దేవుని సహనం - మానవుని రక్షణం

Fr. Sesetti Mariadas M.S.F.S.
03 Oct 2026
సామాన్య ఆదివారము - 27 (A)
యెషయ 5:1-7;
ఫిలిప్పి. 4:6-9;
మత్తయి 21:33-43
దేవుని సహనం మానవ రక్షణకు మార్గం. మానవ రక్షణ చరిత్ర దేవుని సహన క్రియలతో నిండి ఉన్నది. దేవుని సహనము మానవాళి రక్షణకై ఒసగబడిన అవకాశము (2 పేత్రు 3:15). తన ఆగ్రహమునకు గురై, నాశనము చేయబడవలసినవారిని సహించుటలో ఎంతో సహనం ప్రదర్శించెనని (రోమీ 9:22) నోవా కాలపు ప్రజలపై తన సహనం ప్రదర్శించెనని (ఆది. 6:3నుండి) సోదోము రక్షించుటకు ప్రదర్శించెనని (ఆది. 18:26), ప్రభువు సులభంగ కోపపడువాడు కాదని (నిర్గ. 36:4), ప్రజలు దేవుని మాట జవదాటిన, అద్భుత కార్యాలను విస్మరించిన, తిరుగుబాటు చేసిన, తమకు ఒక నాయకుని ఎన్నుకొనిన కరుణామయుడిగ, దయాపూర్ణుడిగ, కోపించక, విడనాడక సహనం చూపెను (నెహె. 9:17) అని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది.
మొదటి పఠనం :
యెషయా కాలంలో ఆనాటి ప్రజలకు దేవుడు చేసిన కార్యాలన్ని తెలుసు. అబ్రహాం నాటినుండి పాలు తేనేలు కారు దేశంలో ప్రవేశించెంతవరకు చేసిన గొప్ప కార్యాలన్ని తెలుసు. కాని వారు అన్నిటిని మరచిపోయారు. తిరగబడ్డారు. దేవునికి అవిధేయుల య్యారు. కాని ఇప్పటి దేవుని ప్రజలమైన మనం ఎలా ఉన్నాము. సిలువ మరణం వరకు దేవుడు మనలను ప్రేమించాడు. ఇంత ప్రేమించిన దేవునికి ఎంత కృతజ్ఞలుగ ఉంటున్నాము.
రెండవ పఠనం :
క్రైస్తవ జీవితం ప్రార్థన జీవితమై ఉండాలి. మన ప్రార్థనలు ఆరాధనతోను కృతజ్ఞతలతోను నిండి ఉండాలి. ప్రార్ధన ద్వారా సాధించలేనిది ఏమిలేదు. కనుక కష్టసుఖాలతో మిలితమైన ఈ జీవితంలో దేనిని గూర్చి విచారింపక, అన్ని అవసరా లలో ప్రార్థించాలని పునీత పౌలుగారు తెలియజేస్తున్నారు.
- మన జీవితంలో ప్రార్థనకు ఇచ్చే ప్రాధాన్యత ఎంత ?
- తల్లిదండ్రులం, బిడ్డలం కలసి ఎన్నిసార్లు ప్రార్థించాం.
- మన కాష్టాలలో, నష్టాలలో ప్రార్థిస్తూ దేవుని సహాయం కోరమా? లేదా వాస్తులు, సమయాలు మంత్రాలు అంటూ సిద్ధాంతుల చుట్టూ తిరిగి ఆధారపడమా?
సువార్త పఠనం :
భూస్వామి - కౌలుదార్లు ఉపమానం దేవుని ప్రేమ కథ. ప్రేమ సహనంగల దేవుని కథ. యజమానుడు ద్రాక్షతోటలో చాల హెచ్చరించాడు. పెట్టుబడి పెట్టాడు, చాలా శ్రమించాడు. నాటాడు, కంచెవేయించాడు, గోతిని త్రవ్వించాడు, గోపురం కట్టించాడు. ఇవి అన్ని దేవుని వ్యక్తిగత, ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనం. తాను ఎంత ప్రేమించాడో, ఎంత ప్రత్యేక శ్రద్ధ చూపించాడో, అంత శ్రమించాలని, అంతే ప్రత్యేక శ్రద్ధ చూపాలని కౌలుదార్లుకు ఇచ్చి దూర దేశమునకు వెళ్ళెను. యజమానుడు తనదంతా, తనకున్నదంతా కౌలుదార్లుకు ఇచ్చి దూర దేశమనకు వెళ్ళటం యజ0మానికి కౌలుదార్లుపై తనకు ఉన్న నమ్మకానికి నిదర్శనం, ఆ నమ్మకం ఒమ్మయింది.
