అక్టోబర్ మాసం- జపమాల మాసం

జోసెఫ్ అవినాష్
30 Sep 2026
మనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్టోబర్ మాసము రానే వచ్చింది. అక్టోబర్ నెల అనగానే కతోలిక విశ్వాసులకు జపమాల గుర్తుకు వస్తుంది... కతోలిక సంఘాన్ని పరిపాలించే జగద్గురువు నుండి జపమెరిగిన జనం వరకు ఏ అంతస్థులో ఉన్న కతోలిక విశ్వాసి అయినా సరే జపమాలను మిక్కిలి భక్తితో జపిస్తారు... "ఎలా ప్రార్థించాలో తెలియని విశ్వాసులకు" ఇలా ప్రార్థించాలి అని చాటి చెప్పేదే జపమాల... చదవటం రాని విశ్వాసులు కూడా పుస్తకం చూడకుండా జపమాలను చక్కగా చెప్పగలుగుతున్నారు అంటే ఈ ప్రార్థనలో ఇమిడి ఉన్న దైవ శక్తిని మనమంతా గ్రహించాలి...జపమాల కతోలికులకు ఒక వరం లాంటిది.
కతోలిక క్రైస్తవులు అక్టోబర్ మాసమును జపమాల అంకిత మాసముగా విశ్వసిస్తుంటారు. దీనికి కారణం ఏమనగా అక్టోబర్ 7వ తేదీ జపమాల మాత మహోత్సవం కావటం. చరిత్రను మనం పరిశీలన చేస్తే 1206వ సంవత్సరంలో విరివిగా ఐరోపా ప్రజలకు సవాలుగా మారిన "అల్బిజోన్సియన్" అనే తప్పుడు వేద ప్రచారం అంతం కావాలని అప్పటి పునీతుడు పునీత డొమినిక్ గారు చేసిన ప్రార్థనలు, ఉపవాసాలు, భక్తి క్రియలను చూసి సాక్షాత్తు మరియతల్లి డొమినిక్ గారికి దర్శనమిచ్చి జపమాలను తన చేతికి అందిస్తూ, దానిని ఒక ఆయుధంగా వాడమని అదే విధంగా జపమాల భక్తిని ఇతరులకు ప్రబోధించమని తనను ఆదేశించారని చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్నది.
ఆ పిదప 1213 వ సంవత్సరంలో అల్బిజోన్సియన్లు అపజయం పాలవ్వటం మనం చూస్తాం. అలాగే 1573 వ సంవత్సరంలో టర్కీలో ముస్లింలకు మరియు క్రైస్తవుల మధ్య జరిగిన పోరాటంలో జపమాల ప్రార్థన ద్వారా టర్కీలు అపజయం పాలవడం దానిని 5వ భక్తనాథ పాపు గారు జపమాల విజయంగా అభివర్ణించటం చరిత్ర మనకు తెలియజేస్తున్నది. అటు పిమ్మట 13 వ గ్రెగొరీ జగద్గురువు జపమాల పండుగను ప్రతి దేవాలయంలో జరపాలని అక్టోబర్ మాసమును మరియమాతకి అంకితమిస్తూ జపమాల మాత మాసముగా కొనియాడాలని ఆదేశించారు. 1671 వ సంవత్సరంలో పదవ క్లెమెంట్ జగద్గురు ఈ పండుగను స్పెయిన్ దేశమంతటా వ్యాపింపజేశారు. అటు పిమ్మట రెండవ సారి చరిత్రలో టర్కీల మీద రష్యా వలె క్రైస్తవులకు భయంగా మారిన వారిపై విజయాన్ని సాధించి నందుకు ఆగస్టు 5వ తేదీన 1716 వ సంవత్సరంలో యువరాజు యూజిన్ ఆధ్వర్యంలో వారిని ఓడించిన సందర్భంలో 11వ క్లెమెంట్ జగద్గురువు ఈ పండుగను ప్రపంచమంతటా వ్యాపింపజేశారు. ఈ విధంగా అక్టోబర్ నెలలో మరియమాత ఇచ్చిన శక్తివంతమైన ఆయుధం జపమాల ద్వారా సాధించిన విజయాలను బట్టి మన కతోలిక శ్రీ సభ అక్టోబర్ మాసమును మరియమాతకు అంకితమిచ్చారు.
కాబట్టి ఈ నెలలో ఆ తల్లి మద్యస్థ ప్రార్ధన సహాయాన్ని వేడుకుంటూ ప్రపంచశాంతికై మనమంతా ప్రార్థిద్దాం.
