అతి దూతల పండుగ

ప్రసాద్ గార్లపాటి
29 Sep 2026
మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు (సెప్టెంబరు 29)
పఠనాలు: దానియేలు 7:9-10, 13-14
యోహాను 1:47-51
ప్రియమైన సహోదరీ సహోదరులారా,
నేడు పవిత్ర తిరుసభ ముగ్గురు ప్రధాన దేవదూతలను స్మరించుకుంటూ వుంది . దేవదూతలు అంటే “దేవుని సందేశవాహకులు” లేదా “దేవుని సేవకులు”. వారు దేవుని సన్నిధిలో నిలిచి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి మానవులకు సహాయం చేస్తువుంటారు. దేవదూతలు స్వచ్ఛమైన ఆత్మ జీవులు (Pure Spirits). వారికి శరీరం, రక్తం ఉండవు; కానీ సంపూర్ణ బుద్ధిశక్తి, సంకల్పశక్తి (Intellect and Will) కలిగిన అమర వ్యక్తిత్వాలు. దేవదూతలు స్వభావంచేత ఆత్మలు, పరిచర్యచేత దూతలు. దేవుడు వారిని సందేశం ఇవ్వడానికి, రక్షించడానికి, స్వస్థపరచడానికి పంపినప్పుడు వారు "దూతలు". వారు దేవుని సన్నిధిలో ఆరాధనలో నిలిచినప్పుడు ఆత్మలు . దేవదూతలను తొమ్మిది రకాల శ్రేణులుగా (9 Choirs of Angels) విభజించారు. అందులో పరమపిత సింహాసనాన్ని నిరంతరం ఆరాధించే అత్యున్నత శ్రేణుల నుండి, మానవాళికి రక్షణాత్మక సందేశాలు మోసుకొచ్చే శ్రేణియే ఈ "అతిదూతలు" (Archangels).కానీ ముగ్గురి పేర్లు మాత్రమే బైబిలు ప్రస్తావిస్తుంది వారే మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు. ప్రతి నామం చివరిలో ఉచ్ఛరించే 'ఏల్' (-El) అనే పదం హీబ్రూ భాషలో "సర్వేశ్వరుడు" అని అర్థం. ఆ ముగ్గురి నామాలు దేవుని స్వభావానికి మూడు దివ్య ప్రతిబింబాలు!
1. మిఖాయేలు - "దేవునితో సముడెవడు?" (ధర్మరక్షకుడు)
నామార్థం: హీబ్రూలో మీ-కా-ఏల్ అంటే "దేవుని వంటి వాడెవడు?" అని అర్థం.
బైబిలు ఆధారాలు:
దానియేలు 10:13; 12:1 – "నీ ప్రజల పక్షమున నిలబడు గొప్ప అధిపతియైన మిఖాయేలు లేచును."మిఖాయేలు యూదులను కాపాడే దూతగా, దేవుని ప్రజల రక్షకుడిగా పేర్కొనబడ్డాడు.
యూదా 9 – మోషే శరీరం విషయమై సాతానుతో వాదించిన ఆధ్యాత్మిక ధర్మశీలి. “ప్రధాన దూత”గా పిలువబడ్డాడు.
ప్రకటన గ్రంథం 12:7 – మిఖాయేలు మరియు అతని దూతలు సాతానుతో యుద్ధం చేసి, అతన్ని స్వర్గం నుండి బయటకు తరిమికొట్టారు.
సృష్టి ఆరంభంలో, దేవదూతల లోకంలో అత్యంత ప్రకాశవంతమైన లూసిఫర్ (సాతాను) అహంకారంతో మునిగి, "నేను మహోన్నతుడైన దేవునితో సమానమవుతాను" అని తిరుగుబాటు చేశాడు. ఆ క్షణంలో పరలోక సైన్యాల అధిపతిగా లేచిన మిఖాయేలు, ఆయన ఏకైక నినాదంతో : "దేవునికి సమానుడెవరు?". అని అతన్ని నరకపు అంధకారంలోకి నెట్టివేశాడు .
