నేటి పునీతులు: పునీత విన్సెంటు స్త్రంబి

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
25 Sep 2026
ఇటలీలో మచెరేటా మరియు తొలెంతీనో పీఠాధిపతి క్రీ||శ|| 1745 - 1824 పునీత విన్సెంటు స్త్రంబిగారు ఇటలీదేశంలో క్రీ||శ|| 1745 జనవరి 1వ తేదీన జన్మించారు. బాల్యంనుండే తామొక మంచి క్రీస్తు సువార్తా పరిచారకుడు కావాలని ఆశించేవారు. ఆరోజు రానే వచ్చింది. తాను గురుపట్టంపొందడానికి ముందస్తుగా రహస్య రీట్రీటును వ్యక్తిగతంగా పొందారు. ఆ దివ్య సందేశాలు అందించింది పునీత సిలువ పౌలుగారని ప్రసిద్ధిచెందిన గురూత్తములు. విన్సెంటుగారిని ఒక విచారణకు చెందిన గురువుగా కాకుండా పశ్చాత్తాపసభ అనబడు షేషనిస్టు కమ్యూనిటీలో చేరమని గట్టిగా సలహానిచ్చారు.
అదే ప్రకారంగా విన్సెంటుగారు పశ్చాత్తాపసభలో గురుపట్టంపొంది ఆ సభలో దైవ శాస్త్ర ఆచార్యునిగాను, సువార్తా ప్రసంగీకునిగాను, ఇంక అనేక బాధ్యతల్లో ఉన్నతంగా ప్రకాశించారు. అందువల్ల 7వ పయస్ (భక్తినాధ) జగద్గురువులు విన్సెంటు స్వామిని మచెరేటా మరియు తొలెంటీనో పీఠంకు బిషప్పుగా ఎంపికచేసి నియమించారు. క్రీ||శ|| 1808లో ఇటలీదేశలో కొంత రాజ్య విపత్తు లేక అలజడి చెలరేగింది. ఫ్రాన్సుకు చెందిన నెపోలియనురాజు తన రాజ్యకాంక్షను ప్రదర్శించిన రోజులవి. ఎవరు విధేయించినా తాను మాత్రం నెపోలియను చక్రవర్తికి విధేయించేదిలేదని విన్సెంటు స్త్రంబి బిషప్ గారు తెగేసిచెప్పారు. అందుకు ఆగ్రహించిన చక్రవర్తి స్త్రంబిగారిని మేతాసనాధిపత్యంనుండి బహిష్కరింపచేశారు. అయితే మరో అయిదేళ్లు గడచిన పిమ్మట నెపోలియను చక్రవర్తి ఘోరంగా ఓడింపబడ్డాడు. ఆస్ట్రియనులు విజయం సాధించారు. అప్పట్లో 12వ లియో (సింహ రాయులు) జగద్గురువులు శ్రీసభను పాలిస్తున్నారు. తిరిగి ప్రజల్లోకి ప్రత్యక్షమైన బిషప్ స్తంబిగారు తమ పదవికి రాజీనామా చేశారు. కాని వారు జగద్గురువులకు సన్నిహిత మిత్రులుకావడాన జగద్గురువుల సలహాదారునిగా నియమితులై శ్రీసభ సేవగావించారు. వారు తమ 79వ ఏట క్రీ||శ|| 1824 జనవరి 1వ తేదీనే పరమపదించారు. పుట్టింది గిట్టింది. జనవరి 1వ తేదీకావడంవల్ల వారు “నూతన సంవత్సర దిన పునీతుడు అని పేరొందారు. ఈ 19వ శతాబ్దపు పునీతునికి 12వ పయస్ భక్తినాథ పోపుగారు 1950లో పునీత పట్టాతో అలంకరించి శ్రీసభను వందించారు.
