"అల్పుడే అధికుడు"

ఫాదర్ పూదోట దాసయ్య
27 Sep 2026
సామాన్య 26వ సోమవారము
"నా పేరిట ఈ చిన్న వానిని స్వీకరించు వాడు, నన్ను స్వీకరించు చున్నాడు. నన్ను స్వీకరించు వాడు, నా తండ్రిని స్వీకరించును. ఏలయన, మీ అందరిలో అత్యల్పుడైన వాడు, అందరికంటే అధికుడు అని యేసు శిష్యులతో పలికెను."
(పు. లూకా 9:48)
ప్రార్థన: అల్పులకు, అభాగ్యులకు, వినమ్రులకు, విశ్వాసులకు, ఆదరణ కర్తయైన ఓ యేసు ప్రభువా, అవధులు లేని నీ ప్రేమ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఉన్నతమైన మీ వ్యక్తిత్వం మమ్ము తట్టి లేపుతుంది. అతి సామాన్యమైన, మీ జీవితమే మాకు ఆదర్శంగా చూపారు. నీ మహిమను పొందుటకు, అల్పులను, అభాగ్యులను చేరదీశారు. వినయంతో మీ వైపు చూసే వారిని ఉన్నత స్థానానికి లేవనెత్తారు. సేవా భావాన్ని పెంపొందించారు. మా మానవ స్వభావంలో జీవించి, దైవత్వంతో మమ్ము అలంకరించారు. ఉన్నత వ్యక్తిత్వంతో జీవించుటకు, నీ కృపా సముద్రంలో ముంచి, మాలోని పాప మురికిని శుద్ధి చేసి, పావన పరిచారు. పరలోక రాజ్యానికి యోగ్యత నిచ్చారు. ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలమయ్యా! ఓ యేసయ్యా, వినయంతో నీ చెంతకే చేరి, నీ పాద సన్నిధిలోనే, మధురమైన నీ బోధనామృతాన్ని ఆస్వాదించి, నీ పవిత్ర సేవలో ఉండి పోవాలని, మనసారా తరించాలని ఉంది. కల్మషంలేని చిన్న పిల్లల వలె, నీ ఒడిలో ఊయలాడాలని ఉంది. నీ చేయి పట్టుకొని, నిర్భయంగా, అగాధాలను దాటేయాలని ఉంది. మైమరచిన ప్రేమ తరంగమై, నీ ప్రేమను ప్రతి గుండెకు చెప్పాలని ఉంది. నా మదిని మీటి నీ స్తుతి గానం పాడాలని ఉంది. నన్నే మరచి నీలా మారాలని ఉంది. స్వచ్ఛమైన పసి మనస్సుతో, అభిషేకం చేయాలని ఉంది. నా ఆశాభావం నీవేనయ్యా, నా మదినిండా నీవేనయ్యా. ఓ దేవా, లోక కోరికలు, తలంపులు, నన్ను కట్టేయాలని చూస్తున్నాయి, భయానక కదలికలు భయపెడుతున్నాయి. గర్వం గాండ్రించి చూస్తుంది. ఉచితం అంటూ వినాశనకర వస్తువులే అందంగా శోబిల్లి నన్ను శోధిస్తున్నాయి. నిర్లక్ష్యపు నీడ నాపై పడుతుంది, అలజడి రేపుతుంది. ఓ ప్రభూ, నీ స్పర్శ నుండి నన్ను దూరం చేయకండి. అత్యల్పునిగా ఉన్నా, నాకు ప్రయోజనకరమే. నీకే సొంతమై జీవిస్తాను. అధికార గర్వం, ఊహల్లోనూ నా దారిలోనికి రానీయకండి. వినమ్ర హృదయాన్ని ఇవ్వండి. అత్యల్పునిగా, అత్యల్పులలో మిమ్ము దర్శించుదునుగాక. ఓ ప్రభువా, ఎవరు గొప్ప, నేనే గొప్ప అంటూ, గర్వం అధికారదాహంతో, యుద్ధనాదాలు చేస్తుంది. కృత్రిమ రోగాలతో సామాన్యులను చెదరగొడుతుంది. జీవితాలను చిందేస్తుంది. కక్షలు పెంచి, ప్రేమ రెప్పలను నలిపేస్తుంది, నమిలేస్తుంది. పసి హృదయాలను చీకటిలో బంధిస్తుంది. యవ్వన ఉత్తేజాన్ని, నురుగులా కరిగిస్తుంది. వృద్ధాప్య ఒంటరితనం బాధిస్తుంది. ఓ ప్రభూ, మీ సుబోధ ప్రమిదను మాలో వెలిగించండి. దివ్య తేజస్సును మాలో నింపండి. మిమ్ము స్వీకరించుటకు, మాలోని అంతరాలను తీసివేయండి. పరలోక రాజ్య ఆకాంక్షను మాలో పుట్టించండి. సదా మీ పవిత్ర ప్రేమలో మమ్ము భద్రపరచండి. ఆమెన్.
ఆత్మాభ్యాసం:
1. ఎవరు గొప్ప అనే వాదనతో, తోటి వారిని చులకనగా చూడడం మానుకుంటాను. సద్భావముతో జీవించడమే మనిషికి గొప్పతనం అని గ్రహించాను. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడంలోనే నా గొప్పదనము కనిపిస్తుందని ప్రకటిస్తున్నాను.
2. తోటి వారిలోని గొప్పతనాన్ని అభినందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నాకంటే బలహీనంగా ఉన్న వారిని చూచి, ఉన్నతమైన స్థానమునకు వారు కూడా లేవనెత్తబడాలని ఆశిస్తాను.
3. చిన్నపిల్లలు దేవుని మహిమను ప్రకటిస్తున్నారు. కళ్ళా కపటం ఎరుగని వారి మనసులు ఎంతో నిర్మలమైనవి. నేను నా జీవితంలో, దేవుని మహిమ పరచడానికి అధిక ప్రాధాన్యతనిస్తాను. నాలోని కపటత్వమును తీసివేస్తాను.
4. దేవుడు అభాగ్యులను ప్రేమించాడు. వారు కోల్పోయిన ఉత్తమమైన జీవితాన్ని తిరిగి పునరుద్ధరించాడు. వారి విలువను పెంచాడు. మనుషులందరూ దేవుని దృష్టిలో సమానమైన గౌరవానికి అర్హులేనని, నేను నా తోటి వారిని గౌరవించడం ఆరంభిస్తాను.
5. యేసుక్రీస్తు ప్రభువులోని ఆదర్శవంతమైన సేవాభావమును అలవర్చుకుంటాను. మంచి పనులు చేయడంలోనే పోటీ తత్వాన్ని కలిగి ఉంటాను. మరొకరిని చూచి అసూయ పడను. నాకున్న అవకాశాలను సద్వినియోగపరచుకుంటాను. అందరి మేలును ఆకాంక్షిస్తాను.
పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున, ఆమెన్.