దేవదూతలు ఎంత మహిమాన్వితులైనా సృష్టి జీవులే. మిఖాయేలు కూడా తన ఉనికిని దేవుని నుండి పొందినవాడు. అందుకే దేవదూతల పట్ల మన భక్తి "గౌరవార్చన" (veneration) మాత్రం గానే వుండాలి ; ఆరాధన (adoration) దేవునికి మాత్రమే. ప్రకటన 19:10, 22:8-9లో అపొస్తలుడు దూత ముందు మోకరిల్లినప్పుడు, "వద్దు, దేవునినే ఆరాధించు" అని దూతే వారించాడు. కొలొస్సీ 2:18 కూడా దూతలను ఆరాధించడాన్ని హెచ్చరిస్తుంది. ఇశ్రాయేలు రక్షకుడుగా, తరువాత క్రీస్తు తిరుసభకు రక్షకుడుగా గౌరవిస్తోంది. అందుకే "ధర్మరక్షకుడు" అనే బిరుదు. ప్రార్థనా సంప్రదాయంలో ఆయన మరణ సమయంలో ఆత్మలను దైవసన్నిధికి నడిపించేవాడిగా కూడా స్మరించబడతాడు.
2. గాబ్రియేలు - "దేవుడే నా బలము" (సువార్తా సందేశహరుడు)
నామార్థం: గబ్రీ-ఏల్ అంటే "దేవుడే నా బలము" లేదా "దేవుని పురుషుడు." ఆయన మానవాళికి రక్షణ వార్తను మోసుకొచ్చిన మహాదూత.
బైబిలు ఆధారాలు:
దానియేలు 8:16; 9:21-23 - మెస్సీయా రాకడ సమయాన్ని, పవిత్ర దర్శనాల ఆంతర్యాన్ని దానియేలు ప్రవక్తకు వివరించిన జ్ఞానదూత.
లూకా 1:11-20 - యోహాను జననవార్తను జెకర్యాకు తెలిపినవాడు: "నేను దేవుని సన్నిధిని నిలుచు గాబ్రియేలును. అని ఉద్ఘాటించినవాడు"
లూకా 1:26-38 (దివ్య మంగళ వార్త): నజరేతు కన్యక అయిన మరియమాత వద్దకు వచ్చి, పరలోక శుభవార్తను అందించాడు: "అనుగ్రహ పరిపూర్ణురాలా , నీకు శుభము; ప్రభువు నీతో ఉన్నాడు."
గాబ్రియేలు తెచ్చిన సందేశం మానవ చరిత్ర గమనాన్నే మార్చింది. దేవుని ఆహ్వానం వచ్చినప్పుడు మరియ "ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట ప్రకారము నాకు జరుగును గాక" అని బదులిచ్చింది. దేవదూత సందేశాన్ని తెచ్చాడు; మరియ దానిని తన గర్భంలో ధరించింది. ప్రతి క్రైస్తవుడూ ఒక విధంగా గాబ్రియేలు కార్యాన్ని కొనసాగించాలి: సువార్తను ప్రకటించడం, నమ్మకంతో ఆశను పంచడం. మనం దేవుని వాక్యాన్ని వినేవారమే కాక, దానిని మోసుకెళ్లే దూతలం కావాలి.
3. రఫాయేలు – “దేవుడు నయం చేస్తాడు”
నామార్థం: రఫా-ఏల్ అంటే "దేవుడు స్వస్థపరచును." లేదా “దేవుని ఔషధం” అని అర్థం.
రఫాయేలు అతిదూత ప్రత్యక్షత మానవుల అనుదిన ప్రయాణంలో దేవుని కరుణ ఎలా తోడుగా ఉంటుందో ప్రకటిస్తుంది. ఆయన దైవ స్వస్థతకు, కుటుంబాల ఐక్యతకు, మార్గదర్శకత్వానికి ప్రతిరూపం.
