితం ద్వారా సాక్ష్యంగా చూపించాలని పోప్ పిలుపునిచ్చారు. వ్యక్తిగత పవిత్రత, సోదర ప్రేమ, సేవాభావం ద్వారా క్రీస్తు సువార్తను ప్రపంచానికి అందించడమే సమకాలీన ప్రపంచంలో శ్రీసభ యొక్క ముఖ్యమైన బాధ్యతని ఆయన స్పష్టం చేశారు.
