"యేసు శ్రమల పరమార్థం - మానవాళికి దేవుని రక్షణ కవచం"

ఫాదర్ పూదోట దాసయ్య

25 Sep 2026

సామాన్య 25వ శనివారము
"చెవి యొగ్గి ఆలకింపుడు. మనుష్య కుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడ బోవుచున్నాడు అని యేసు పలికెను. శిష్యులకు ఇది బోధపడలేదు."
(పు. లూకా 9:44-45)

ప్రార్థన: నా రక్షణ కర్తయైన ఓ యేసు ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని స్తుతించి ఆరాధిస్తున్నాను. నీ గొప్ప ప్రేమను పొందే యోగ్యతను నాకిచ్చారు. నేను పాపములోనే మరణించడం మీకు ఇష్టం లేదు. నేను అనుభవించుచున్న దుఃఖంలో, కష్టంలో, సమస్యలలో, నన్ను విడిచి పెట్టలేదు. నన్ను మీ దయార్థ హృదయంతో మీ గుండెకు హత్తుకున్నారు. ఈ లోకములోనే, పాపాంధకారంలోనే నన్ను విడిచి పెట్టలేదు. నాకు రక్షణగా వచ్చారు. నాలో విశ్వాసాన్ని పెంపొందించుటకు, అనేక ఆశ్చర్య కార్యాలు చేశారు. నా ఆక్రందనలో నీవైపు చూసేలా చేశారు. అనేక రహస్య కార్యాలను మీ బోధనల ద్వారా బయలుపరచారు. దేవుని ప్రణాళికను ఆవిష్కరించారు. ధన్యత జీవితాన్ని చూపించారు. రక్షణ వరాలను కురిపించారు. పరివర్తనకు ఆహ్వానించారు. ప్రేమతో‌ నన్ను క్షమించారు, మీ హృదయంలో చోటిచ్చారు. ఓ యేసయ్యా, మీ శ్రమలు మరణం ద్వారా, నాకు ఓదార్పును, ధైర్యాన్ని‌ ఇచ్చారు. మీ మహిమాన్విత ఉత్థానం ద్వారా, నిత్యజీవ వాగ్దానం చేశారు. ఓ ప్రభువా, లోక రక్షణార్ధం, మీ శ్రమల అవసరాన్ని, మరణ పునరుత్థానాలను, ముందుగానే శిష్యులకు వివరించినను, వారికి బోధపడలేదు. మీతో పాటే ఉన్నారు. భుజించారు. ఆశ్చర్య కార్యాలు చూశారు. మీ బోధనలు విన్నారు. ప్రవచనాలు ఆలకించారు. అయినా మీ అంతరంగాన్ని గ్రహించలేదు. మీ ప్రవచన భావాన్ని గుర్తించలేదు. ఓ దేవా, అనేకమార్లు మీ సందేశాన్ని విని అర్థం చేసుకోలేక పోతున్నాము. ఆచరణకు దూరంగా ఉన్నాము. మీరు బయలు పరచిన దానిని స్వీకరించుటకు మీ కృపను చూపండి. మీ సందేశానుసారం జీవించుటకు జ్ఞాన వికాసమివ్వండి. మీ శ్రమలు, మరణ మర్మాన్ని, నేను గ్రహించే ఆత్మజ్ఞానాన్ని దయజేయండి. ఓ యేసయ్యా! మీ మరణం ద్వారా నన్ను అమితంగా ప్రేమించారు. పాప శాపము నుండి రక్షించారు. మీ ప్రేమను అర్థం చేసుకొని, మీ దివ్య చిత్తానికి లోబడి జీవిస్తూ, పరలోక రాజ్యం పొందుటకు ఆశాభావంతో ఉన్నాము. మమ్ము ఎంతగానో కృంగదీసే శారీరక శ్రమలను, ఈ లోక శోధనలను, సైతాను ప్రలోభాలను అధిగమించి, మీకు ప్రీతికరముగా జీవించుదుముగాక. ఆమెన్.

ఆత్మాభ్యాసం:
1. యేసుక్రీస్తు ప్రభువు, తన గురించి దేవుని ప్రణాళికను ఎరిగి ఉన్నాడు. తన్ను తాను సంపూర్ణముగా దేవుని ప్రణాళికకే సమర్పించుకున్నాడు. నా విషయంలో దేవుని ప్రణాళిక ఎరిగి జీవిస్తాను.
2. ఎంతటి ఘోర శ్రమ ఎదురైనప్పటికిని, దాని ప్రతిఫలం తప్పక కోల్పోము. యేసు శ్రమల పాఠం ధ్యానిస్తూ, యేసు లోకానికి అందించిన సత్య సువార్తను స్వీకరిస్తున్నాను.
3. యేసుక్రీస్తుని అనుసరించడంలో, ఎట్టి పరిస్థితి ఎదురైనప్పటికిని, విశ్వాసంలో దృఢంగా ఉంటాను. కార్య సాధనకై నిష్ఠతో ఉంటాను. ప్రభువు పరిచర్యలో నిలకడగా ఉంటాను.
4. యేసు అన్యాయంగా శిక్షను భరించిన, ఎంతో వినయముతో దానిని స్వీకరించాడు. పునరుత్థానముపై సంపూర్ణ నమ్మకము కలిగి ఉన్నాడు. మనోధైర్యంతో శ్రమలను స్వీకరించాడు. విజయంపై ఆశాభావంతో ఉన్నాడు. యేసుక్రీస్తుపై నమ్మకముతో, ఆత్మవిశ్వాసంతో జీవిస్తాను.
5. యేసుక్రీస్తు తాను అనుభవింపబోవుచున్న శ్రమలను గురించి శిష్యులతో పంచుకున్నాడు. తన గురించి ఎరిగిన శిష్యులు, శ్రమల కాలంలో దారి తప్పిపోకుండా, చెదిరిపోకుండా, ఆందోళన చెందకుండా కాపాడాడు. శ్రమల అంతరార్థమును శిష్యులు యేసు ఉత్తానంలోనే గ్రహించారు. నాతోటి వారిని ప్రేమించడమే కాదు, ఆ ప్రేమలో నిలకడగా ఉండడము అవసరమే. దుఃఖపూరితమైన యేసు శ్రమలను ధ్యానిస్తూ, దేవుని ప్రేమలో నిలకడగా ఉంటాను.

పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున, ఆమెన్.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN