దైవాజ్ఞలన్నిటి లో ప్రధానమైన ఆజ్ఞ!

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి

04 Oct 2026

దైవాజ్ఞలన్నిటి లో ప్రధానమైన ఆజ్ఞ!
**************************"
(మార్కు 12: 28 - 34 )

ఒక రోజు యూదయా ధర్మ శాస్త్ర బోధకుడొకడు ,యేసుక్రీస్తు వద్దకు వచ్చి, 'బోధకుడా! దైవాజ్ఞ లన్నిటిలో ప్రధానమైనది ఏది?' అని అడగ్గా, అందుకు ఆ మరియ తనయుడు," నీ దేవుడైన ప్రభువును ,పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మ తోను పూర్ణ మనసు తోను,సంపూర్ణ శక్తి తోను, ప్రేమించాలనేది ప్రధానమైన ఆజ్ఞ!అదే విధంగా నీ వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అన్నది రెండవ ఆజ్ఞ ! వీనిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని సమాధానమిచ్చారు.

ఔను మరి.ఇహ లోక జీవనయానంలో మనం పరలోకంలో ఉన్న మన తండ్రి దేవుని సంపూర్ణంగా ప్రేమిస్తూ, మన తోడి వారిని కూడా అలాగే ప్రేమిస్తూ ఉండాలనే విషయాన్ని, ప్రేమ రూపుడైన ఏసు భగవానుడు ఈ వచనాల ద్వారా మనకు ప్రబోధిస్తున్నాడు. పరలోక మందున్న మా తండ్రీ అంటూ దేవుని సంబోధిస్తూ ఉంటాం కానీ, నిజానికి ఆయన ఎక్కడో లేడు, మన చుట్టూనే ఉన్న మనుషుల రూపంలో, ప్రకృతి రూపంలో మన మధ్యనే నివసిస్తూ ఉంటాడనేది నిజం.అందుకే 'ప్రతి మనిషీ నడిచే దైవం! ప్రతి పులుగూ ఎగిరే దైవం' అంటూ ఏనాడో ఒక సినీ కవి పాట రూపంలో చెప్పిన విషయం చిరస్మరణీ యమే! అంతదాక ఎందుకు 'మానవ సేవే మాధవ సేవ' అన్న నానుడి లో దాగున్న సత్యం అదేగదా! తోడి మనుషులకు ప్రేమను పంచితే, వారికి సాయం చేస్తే, వారికి సేవలు అందిస్తే ఆ భగవానునికి చేసి నట్లే గదా మరి! అదే విషయాన్ని నీ వలె నీ పొరుగువానిని ప్రేమించుము అనే ఆజ్ఞ ద్వారా సుతుడైన దేవుడు మనకు విశదం చేస్తున్నాడు.నీ వలె పొరుగు వాణ్ని ప్రేమించడం అంటే, ఏదైతే మనకు బాధను ,నొప్పిని కలిగిస్తుందో,అది మన ద్వారా ఇతరులకు కలగకుండా మనం జాగ్రత్త పడితే మనం ఇతరులను ప్రేమించినట్టే! ఈ సందర్భంలో మహా భారతం లోని విదుర నీతి ఘట్టం లోని
"ఒరులే యవి యొనరించిన
నరవర అప్రియము తన మనమున కగు తానవి
యొరులకు సేయకునికి
పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్"
అనే పద్యం గుర్తుచేసుకో వచ్చు. ఇతరులు మనకు ఏమిచేస్తే మనకు ఇష్టం ఉండదో, అవి మనం ఇతరులకు చేయకుండా ఉండడమే మనం పాటించాల్సిన గొప్ప ధర్మం అని దాని అర్ధం.
తిట్టడం ద్వారా,తగాదాపడడం ద్వారా, ద్వేషించడం ద్వారా, ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం ద్వారా, మన ఇంట్లో చెత్త తీసుకొని వెళ్లి వేరే ఇంటి ముందు పోయడం ద్వారా ఇతరులను కష్టపెట్టడం, వారి ఉన్నతిని చూసి కుళ్లుకోవడం, వారి దుస్థితిని మనం కోరుకోవడం వంటి పనులు మనం చేయకుండా ఉండాలి. తోడి వారికష్టం మన కష్టంలా భావిస్తూ, పొరుగువాళ్ళతో ఇష్టంగా నడుచుకుంటే ఆ దేవ దేవుడు హర్షించి వరాల వర్షం కురిపిస్తాడన్నదే ఈ సువిశేష వాక్యసారాంశం! ఆ వాక్య ధర్మాన్ని పాటించేలా ఆ కరుణామయుడు మనల్ని సదా దీవించు గాక!పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN