జపమాల ప్రార్థన బైబిల్ లోనిదే ఇవిగో ఆధారాలు

జోసెఫ్ అవినాష్
06 Oct 2026
"జపమాల" అనే పదం మనకు బైబిల్లో కనిపించకపోవచ్చు కానీ జపమాలలో మనం ధ్యానించే ప్రతి దేవ రహస్యం బైబిలులో కనిపిస్తుంది.జపమాల ప్రార్థన పరిశుద్ధ గ్రంథం నుండి పుట్టిన పవిత్ర ప్రార్థన.జపమాల ప్రార్ధనలో మనం మూడే మూడు ప్రార్థనలు ఎక్కువగా ఉపయోగిస్తాం.అవి 1.పరలోక జపం (మత్తయి 6:9-13),ఇది క్రీస్తుప్రభువు స్వయంగా తన శిష్యులకు నేర్పిన ప్రార్థన.2.మంగళవార్త జపం (లూకా 1:28,42) ఇది దేవుని వద్ద నుంచి వచ్చిన గబ్రియేలు సన్మనస్కుని మాటలతోనూ, దేవుని ఆత్మ ప్రేరణం వల్ల పరవశం చెందిన ఎలిశబేతమ్మ కురిపించిన ప్రశంసలతోనూ అల్లిన ప్రార్థన.
3.త్రిత్వస్తోత్రం (మత్తయి 28:19)
ఈ ప్రార్థన కూడ యేసుప్రభుని మాటలనుంచే పుట్టింది.ప్రభువు తన శిష్యవర్గాన్ని భూదిగంతాలకు పంపుతూ : “మీరు వెళ్లి, ప్రపంచంలో ఉన్న అన్ని జాతులవారికి - పిత, పుత్ర, పవిత్రాత్మ పేరిట జ్ఞానస్నానం ఇవ్వండి" అని ఆదేశించాడు (మత్త 28 : 19).ఇవి మాత్రమే కాదు. జపమాల సమయంలో మనం ధ్యానించే 20 ప్రధాన ఘట్టాలు బైబిల్ లో మనకి కనిపిస్తాయి.జపమాలలో మొత్తం 20 గురుతులు.ఐదు సంతోష దేవరహస్యాలు,ఐదు దు:ఖ దేవరహస్యాలు,ఐదు మహిమ దేవరహస్యాలు మరియు ఐదు వెలుగు దేవరహస్యాలు.ఇవన్నీ మనకు బైబిల్లో కనిపిస్తాయి.
సంతోష దేవ రహస్యములు
1) గాబ్రియేలు సన్మనస్కుడు దేవమాతకు మంగళవార్త చెప్పుట (లూకా 1:26-38)
2) దేవమాత పునీత ఎలిజబేతమ్మను సందర్శించుట (లూకా 1:39-56)
3) యేసుక్రీస్తు పుట్టుకను గురించి (లూకా 2:1-21)
4) బాలయేసు దేవాలయములో కానుకగా ఒప్పగింపబడుట (లూకా 2:22-38)
5) దేవమాత కానకబోయిన బాలేసును దేవాలయములో కనుగొనుట (లూకా 2:41-52)
దుఃఖః దేవ రహస్యములు
1) గెత్సెమనిలో ఆవేదన (మత్తయి 26:36-56)
2) యేసును యూదులు రాతి స్తంభమునకు కట్టి కొట్టుట (మత్తయి 27:26)
3) యూదులు యేసు ప్రభుని తిరుసిరస్సున ముండ్ల కిరీటము పెట్టి కొట్టుట (మత్తయి 27:27-31)
4) యేసుక్రీస్తు స్లీవను మోసుకొని పోవుట (మత్తయి 27:32)
5) యేసుక్రీస్తు స్లీవమీద కొట్టబడి మరణము పొందుట (మత్తయి 27:33-56)
మహిమ దేవ రహస్యములు
1) యేసుక్రీస్తు ఉత్తాన మగుట (మార్కు 16:1-7)
2) యేసుక్రీస్తు మొక్షారోహణమగుట (మార్కు 16:14-20)
3) పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తులులపై వేంచేసి వచ్చుట (అపోస్తులు 2:1-11)
4) దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడుట (లూకా 1:41-50)
5) దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపించబడుట (దర్శన గ్రంధము 12:1)
వెలుగు దేవ రహస్యములు-:
1) యోర్దాను నదిలో యేసు బాప్తిస్మము పొందుట (మత్తయి 3:13-16)
2) కానా పల్లెలో పెండ్లి (యోహాను 2:1-11)
3) క్రీస్తు దేవుని సువార్తను ప్రకటించుట (మార్కు 1:14-15)
4) దివ్యరూప ధారణ (మత్తయి 17:1-8)
5) ప్రభు భోజనము (మత్తయి 26:26-30)
జపమాల చాలా ముఖ్యమైన ప్రార్ధన. 'పవిత్ర జపమాల' ప్రార్ధన పరిపూర్ణమైన ప్రార్ధన. ఎందుకనగా, దీనిలో మనరక్షణ చరిత్ర ఇమిడియున్నది. ..జపమాలను జపించుదాం..మరియమాత దీవెనలు నిండుగా, మెండుగా పొందుకుందాం.