ఆనాడు ఆ యజమానుడు కౌలుదార్లును నమ్మినట్లే ఈనాడు దేవుడు మనలం దరని నమ్మాడు.
జీవితం ఓ పొలం :
మన మందరం ఉపమానంలోని కౌలుదార్ల వంటివారము. మనము దేవుని రాజ్యపు కౌలుదారులం. యజమానుడు అన్ని సమకూర్చాడు. అన్ని ఇచ్చాడు. చివరికి స్వాతంత్ర్యం కూడా అయితే వృద్ధిచెందే అవకాశంను ఉపయోగించుకొనలేదు. విశ్వాస ఘాతకులైనారు. అత్యాసకు పోయారు. చివరకు హంతకులైనారు.
మన జీవితం ద్రాక్షతోట వంటిది. ఈ జీవితం దేవునిది ఈ జీవితానికి యజమానుడు దేవుడు. దేవుడు ఈ జీవితంలో అన్ని సమకూర్చాడు. అన్ని ఇచ్చాడు. తల్లిదండ్రులు, చదువులు, ఉద్యోగాలు, బంధుమిత్రులు మొదలగునవి మనం ఎలా సాగుచేస్తున్నాం? ఎలా ఫలింపజేస్తున్నాం?
నోవా విధేయత కలిగిన వ్యక్తిగ (ఆది. 6:22), మోషే మహా వినయవంతుడిగను (సంఖ్యా 12:3) యోహెూషువా దైవభీత కలవాడిగను (యోహా...) దానియేలు ప్రార్ధన పరుడిగను (దాని. 6:10) బాప్తిస్మ యోహాను వినయశీలిగను (యోహా. 3:30), పౌలు త్యాగశీలిగను (1 కొరింతి 9:1-12) తమ జీవితాలను ఫలవంతం చేసు కొన్నారు.
దేవుని సహనం :
పంట కాలములో తనవంతు ఫలాలను తీసుకురమ్మని యజమానుడు సేవకులను పంపాడు. కాని కౌలుదార్లు సేవకులను కొట్టారు, చంపారు. యజమానుడు సహనం కోల్పోకుండా రెండవ మారు మరి కొంతమంది సేవకులను పంపాడు. వారిని అట్లే కొట్టి, చంపారు. మొదట వచ్చిన సేవకులను కొట్టి చంపినా, రెండవ మారు మరి ఎక్కువ మందిని పంపించటం తనకు ఉన్న అపార సహనానికి నిదర్శనం. చివరకు తన సొంత కుమారునే పంపించాలనుకోవటం దేవుని అపార సహనానికి గుర్తు. ఇవి అన్ని దేవుడు ఇచ్చే అవకాశాలకు గుర్తు. చివరకు తన కుమారునే పంపాడు.
దేవుని సహనం పరివర్తనకు మార్గం. మూడుసార్లు సంపూర్ణతకు గుర్తు. మానవుడు మారుమనస్సు పొందటానికి సంపూర్ణమైన సహనం దేవుడు ప్రదర్శిస్తాడు.
కథ :
ఒక యువరాణి జబ్బుపడింది. జబ్బుకుగల కారణాలు ఏమిటో వైద్యులు కనుగొనలేకపోయారు. కాని రెండు చిన్న తూనిగలు మాత్రం కారణం ఏమిటో తెలుసుకొన్నాయి. ముఖమున నవ్వు ఉన్నవారు ఎవ్వరు తన రాజ్యంలో తనకు కనిపించకపోవటమే కారణం. ఎప్పుడు నవ్వుతూ ఉండే వారిని వెతికి తీసుకొని రావటానికి ఈ రెండు తూనీగలు బయలుదేరాయి. ఖండ ఖండాలు తిరిగాయి తూనీగలు. కాని, నవ్వుతూ ఉండేవారు ఎవ్వరు వారికి కనిపించలేదు. ఒక తూనీగ నిరుత్సాహంతో వెనుక వచ్చేయాలని నిర్ణయించుకొంది. కనీసం యువరాణి చనిపోయే చివరి గడియలలోనైనా చూడవచ్చు కధా అనుకొని వచ్చేసింది. రెండవ తూనీగ మరో చిన్న ఖండానికి వెళ్లింది. అక్కడ గొప్ప దృష్యం కనిపించింది. ఎప్పుడు నవ్వుతూ ఉండే అన్ని రకాల జీవులు ఒక పార్టీకి సమావేశమవుతున్నాయి. తూనీగ విషయాన్ని వాటన్నిటికి చెప్పింది. మిలియన్ల కొలది జీవులు తూనీగతోపాటు యువరాణిని చూడటానికి వచ్చాయి. యువరాజు మిలియన్ల కొలది నవ్వేవారిని చూడగానే, ఆ ఆనందానికి ఆరోగ్యం తిరిగి పొందింది.
