పోప్ లియో XIV ఫ్రాన్స్‌లో తన అపోస్తలిక పర్యటనను ప్రారంభించారు
జోసెఫ్ అవినాష్
25 Sep 2026
పోప్ లియో XIV నాలుగు రోజుల అపోస్తలిక పర్యటన నిమిత్తం శుక్రవారం రోమ్‌లోని ఫ్యూమిచినో విమానాశ్రయం నుంచి ఫ్రాన్స్‌కు బయలుదేరారు.ఆయన ప్రయాణించిన విమానం రోమ్ కాలమానం ప్రకారం ఉదయం 7:58 గంటలకు బయలుదేరి,ఉదయం 9:56 గంటలకు పారిస్ ఓర్లీ విమానాశ్రయానికి చేరుకుంది.ఈ పర్యటనకు “ప్రపంచానికి జీవం కలగాలి” అనే నినాదాన్ని ఎంపిక చేశారు.గర్భధారణ మొదలు సహజ మరణం వరకు ప్రతి మానవ ప్రాణాన్ని స్వాగతించి,ప్రేమించి,సంరక్షించాల్సిన ఆవశ్యకతను ఈ నినాదం తెలియజేస్తుందని వాటికన్ రాష్ట్ర కార్యదర్శి కార్డినల్ పియెట్రో పరొలిన్ పేర్కొన్నారు.ఈ పర్యటనలో ఆయన పారిస్,లూర్దు,మెట్జ్ నగరాలను సందర్శించి,పౌర అధికారులతో,యువతతో,గురువులతో సమావేశమవుతారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారిని పరామర్శించి, దివ్యబలిపూజలు,ప్రార్థనల్లో పాల్గొంటారు.మానవ ప్రాణ పవిత్రత,ఆధ్యాత్మిక జీవితం,సేవాభావం ఈ పర్యటనలో ప్రధానాంశాలుగా నిలుస్తాయి.