బైబిలు ఆధారాలు:
తోబీతు 3:16-17; 12:15 - తోబీతు ప్రార్థనలు, సారా విలాపం దేవుని సన్నిధిలో చేరిన వేళ, దేవుడు రఫాయేలును పంపాడు. ఆయన తనను తాను ఇలా పరిచయం చేసుకున్నాడు: "ప్రభువు మహిమ సన్నిధిని ప్రవేశించి సేవించు ఏడుగురు పరిశుద్ధ దూతలలో నేను ఒకడను."
తోబీతు 5-11 - యువకుడైన తోబియాకు దారి చూపే సహప్రయాణికుడుగా నడిచి, అతని కన్నతండ్రికి చూపును, సారాకు విమోచనను ప్రసాదించాడు.
తోబీతు 12:6-7, 12 - "ప్రభువు కార్యములను ప్రకటించుట గౌరవకరము." ప్రార్థన, ఉపవాసం, దానధర్మాలను దేవునికి అర్పించినవాడు రఫాయేలే. రఫాయేలు అంటే నయం, సహాయం, మార్గదర్శకత్వం. మనం రోగంతో, కష్టాలతో, ఏకాంతంతో బాధపడుతున్నప్పుడు, దేవుడు రఫాయేలు ద్వారా మనకు సహాయం పంపుతాడు. అతను మన ప్రార్థనలను దేవుని సన్నిధికి చేరుస్తాడు.
ముగ్గురు అతిదూతలు – మన జీవితంలో వారి పాత్ర
మిఖాయేలు – రక్షకుడు
మనల్ని చెడు శక్తుల నుండి కాపాడతాడు
ధైర్యం, బలం ఇస్తాడు.
పాపం నుండి విముక్తి కలిగిస్తాడు.
గాబ్రియేలు – సందేశవాహకుడు
దేవుని సందేశాలను అందిస్తాడు.
ఆశీర్వాదాలు, కొత్త ఆరంభాలు తీసుకువస్తాడు.
ప్రార్థనలకు సమాధానాలు అందిస్తాడు.
రఫాయేలు – నయం చేసేవాడు
రోగాల నుండి నయం కలిగిస్తాడు.
ప్రయాణాలలో కాపాడతాడు.
కుటుంబ ఐక్యత, ప్రేమ ఇస్తాడు.
ముగ్గురినీ కలిపే సూత్రం - యోహాను 1:51
నేటి సువార్తలో ప్రభువు నతనయేలుతో ఇలా అంటున్నాడు: "పరలోకము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారుని పైగా ఎక్కుచు దిగుచు ఉండుటయు మీరు చూతురు."
ఇది యాకోబు నిచ్చెన కల (ఆదికాండము 28:12) యొక్క నెరవేర్పు. ఇప్పుడు ఆ నిచ్చెన మెట్లు ఒక వ్యక్తి: యేసుక్రీస్తు. దేవదూతలు స్వయంగా లక్ష్యం కారు; వారు క్రీస్తు వైపు మనలను నడిపే మార్గదర్శకులు. మిఖాయేలు క్రీస్తు విజయాన్ని కాపాడతాడు, గాబ్రియేలు క్రీస్తు రాకను ప్రకటించాడు, రఫాయేలు క్రీస్తు స్వస్థతను ప్రసాదిస్తాడు. ముగ్గురూ ఒకే మధ్యస్థుని సేవకులు.
మన జీవితంలో అతిదూతల సహాయం ఎలా పొందాలి?
రోజూ మూడు అతిదూతలను ప్రార్థించాలి. దేవుడు దూతల ద్వారా మనకు సహాయం పంపుతాడని నమ్మాలి.
పాపం నుండి దూరంగా ఉండి, పవిత్రంగా జీవించాలి. పవిత్ర అతిదూతలారా, మా కొరకు ప్రార్థించండి!" ఆమెన్! -
