క్రీస్తులో ఒక్కటై… సువార్త సేవలో ఏకమై ముందుకు సాగుదాం” — పోప్
జోసెఫ్ అవినాష్
07 Oct 2026
2026 అక్టోబర్ 18న జరుపుకోనున్న వేద వ్యాపక ఆదివారం సందర్భంగా పోప్ లియో XIV ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.“క్రీస్తులో ఒక్కటై, సువార్తికరణలో ఏకమై” అన్న శీర్షికతో రూపొందించిన సందేశాన్ని ఆయన గుర్తుచేస్తూ,సువార్తను ప్రపంచానికి ప్రకటించే బాధ్యత ప్రతి క్రైస్తవునికి ఉందని ఆయన అన్నారు. జ్ఞాన స్నానం ద్వారా ప్రతి ఒక్కరూ క్రీస్తు శరీరంలో సభ్యులుగా మారుతున్నందున, క్రీస్తు రక్షణ సందేశాన్ని ఇతరులకు అందించడంలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన పాత్ర ఉందని పోప్ పేర్కొన్నారు.
తన చిన్ననాటి అనుభవాలను గుర్తుచేసుకున్న పోప్ లియో XIV, సువార్తికరణ కోసం చేసిన ప్రార్థనలు,వారి సేవకు అందించిన సహాయం తన విశ్వాస ప్రయాణంపై ఎంతో ప్రభావం చూపాయని తెలిపారు. ముఖ్యంగా పెరూలో తాను చేసిన మిషనరీ సేవలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసుల ప్రార్థనలు, సహకారం ఎంతో బలాన్నిచ్చాయని కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ, పేదలు మరియు అవసరాల్లో ఉన్నవారికి సేవ చేస్తున్న మిషనరీలకు కూడా మన ప్రార్థనలు, సహాయం అవసరమని ఆయన గుర్తుచేశారు.