రెండవ తూనీగలో ఉన్న సహనం వలన యువరాణి ప్రాణం దక్కింది. ఈ రీతిగనే దేవుని సహనం - మానవ రక్షణం.
అత్యాశ - విశ్వాస ఘాతకం ::
కౌలుదార్లు కౌలు ఇవ్వకపోవటం, దాని ఫలితంగ సేవకులను చంపటానికి కారణం వారి అత్యాశే. భూమిని, దాని ఫలాలను సొంతం చేసుకోవాలనే అత్యాశే వారిని ఒప్పందాన్ని అతిక్రమించే విశ్వాసఘాతకులుగ, హంతకులుగ మార్చింది. ఈ అత్యాశే ఆది తల్లిదండ్రుల పాపానికి మూలం అయింది. దేవుని అంతటివారు కావలెనని సైతాను మాటలు విని అత్యాశపడ్డారు. ఈ అత్యాశవలనే దేవుడు వారితో చేసుకొన్న ఒప్పందాన్ని అతిక్రమించారు. అతిక్రమించటమే పాపం. ఒప్పందాన్ని అతిక్రమించుటవలనే ఏదోను వనం నుండి వారిని గెంటివేశారు.
కీర్త. 10:3 "దుష్టుడు తన దురాశలను గూర్చి గొప్పలు చెప్పుకొనును. లోబి ప్రభుని నిరాకరించును”. సామె. 11:6 “...కాని మోసగాడు తన దురాశలవలనే బంధితుడు అగును”. లూకా 12:15 "...ఎట్టి లోభమునకు గురికాకుడు, మానవ జీవితం సిరిసంపదల సంమృద్ధిలో లేదు.” అత్యాశ పాపము (మార్కు 7:22, రోమీ 1:29, ఎఫేసీ 5:3), అత్యాశ విగ్రహారాధన వంటిది (ఎఫేసీ 5:5, కొలస్సీ 3:5), అత్యాశ దేవుని నుండి దూరం చేస్తుంది (లూకా 3:4, ఫలిప్పీ 4:11, హెబ్రీ 13:5)
కథ :
ఒక కుక్క మాంసపు ముక్కను నోట కరచుకొని నదిని దాటుతోంది. నీటిలో దాని నీడనే చూచుకొని మరో కుక్క పెద్ద మాంసపు ముక్కను నోట కరచుకొందని తలంచింది. వెంటనే దానిపై పడి ఆ మాంసపు ముక్కను లాక్కోదలచి తన నోట ఉన్న ముక్కను విడిచింది. చివరకు తన నీడను తానే చూసి తానే మోసపోయింది. తన నోటిలోని మాంసపు ముక్కను పోగొట్టుకుంది.
మన స్పందన :
కౌలుదారులు అత్యాశకు పోయి, సేవకులను చంపారు, హంతకులయ్యారని మనం చదివినప్పుడు ఆశ్చర్యపోవచ్చు. కాని మనకు తన రూపం ఇచ్చిన ప్రభువుపట్ల
(ఆది 1:25) మన పేర్లను తన అరచేతి మీద వ్రాసుకొని ప్రభువు పట్ల (యోష 19.16), తల్లి మరచిన నేను నిన్ను మరువనన్న ప్రభువు పట్ల (యెష 49:16) అడిగిన ప్రతి వానికి ఇస్తానన్న ప్రభువుపట్ల (మత్త 7:7) చివరకు మన కొరకై తన ప్రాణం దారపోసిన ప్రభువుపట్ల మన స్పందన ఏమిటి?
- కౌలుదార్లలాగ ఎంతమంది ఒకరినొకరు చంపుకోవటం లేదు ?
- ఆస్తికోసం, పరువు కోసం ఎన్ని హత్యలు జరగటం లేదు?
- పట్టింపుల కోసం ఎన్ని కుటుంబాలు విడిపోవటం లేదు?
