జపమాల మనకున్న వరాలమాల!

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి
01 Oct 2026
వరాల మాల!(కథ )
***********
అది ఒక గవర్న్ మెంట్ ఆఫీస్. సాయంత్రం ఐదు గంటల సమయం. ఆ ఆఫీసులో పని చేసే వాళ్ళంతా తమ సీట్లలోనుంచి లేచి ఇళ్లకు బయల్దేరుతున్నారు. అంతలో 'రాజారావ్ రాజారావ్' అని ఆదుర్దాగా పిలుస్తూ, రాజారావు సీటు దగ్గరకు వచ్చాడు అతని కొలీగ్ మురళీ కృష్ణ. 'ఏమైంది మురళీ? ఎందుకా గాభరా?'అన్న రాజరావుని పట్టుకొని,'మన పిల్లల స్కూల్ బస్ కి యాక్సిడెంట్ అయిందంట. ఆ బస్ లో ఎక్కి ఇళ్లకు తిరి గొస్తున్న మన పిల్లలకి ఏమైందో యేమోనని భయంగా ఉంది రాజారావ్' అని ఏడుపు గొంతుతో అన్న మురళీ కృష్ణతో 'ఏమీ కాదు. ఊరుకో మురళీ. పద ,యాక్సిడెంట్ ఎక్కడయ్యిందో కనుక్కుని ఆ చోటుకి వెళ్దాం' అంటూ మురళీ కృష్ణను తీసుకొని బయటకు వెళ్ళాడు రాజారావు.
వాళ్ళు స్కూల్ బస్ కి యాక్సిడెంటైన చోటుకి వెళ్లి చూడగా ,స్కూల్ బస్ అదుపు తప్పి రోడ్డు ప్రక్కన పడిపోయినా, అందులో ఉన్న పిల్లలంతా క్షేమంగా బయటపడడం గమనించి ఎంతో సంతోషించారు.
పిల్లలతో ఇంటికి తిరిగి వెళ్తూ 'నీది ఉక్కు గుండె రాజారావ్! ' అన్నాడు మురళీ కృష్ణ .ఎందుకనోయ్ అన్న రాజారావుతో 'మన పిల్లల కేమైందో నని భయంతో నాకు కాళ్ళు చేతులు ఆడక అదిరిపోతుంటే నువ్వు మాత్రం పాంటు జేబులో చెయ్యి పెట్టి గట్టిగా పట్టుకొని మన పిల్లలకి ఏమీ కాదని ధైర్యం చెబుతూ వచ్చావు. ఇంతకీ ఏముందయ్యా నీ జేబులో?' అంటున్న మురళీ కృష్ణకు జేబులోంచి 'జపమాల' తీసి చూపించాడు రాజారావు.
'ఏంటయ్యా ఇది ?'అని ఆశ్చర్యంగా అడిగాడు మురళీ కృష్ణ.
'ఇది మరియతల్లిని భక్తితో వేడుకొనే జపమాల మురళీ! మా కతోలిక క్రైస్తవుల పాలిటి వర మాల!ఇందులో ఉన్న 53 పూసలు మంగళ వార్త జపాలకు,మరి 6 పూసలు పరలోక ప్రార్ధనకు సంబంధించినవి. ప్రతి రోజూ విడవకుండా జప మాల ప్రార్ధన చేసే ప్రతి ఇంట్లో ప్రశాంతత, ఆనందం నిండి ఉంటాయని మా విశ్వాసమే కాక నా స్వానుభవం కూడా! అందుకే నువ్వు పిల్లల బస్ కి యాక్సిడెంట్ అయింది అన్నప్పుడు నేను జేబులో ఉన్న జపమాలను పట్టుకొని మరియతల్లిని ప్రార్ధిస్తూ ధైర్యంగా ప్రశాంతంగా ఉండ గలిగాను' అన్నాడు భక్తి పూర్వకంగా రాజారావు.
' ఔను రాజారావ్! మీ ఇంట్లో వాతావరణం అంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుందని, మీ ఇంట్లో కూర్చున్న కాసేపు మనసంతా హాయిగా అనిపిస్తుందని మన ఆఫీసులో వాళ్ళు అనుకోవడం నేను చాలా సార్లు విన్నాను.దానికి కారణం మీరు జపమాల ప్రార్ధన చేయడం అన్నమాట. ఇంతకు ఈ జపమాల చెప్పే అలవాటు మీకు ఎలా వచ్చింది ?' అడిగాడు మురళీ కృష్ణ.
'నా చిన్నప్పటి నుండీ ఈ జపమాల చెప్పే అలవాటు మా నాన్నగారు మాకు నేర్పారు.మా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయినా, మా నాన్నగారు ఎంతో ప్రేమగా మమ్మల్ని పెంచడానికి, కుటుంబ బాధ్యతలన్నీ ఒంటరిగానే ఎంతో సంతోషంగా నిర్వహించడానికి కారణం జపమాలే నంటూ,దీనిని ఎప్పుడూ మరవొద్దని తన మరణ సమయంలో కూడా మరీ మరీ చెప్పి అలాగని నా నుండి మాట తీసుకొని ఆఖరి శ్వాస విడిచారు మా నాన్నగారు! అందుకే ఈ వరమాలను నేను ఎప్పుడూ మరువను . జపమాలను జపించకుండా విడువను' అని వివరించాడు రాజారావు.
నిజమే! ఆనాడు కానా పల్లె లో పెళ్లి వాళ్ళ అవసరాన్ని గమనించి , ఎవరూ అడగకుండానే,వాళ్ళ అవసరాన్ని తీర్చమని తన దివ్య కుమారుని అర్ధించింది మరియతల్లి. ఈ నాడు ఫాతిమా మాతగా, లూర్ధుమాతగా, కార్మెల్ మాతగా, వెలాంగిణి మాతగా అనేక చోట్ల మన మధ్య వెలసిన మరియతల్లిని జపమాల ద్వారా వేడుకొంటే మన కోర్కెలు తీర్చకుండా ఉంటుందా? మనకుఅవసరమైన వరాలను క్రీస్తు ప్రభుని ద్వారా మనపై కురిపించక మానుతుందా? అందుకే జపమాల మనకున్న వరాలమాల!
