కవి సత్కారాలు!

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి
07 Oct 2026
కవి సత్కారాలు!
*****************
లోకల్ న్యూస్ ఐటమ్స్ తయారు చేస్తూ బిజీ గా ఉన్న ప్రెస్ రిపోర్టర్ రాజు ఫోన్ అదే పనిగా మోగుతుంటే,ఎవరో అనుకుని ఫోన్ తీసాడు.
"రాజు గారూ! నేను సీతా దేవిని. నా గురించి పేపర్లో ఒక న్యూస్ ఐటమ్ వేయాలి సార్" అన్న ఆమెతో
"మీరు టీచర్ గా రిటైర్ ఐనప్పుడే నేను మీ గురించి గొప్పగా పేపర్లో రాస్తే, అ-నుండి క్ష వరకు వరసగా రాయమంటే రాయలేక పోయినా పిల్లలకి అక్షరాలు దిద్దిస్తూ సర్వీసంతా గడిపిన సీతాదేవి టీచర్ గురించి అంత గొప్పగా రాశావు,ఎంత రొక్కం ముట్టిందిరా నీకంటూ చీవాట్లు పెట్టారు నా ఫ్రెండ్స్ ,కాదురా ఆమెకు బెస్ట్ టీచర్ అవార్డ్ కూడా వచ్చింది గదరా అంటే ఆ అవార్డులు ఎలా వస్తాయో తెలియనోడివి నువ్వేం రిపోర్టర్ విరా అంటూ తిట్టిపోశారు.ఇంకా మీ గురించి రాసి మళ్ళి తిట్లు తినమంటారా?"
" టీచర్ గా నా గొప్పతనం గురించి మళ్ళి రాయమంటం లేదండీ రాజుగారు, శతక్కవి సమ్మేళనంలో నాకు జరిగిన సత్కారం గురించి రాయమంటున్నా"
"ఏంటీ చెత్త కవి సమ్మేళనమా?"
"కాదండీ! శతక్కవి అంటే వంద కవులకు సన్మానం"
"అదేంటి, మీరు సత్కారాలు పొందేటంత కవి ఎప్పుడయ్యారు? మీరు కవితలు, రచనలు చేస్తారని ఇక్కడ ఎవరికీ తెలియదే? ఆ శతక్కవి సత్కారాలు చేసే వాళ్లకు ఎలా తెలిసిందబ్బా?"
"ఏముంది రాజు గారూ? రిటైర్ అయ్యాక బోర్ కొట్టకుండా ఉండడానికి వాళ్ళనీ వీళ్ళనీ చూసి fb లో ఏదో నాలుగక్షరాలు గీకడం మొదలెట్టా. తర్వాత,కవులు రచయితల పరిచయాలు చేస్తాం మాకు ఫోన్ చేసి వివరాలు పంపండి అనే వాళ్లందరికీ నా వివరాలు పంపితే వాళ్ళు నా గురించి బ్రహ్మాండంగా,నేనో గొప్ప కవయిత్రినంటూ వ్యాసాలు రాసి ప్రచురించారు."
"ఇంకేముంది , గిన్నిస్ బుక్ లో ఎక్కేలా వంద వందల కవి సమ్మేళనాలు జరపుతామంటూ సన్మానాలు జరపడమే పనిగా పెట్టుకున్న సంస్థలనుండి మీకు ఆహ్వానం వచ్చి ఉంటుంది.అంతేనా మేడం?"
"ఔనండీ! కవులకు,కవయిత్రులకు సన్మానాలు చేస్తాం, మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి అనే ప్రకటన చూసి అప్లై చేసా. వాళ్ళు పిలిచి మన జిల్లా కేంద్రంలో ఘనంగా సన్మానించి పంపారు. ఫోటోలు పంపుతా, మా శతక్కవి సత్కారం గురించి పేపర్లో వచ్చేలా చూడండి మీ రుణం ఉంచుకోను లెండి మరి" అని బతిమిలాడింది సీతాదేవి .
"సర్లే ,ఫోటోలు పంపండి చూద్దాం" అన్నాడు రాజు ఈమె లాంటి వాళ్ళను గొప్ప కవయిత్రులంటూ సన్మానాలు చేసేవి నిజంగా చెత్త కవి సమ్మేళనాలే మరి అని మనసులో అనుకుంటూ .
