ప్రేమ చిగురిస్తే బ్రతుకే పండుగ !(నాటిక)

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి
27 Sep 2026
ప్రేమ చిగురిస్తే బ్రతుకే పండుగ !(నాటిక)
********************
పాత్రలు : 1.జోసెఫ్ (మధ్య వయస్కుడు )
2. రాజు ( జోసెఫ్ కుమారుడు )
3. మేరీ (జోసెఫ్ కుమార్తె )
4.రాజారావు (జోసెఫ్ స్నేహితుడు )
************************************************************************************************************---
( అది జోసెఫ్ వాళ్ళ ఇల్లు.జోసెఫ్ పిల్లలైన రాజు, మేరీ లు ఏదో విషయంపై తగాదా పడి కొట్టుకుంటూ ఉండగా జోసెఫ్ బయటనుండి వస్తాడు)
మేరి:- నాన్నా! అన్నయ్య చూడు నన్ను కొడుతున్నాడు
రాజు:- నేను కాదు నాన్నా! ఇదే నన్ను కొడుతున్నది
జోసెఫ్:- ఒరే రాజుగా,ఒసేయ్ మేరీ ! ఆఫీసునుంచి ఇంటికి రాగానే మీ గోలేంటి నాకు? నన్ను కాసేపైనా ప్రశాంతంగా ఇంట్లో చావనీయండి! వెళ్ళండి బయటికి! (ఇద్దరి వీపులపై చరిచి బయటకు నెడతాడు. ఇద్దరు పిల్లలూ ఏడ్చుకుంటూ బయటకు వెళ్తారు)
జోసెఫ్:- ఛీ!ఈ పిల్ల సైతానుల గోలతో ఈ ఇల్లో నరకమౌతున్నది! మళ్ళీ ఓ క్వార్టర్ పట్టిస్తే గాని బాగుండేటట్టు లేదు! (అంటూ లోనికి వెళ్లి సీసా తెచ్చు కుని తాగుతూ కూర్చుంటాడు)
(బయటనుండి జోసెఫ్ స్నేహితుడైన రాజారావు , మేరీ ,రాజులను వెంట బెట్టుకొని ఇంట్లోకి తీసుకొని వస్తాడు )
రాజారావు:- జోసెఫ్! ఏమిటయ్యా ఇది? నువ్వు తాగుడుకు బానిసై,రోజూ కొడుతుంటే తట్టుకోలేక నీ భార్య నిన్నూ ,పిల్లల్ని వదిలేసి పుట్టింటి కెళ్లింది. ఇప్పుడేమో పిల్లల్ని కూడా కొట్టి బజారుకు తరిమేస్తున్నావు! అమ్మ దూరమైన పిల్లలకు తండ్రి ప్రేమ కూడా కరువైతే వాళ్ళు ఎట్లా బ్రతకాలి?
జోసెఫ్:- వాళ్ళమ్మ బదులుగా వాళ్ళకి వండి పెట్టి ,వాళ్ళ పనులన్నీ చూడ్డానికి పని మనిషిని పెట్టాలే గానీ, ఇంతకీ ఏంటి రాజారావు, మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావ్ ఈ రోజు?
రాజా:- పిల్లలూ ! మీరు లోనికెళ్లి హోమ్ వర్క్ చేసు కోండి నేను మీ నాన్నతో మాట్లాడిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను.
(రాజు,మేరి లోనికి వెళ్తారు)
రాజు : ఏం లేదు జోసెఫ్! మన చర్చిలో వచ్చే వారమంతా కుటుంబ ప్రార్ధనలు జరుగుతాయంట! ఇంటింటికి వెళ్లి అందరికీ చెప్పమని ,ఈ ఆహ్వాన పత్రిక పంచిపెట్టమని నన్ను పంపారు స్వాముల వారు. అదిగో మీ ఇంటి ఎదురుగా ఉన్న ప్రకాశరావు వాళ్ళకి చెప్పి, నీ దగ్గరకు వస్తుంటే మీ పిల్లలు ఏడుస్తూ కనిపించారు.వాళ్ళని తీసుకొని మీ ఇంటికి వచ్చా. అసలు ప్రకాశరావు వాళ్ళ ఇల్లు ఎంత బాగుందో తెలుసా! మీ ఇద్దరూ ఎదురెదురు ఇళ్లల్లో ఉన్నా ఆ ఇంటికి మీ ఇంటికి ఎంత తేడానో!
జో:-ఓహో వాళ్ళ రేకుల ఇల్లు అంత నచ్చిందా నీకు?
రాజా:- ఇంటి పై కప్పుల దేముంది జోసెఫ్? ఇంట్లో వాళ్ళ మధ్య చిగురించే ప్రేమలతో ఆనందం వెల్లి విరుస్తుంది . నీ ఇల్లు సిమెంట్ స్లాబు వేసిన పెద్ద డాబా అయినా ఏం లాభం? ఇంట్లో ఆనందమేది??
జోస:-ఏం చెయ్యమంటావ్? నా సమస్యలు అలాంటివి
రాజా:- జోసెఫ్!సమస్యలు ఎవరికుండవు? సర్దుకు పోవాలి. ఇంట్లో భార్యా భర్తల మధ్య ప్రేమలు చిగురించి ఒకరి కొకరు అండగా నిలిస్తే సమస్య ఎలాంటిదైనా తేలిపోతుంది. నువ్వేమో ఏదో సమస్యలంటూ మీ ఆవిడను దూరం చేసుకున్నావు. అసలు బైబిల్ లో "భర్తలరా! క్రీస్తు, శ్రీసభను ఎట్లు ప్రేమించి దానికై తన ప్రాణాలను అర్పించెనో, మీరును మీ భార్యలను అట్లే ప్రేమించుడు"అని ఉన్నది తెలుసా?నువ్వు నీ ఇల్లు స్వర్గంలా భాసించాలని కోరుకుంటే వెంటనే మీ అత్తగారింటికి వెళ్లి నీ భార్యని తీసుకుని వచ్చి కుటుంబ ప్రార్ధనల్లో పాల్గొను! నీ తాగుడు వ్యసనానికి స్వస్తి చెప్పు! ( అంటూ అక్కడున్న బ్రాందీ సీసాను తీసి పారేస్తాడు )
జో:- (సాలోచనగా) అలాగే రాజారావు! ఇకనుంచి నువ్వు చెప్పినట్టే ఆ బైబిల్ వాక్యాలను పాటిస్తా! ఇప్పుడే వెళ్లి మా ఆవిడను తీసుకొస్తా!
రాజా:-మంచిది జోసెఫ్! ఒరేయ్ పిల్లలూ! (రాజు, మేరి వస్తారు) చూడండి మీ నాన్న ఇప్పుడే వెళ్లి మీ అమ్మను తీసుకొస్తాడట!
పిల్లలిద్దరూ:-నిజంగానా నాన్నా (అంటూ జోసెఫ్ ను హత్తుకుంటారు)
రాజా:- మీ ఇంట్లో రేపటినుంచి ప్రేమలు చిగురించి ఎలా బ్రతుకులుపండ బోతున్నాయో మీ పిల్లల కళ్ళల్లో నిండిన ఆ వెలుగే చెబుతున్నది.
ఇకనుండి మీ కుటుంబ జీవితంలో చిగురించే ప్రేమ, ఆనందఫలాలను పండిస్తుందిలే జోసెఫ్!
(సమాప్తం)