ఫలాలు : మన కుటుంబాలు, మన సంఘం దేవుని ద్రాక్ష తోటలాంటిది. ఈ తోటలో ఫలించవలసిన ఫలాలు ప్రేమ ఫలాలు. గలతీ 5:22-23 “...ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వాసనీయత, సాత్వికత, నిగ్రహము”.
ఈ జీవితం మనదికాదు దేవునిదే. దేవుడే వెలనిచ్చి కొనెను. (1 కొరింతీ 6:20) మనం కౌలుదారులం. ప్రేమఫలాలు పండేలాగు ఈ జీవితాన్ని సాగుచేయాలి. మనదంటూ ఏమి లేదు. మనకున్నదంతా దేవునిదే. ఉపమానంలో కౌలుదార్లకు ఏమీ లేదు. అంతా యజమానునిదే. యజమానునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా ఉండటానికి వారు ఒప్పుకొని అతిక్రమించారు. హంతకులుగ మారారు. మనం దేవునికి ఇవ్వవలసిన మన శక్తిని, సమయాన్ని, కళలను, వస్తువులను, అన్నదానిని దేవునికి ఇస్తున్నామా. ఇవన్నీ దేవుడు ఇచ్చినవి కావున దేవునికి మనం తిరిగి మన వంతు ఇవ్వాలి.
- దేవునికి ఇవ్వవలసిన సమయం వస్తే గుడినే మానేస్తాం, దేవున్నే వదిలేస్తాం.
- దేవునికి ఇవ్వవలసిన దశమ భాగాన్ని, గుడి చందాను ఇస్తున్నామా?
లూకా 20:25, 'చక్రవర్తి'కి చక్రవర్తికి, దేవునికి దేవునకు చెల్లింపుము.
రోమా 13:7 “ఎవ్వరికి చెల్లించవలసినవి వారికి చెల్లింపుము. మన మంచి కార్యాలే మన మంచి ఫలాలు. నీ జీవితంలో మంచి కార్యాలు చేస్తున్నావా? మంచి కార్యాలు చేస్తున్నట్లైతే పరలోకం, మంచికార్యాలు చేయనివారికి పరలోకం దూరం.
మత్త. 25:40 “ఈనా సోదరులలో ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు మీరు నాకు చేసితిరి”.
- ఆహారం పెట్టేవారిగ, దప్పిక తీర్చేవారిగ, ఆదరించేవారిగ, వస్త్రాలు ఇచ్చేవారిగ, పరామర్శించేవారిగ, దర్శించేవారిగ మన మంచి కార్యాలు ఉండాలి.
బహుమానం - శిక్ష :
మంచి ఫలాలు ఇచ్చినవారికి బహుమానం, ఇవ్వనివారికి శిక్ష తప్పకుండా వుంటుంది. ఫలాలు ఇవ్వని వారి నుండి శిక్షగ పరలోక రాజ్యం తీసివేయ బడినది. ఫలాలు ఇవ్వగలవారికి బహుమానంగ పరలోకం ఇవ్వబడినది.
దర్శ 22:12 "...వారి వారి క్రియబట్టి వారికి ఒసగబడిన బహుమానం నా వెంట తెత్తును.
హెబ్రీ 6:78 "...అనుకూలమైన పంట పండించిన ఎడల దేవుని దీవెనలు పొందును”
మత్త. 13:40 (... కలుపు మొక్కలు ఎట్లు ప్రోవుచేయబడి అగ్నిలో వేయబడునో, అట్లే అంత్య కాలమందు జరుగను.”
మార్కు 11:21 ... ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు పూర్తిగ ఎండిపోయింది.”
ముగింపు:
పాఠశాలలో ప్రతి రోజు చిన్నచిన్న పరీక్షలు ఉంటాయి. చివరిన సం||రాంతపు పరీక్ష వుంటుంది. పాసా, ఫెయిల్ లా తెలిసేది దీనిలోనే, ప్రతిరోజు మన జీవితంలో చిన్న చిన్న పరీక్షలుంటాయి. కాని చివరన తీర్పు ఉంది. తీర్పుదినాన దేవుని చిత్తమే నెరవేరుతుంది. దేవుని రాజ్యం తొలగింపబడి తగిన ఫలం ఇవ్వగలవారికే ఇవ్వబడు తుంది. కుమారుని పంపిన తరువాత కూడా అవకాశం మిస్ అయితే అనగా నమ్మకపోతే, ఆరాధించకపోతే, అంగీకరించకపోతే తీర్పు దినాన మనకు నరకమే.
